top of page

సీతాకోకచిలుక

- మానస ఎండ్లూరి -  91607 34990

 

అదే చివరి ముద్దు అని ఆమెకి అప్పటికే తెలుసు. 

                      ***

“గిరిజనులు హరిజనులు 

ఏ రోజుకారోజు 

బలిపశువులెట్లయ్యేరో 

పాపయ్య బందుకెందుకుబట్టిరో..”

డప్పు చప్పుడు లీలగా అతని స్వరం కీచుగా వినిపిస్తూ ఉంది. చిన్నగా పరిగెడుతూ వెళ్ళే సరికే పాట ముగించేశాడు. 

“అబ్బా! మళ్ళీ నీ పాట పూర్తిగా వినలేకపోయాను” అంటూ నిరాశగా స్నేహితుల మధ్యలో కూర్చుంది అరుణ.

“వాడు రోజంతా పాడతానే ఉంటాడులే. నువ్వో పాట పాడు అరుణ” చిర్రా చిటికెన పుల్లా సిద్ధం చేసుకుంటూ అడిగాడు ప్రశాంత్. 

“లేదు లైబ్రరికి వెళ్ళాలి. రాజా పాట విని ఆగాను. 

“పాడేసి పోదువులే” సునీత. 

క్షణం కూడా తడుముకోకుండా పాటెత్తుకుంది అరుణ. 

“మాలముండ కొడుకుల్లార భూములు మీకేలంటూ 

గోపన్న వలసలో పరశురాముల చంపినారు 

మాదిగ ముండల్లారా.. మీ.. కెందుకింత అందమని 

మద్దికేర మరతమ్మ మాన ప్రాణం తీసినారు

ఈ పాలించెటోళ్ళు మన ఇద్దర్ని చంపుతుండ్రు.. 

తక్షణం.. ఆత్మరక్షణ పోరుజెయ్యరో..

నిజమయ్యో.. నువ్వూ నేను శత్రువులం కాదయ్యో”

టక్కున పాట ఆపేసింది అరుణ.  

“సరే ఇంక వెళ్తా” 

“అరె చంద్రశ్రీ పాట! మొత్తం పాడేసి పోరాదు” రాజా. 

“సాయంత్రం పాడతాలే. బై” అరుచుకుంటూ లైబ్రరి వైపు అడుగులు వేసింది. 

“ఏం రా రాజా! ఎప్పుడూ లేనిది పాట పాడమని అడుగుతున్నావ్ ఆ పిల్లని” డప్పు పక్కన పెడుతూ అడిగాడు ప్రశాంత్. 

“రేయ్ అడిగింది నువ్వు!”

“పాడింది నువ్వు చెప్పాకే కదా”

“అది ఆ అమ్మాయినే అడుగు. నన్నడిగితే?”

“అంతేనా”

“అంతే”

“పోతా పోతా తిరిగి సూస్తనే ఉన్నది కద రా! నువ్ సూడలే?” రమేశ్.  

“పిచ్చి పట్టిందా మీ అందరికీ?చూస్తే చూడనీ. ఆమెకే ఏమన్నా ఇంటరెస్ట్ ఉందేమో. స్కూల్ పిల్లల్లాగా చేస్తారేంటి?”

రాజా విసుగ్గా మొహంపెట్టి కాంటీన్ లోంచి బయటకు నడిచాడు. మిత్రబృందం కూడా అతని వెనకే కదిలారు.

         ****

‘నిజంగానే అరుణకు నా మీద ఇంట్రెస్ట్ ఉండి ఉంటుందా?’ 

ఆ ఒక్క క్షణం రాజా గుండె ఝల్లుమంది. 

‘నా పక్కన ఒకమ్మాయిని ఊహించుకోగలనా? వెంటే ఉంటూ తియ్యగా కబుర్లు చెప్పడం నేను చేయగలనా? ఇవన్నీ చేస్తేనే ప్రేమా? ఛ! ఏం ఆలోచిస్తున్నానసలు’

వాస్తవ గాలులు వెచ్చగా వీచాయి.. 

         ****

“అంబేద్కర్ జయంతికి ఏం జేద్దామ్ రా? పూలేసుడు, దండాల్ వెట్టుడేనా?” సురేందర్.

“ఇంకేం చేస్తాం రా” అనిల్. 

“ఆన్లైన్ సెమినార్ పెడదామా?” సునీత. 

“కాదు ఆఫ్లైనే పెడదాం. మన ఆడిటోరియంలో” రాజా. 

“సెలవు కదరా. ఒస్తరా?” సురేందర్. 

“వస్తారు. రావాలి” రాజా. 

“స్పీకర్స్ ఎవరు ఇంతకీ?” 

“ఆ ఖాసీమన్న పక్కా ఉంటడు. కోయి కోటేశ్వర్రావన్న మొన్న పిలిస్తే రాలేకపోయిండు. ఇప్పుడొస్తడేమో అడగాలే” వెంకటాద్రి. 

“ఇంకా” 

“కత్తి పద్మారావు సార్ ఒస్తడా?” 

“అహే! ఆయన హైదరాబాద్ సభలకి రాక కొన్నేళ్ళవుతుంది”

“ఆ సరే. డీన్ సార్, హెడ్ సార్లను ఎట్లనో పిలుస్తం. రవీందరన్న ఉంటడు”

“సరిపోతార్లే” రమేశ్. 

“ఇగ పోస్టర్లు, ఫోన్లు, పిలుపులు షురూ చెయ్యాలె”

“అరుణని ఇంగ్లీష్లో ఇన్విటేషన్ రాయమని చెప్పాలి” రాజా. 

“అనిల్ రాస్తాడుగా ప్రతిసారీ”

“అరుణ కూడా ఇంగ్లీష్ డిపార్ట్మెంటే కదా. కొత్త వాళ్ళకి పని తెలియొద్దా?” లేచి గబగబా వెళ్ళిపోయాడు రాజా. 

             ***

“హలో చెప్పు” అరుణ. 

“ఏం చెప్పాలి” రాజా 

“ఏం చెప్పాలని కాల్ చేశావ్?”

“పాట పాడతావని”

“ఏం పాట”

“ఏదో చెప్దామని ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడిస్తావ్ నా చేత”

“నేనా”

“సరే చెప్పేది విను. అంబేద్కర్ జయంతి రోజున క్యాంపస్ లోనే సెమినార్ పెడుతున్నాం. నువ్వు ఇంగ్లీష్లో ప్రెస్ నోట్, ఇన్విటేషన్ రాసి పంపాలి”

“ఆ రోజు సెలవు కదా ఎవరొస్తారు?”

“వచ్చే వాళ్ళు వస్తారు. రాని వాళ్ళు మిస్ అవుతారు”

“ఎవరెవరు మాట్లాడుతున్నారు”

“ఖాసిం, కోయి, పసునూరి, మన డీన్, హెడ్. అంతే”

“అదేంటి ఒక్క ఉమన్ స్పీకర్ కూడా లేకుండా?”

“ఇదేం విమెన్స్ డే కాదు?”

“మరి మెన్స్ డే నా?”

ఫోన్ కట్ అయ్యింది. కనెక్ట్ అవ్వాలంటే కోపం తగ్గాలి. తానూ తగ్గాలి. 

కోపమైతే వెంటనే తగ్గింది. ఫోన్ మళ్ళీ కనెక్ట్ అయ్యింది.

“అలా కాదు రా..”

“ఏంటీ?” 

కొత్త పిలుపు ఈ సందర్భంలో అతకలేదు.

“అది కాదు అరుణా! స్పీకర్స్ ఎక్కువైతే టైమ్ సరిపోదు. మనమే పిలిచి మాట్లాడడానికి టైమ్ ఇవ్వకపోతే ఎలా చెప్పు. అందుకే ఐదుగురినే అనుకున్నాం”

“ఎవరనుకున్నారు?”

“నేను, రవి, సురేందర్”

వెటకారానికి చిన్నగా సరిపోతుందని పెద్దగా వచ్చే నవ్వుని విసుగ్గా కత్తిరించింది.

“సరే శ్యామలక్కని పిలుద్దామా”

“నీ ఇష్టం. నేను ఇన్విటేషన్ రాసి సాయంత్రం పంపిస్తాను”

 

           ***

“కులం కులానికీ తలారుల్ని సృష్టించి 

నువు పొందిన నిశ్చింతల విశ్రాంతిని 

గద్దనై ఎగరేసుకుపోతాను 

మండుతున్న గుండెలయల్ని

నీ పొదరిళ్ళకు తగిలించి 

నీ నిదుర దీపాన్ని ఆర్పేసిపోతాను...”

“కుల పోరాటం చేయకుండా నన్ను ప్రేమించలేవా?”

ఆ రాత్రి రహస్యంగా కెమిస్ట్రీ బిల్డింగ్ పై సమావేశమయ్యారు ఇద్దరూ. ప్రేమించుకోడానికి. 

“కులం లేనిది ఎక్కడ? నీలో ఉంటుంది. నాలో ఉంటుంది”

దూరంగానే నిలబడ్డాడు. బహుశా అరుణే దగ్గరకి రావాలని ఎదురుచూపు కూడా అయ్యుండొచ్చు.

“కనీసం మన ప్రేమలో ఉండకపోతే చాలంటావా?”

“దానికీ భరోసా లేదు”

అరుణ నవ్వింది. 

రాజా బక్కపలుచని శరీరం, నిలువు గీతల చొక్కా, నాలుగు రోజుల నుంచి వేస్తున్న అదే ప్యాంట్ తనని  ఇష్టపడడానికి దోహదపడకపోయినా తృణీకరించడానికి అడ్డంకావడం లేదు. 

రాజా అరుణని అణువణువూ చూస్తున్నా పైకి గంభీరంగానే నటిస్తాడు. ధైర్యం చేసి రెండడుగులు అరుణ వైపు వేశాడు. 

“అమ్మలూ.. ”

కొత్త పిలుపుకి ఒళ్ళు పులకరించింది. సిగ్గుపడుతున్న అరుణని అంత దగ్గరగా చూసింది రాజా ఒక్కడే కాబోలు. అరుణ మొదటిసారి రాజా చేతిని తన చేతిలోకి తీసుకుంది. దురదృష్టం. అప్పుడే మోగుతున్న ఫోన్ ను జేబులోంచి తియ్యాల్సివచ్చింది. క్షణంలోనే అరుణ చేయి వదలాల్సివచ్చింది.

“ఏంట్రా”

“రాజా! అజయ్ గాడు సూసైడ్ చేస్కున్నాడ్రా. ఇప్పుడే వీసీకి చెప్పారు. నువ్వు త్వరగా స్టూడెంట్స్ సర్కిల్ దగ్గరికి రా”

“ఏమైంది” అని అడిగింది అరుణ. స్థాణువైన రాజాను చూసి. 

“అజయ్ సూసైడ్ చేస్కున్నాడంట. నువ్వు హాస్టల్ కి వెళ్ళు. నేనటు వెళ్తాను”

“నేనూ వస్తాను”

“పద”

నేరుగా మెన్స్ హాస్టల్ కి వెళ్లారు. అరుణ బయటే ఉంది. లోపల అజయ్ ఇంకా వేలాడుతూనే ఉన్నాడు. చుట్టూ మగపిల్లలు. చప్పుడు లేకుండా చూస్తున్నారు. ఇంతలోనే పోలీస్ సైరన్. గుంపులు గుంపులుగా విద్యార్ధులు, సిబ్బంది అక్కడికి వచ్చేశారు. ఆడపిల్లలు తక్కువగా ఉండడం వల్ల అరుణపై అందరి ప్రత్యేక దృష్టి పడుతోంది. 

“మంచి పిలగాడే. ఎందుకిట్ల జేశిండో”

“గైడ్ ఏమన్నా అన్నాడేమో” 

“కాదనుకుంటా”

“అమ్మాయి ప్రాబ్లెం అంట”

“అమ్మాయే ప్రాబ్లమా?” అరుణ. 

“అలా కాదు. లవ్ ఫెయిల్యూర్ అంటున్నారు”

“ఎవరో ఓసీ అమ్మాయంట. పేరెంట్స్ ని ఒప్పిస్తానని హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుందంట”

హాస్టల్ లోపలి నుంచి జనాల మధ్యలోంచి వెక్కి వెక్కి ఏడుస్తూ వస్తున్నాడు రాజా. 

“అజ... య్!!!” అరుస్తున్నాడు.

అజయ్ కి తప్ప అందరికీ వినబడుతోంది.. 

“ఇప్పుడు చెప్పు! ప్రేమకి కులం లేదా?”

జనం ముందే అరుణ మీద విరుచుకుపడ్డాడు. ఏం చేస్తది అరుణ? షాక్ అయ్యింది. భయపడింది. 

పోలీసులొచ్చారు. హాస్టల్ గుమ్మంలోనే అడ్డుకున్నాడు రాజా. 

“ఎందుకు మీరు లోపలికి వెళ్ళేది? మా ఫ్రెండ్ కి న్యాయం జరిగే వరకు వాణ్ణి ముట్టుకోడానికి వీల్లేదు. రేయ్ రండ్రా” అంటూ మిగతవారితో కలిసి దారి బ్లాక్ చేశాడు రాజా. 

“న్యాయం జరగాలంటే ముందు ఎంక్వైరీ చెయ్యాలి కదా. తప్పుకోండి”

“అజయ్ ని మోసం చేసిన అమ్మాయి ఇక్కడికి రావాలి. ఇదే క్యాంపస్ లో వాడితో తిరిగింది. ప్రాణాలు పోగొట్టుకునేలా చేసింది”

“స్టూడెంట్స్ అయ్యుండి ఇలా మాట్లాడుతున్నారా? టైమ్ వేస్ట్ చేయకండి. జరగండి”

అరుణ చూస్తోంది.. 

“ముందు ఆ అమ్మాయి క్షమాపణ చెప్పాలి” చెమటలు కక్కుతున్నాడు రాజా. 

“ఎవరికి”

“అజయ్ వాళ్ళమ్మకి”

“ఆమెనడిగే అతను ప్రేమించాడా? తెలివుండే మాట్లాడుతున్నారా?”

క్యాంపస్ కి దగ్గరలో ఉన్న ఫ్యాకల్టీ, అడ్మిన్ వాళ్ళు వచ్చారు. కానీ స్టూడెంట్స్ ముందు వారెవరూ సరిపోవడం లేదు. చూస్తూనే గొడవ పెద్దదైంది. పోలీస్, విద్యార్ధుల కొట్లాటలో రాజా సహా పదిమందిని అరెస్ట్ చేశారు. 

అక్కడ రాజా ఇంకొద్దిపాటి హీరో అయ్యాడు. కాసేపటికి అరుణ తప్ప అందరూ స్థిమితపడ్డారు. 

            ****

అసలు రాజా ఏం ఆలోచిస్తున్నాడు అని అరుణ ఆలోచిస్తోంది.

'తన మాట వినే వేదిక మీద ఒక్క స్త్రీ అయినా లేకపోతే ఎలా అని మిగతా వారిని ప్రశ్నించాడు. ఇప్పుడు పెళ్ళైన ఒక పిల్లని క్యాంపస్ కి రావాలని పట్టుబట్టాడు. అల్లరిపాలు చేయాలని చూశాడు. వాళ్ళమ్మకి క్షమాపణ చెప్తే ఆమెకి వచ్చేది ఏంటి? ఇందులో రాజాకి దక్కేది ఏంటి?

“పాముకున్న అందం నీకెక్కడుంది?

పాముకున్న సెక్సపీల్ నీలో ఏది?

ఈసకపోయిన గొడ్డులా ఉంటావు.. 

ఎండిపోయిన సర్విచేనులా ఉంటావు..”

అంటూ మద్దూరి కవితాలతలై నన్నల్లుకున్నాడు. రెహమాన్ పాటలతో నన్ను పరవశింపచేశాడు. దిగంబర కవిత్వంతో ఉర్రూతలూగించాడు. తను రాసిన కవితలు నాకు మాత్రమే విన్పించి నా గుండెల్లోకొచ్చి కూర్చున్నాడు…'

తన రూమ్ కిటికీ పక్కన నిలబడి బంతిపూల కోసం వచ్చిన తూనీగలతో రాజా కబుర్లన్నీ చెప్తోంది అరుణ.. 

“అరుణా! రాత్రి పి ఎస్ లో ఉన్న వాళ్ళంతా వస్తున్నారు. మెయిన్ గెట్ దగ్గర ఉన్నారు. రా వెళ్దాం” పరిగెత్తుకు వచ్చింది వసుంధర.

“నేను రాన్లే. మీరు వెళ్ళండి”

తూనీగలకి చెప్పాలసింది ఇంకా చాలా ఉంది. 

‘నువ్వు లేని రాత్రి 

కలలు రాని నిద్రలా నిర్లిప్తంగా ఉంది. 

నువ్వు రాని ఉదయం 

కానరాని చీకటిలా ఉంది. 

నువ్వొచ్చే సరికి 

రేయికి పగటికి మధ్యన

సీతాకోకచిలుక నై 

ఎదురౌతాను’

నీ అరుణ 

అని వాట్సప్ లో రాసి రాజాకి పంపింది. 

‘ఎప్పుడెదురౌతావ్’ రాజా నుంచి రిప్లయ్. 

‘సాయంత్రం’

 

         ***

“ఏంటి ఎవరూ లేరా?”

మెన్స్ హాస్టల్ కారిడార్ లో భయం భయంగా రాజా చేయి పట్టుకుని నడుస్తోంది అరుణ. 

“అవతల వింగ్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అందరూ అజయ్ ఊరికి వెళ్లారు. రేపు సమాధి చేస్తున్నారు. నేను తెల్లారే బయల్దేరుతాను”

రూమ్ లోకి వెళ్లారు. వెంటనే తలుపులు కిటికీలు వేశాడు రాజా. అన్నీ తెలిసినా ఎప్పుడూ ఏదో భయం వెన్నంటే ఉంటుంది అరుణకి. బహుశా ఆడపిల్లలందరికీ. 

“చెప్పు”

“ఏం చెప్పాలి”

“సాయంత్రం ఏదో మెసేజ్ పెట్టావ్” అరుణ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రాజా. ఈసారి ధైర్యంగా.

“చాలా మిస్ అయ్యాన్నిన్ను”

అరుణ కరచాలనం బిగించింది. 

“నేను కూడా. పోలీస్ స్టేషన్ లో కొంచెం భయమేసింది. కానీ నువ్వే గుర్తొచ్చావ్. నా వళ్ళో కూర్చోవచ్చు కదా అమ్మలూ”

అరుణ కూర్చుంది. రాజాకి నచ్చింది. 

“ఇంకా..”

“తిరిగి వస్తానని అనుకున్నావా?”

అరుణ సువాసనల్ని పీల్చుతున్నాడు. 

“కచ్చితంగా అనుకున్నాను. కానీ ఇలా కలుస్తామనుకోలేదు”

అరుణ మాత్రం ఎంతసేపని ముంచుకొచ్చే సిగ్గు దాచుకోగలదు.

“నచ్చలేదా?”

నచ్చిందని సాదాగా చెప్పడం అరుణకి నచ్చదు. రాజా చంపలపై దట్టమైన గడ్డాన్ని పెదాలతో తాకుతూ చెప్పింది. అప్పటికే రాజా ముగ్ధుడయ్యాడు.  

ఎలా అంత చనువుగా రాజా పరుపు మీద నడుం వాల్చిందో తనకీ తెలీదు. 

పాదాలు..రాజా అరచేతిలో అరుణ మెత్తటి పాదాలు తన ప్రేమ గీతాల్లా ఉన్నాయి. 

“ఎంతందంగా ఉన్నాయి అమ్మలూ నీ పాదాలు. నెయిల్ పాలిష్ కూడా పెట్టలేదు”. ఆమె కాలి గోళ్లకి అతని పెదాల స్పర్శే ప్రణయ రంగుల్ని నింపాయి. 

అరుణ కళ్ళతోనే ప్రేమిస్తోంది... 

“అబ్బా! అమ్మలూ నీ పిక్కలేంటి ఇంత బావున్నాయి. అచ్చం బాపనోళ్ల పిక్కల్లాగా తెల్లగా”

పాదాలు వళ్ళోంచి కింద పడ్డాయి. రెక్కల్లేని సీతాకోకచిలుక గొంగళిపురుగై అరుణ పాదాల మీద పాకింది…

చివరి ముద్దూ ముగిసింది. 

 

                ****

mana yendluri_edited.jpg
Tirunagari_DevakiDevi_edited.jpg

ఇటేటు రమ్మంటే

 -తిరునగరి దేవకీ దేవి, 9949636515

     "ఏం మీటింగులో ఏమో?  అందులో చర్చించి తీసుకున్న నిర్ణయాలు ఒక్కటీ  అమలులో  పెట్టేది ఉండదు.అంతా నామినల్ తతంగాలు.టైం వేస్ట్ కార్యక్రమాలు." ఆలోచిస్తూ నే సృజన ఇంటి దారి పట్టింది. పది నిమిషాల్లో ఇల్లు చేరుకుంది కూడా.  గేటు తాళం తీయబోతున్న సృజనకు కాంపౌండు వాలును ఆనుకున్న వేపచెట్టుకింద పడుకున్న ఉన్న ఓ ఆకారం కనపడింది. ఓ నిమిషం తదేకంగా చూస్తే ఆ శాల్తీ  రవే అని  తేల్చుకుంది.వెంటనే దగ్గరగా పోయి "రవీ" అంటూ బిగ్గరగా పిలిచింది.ఆ పిలుపుకు చలనం లేదు. లాభం లేదనుకుని కొంచెం గొంతు పెంచింది సృజన.మాంచి నిద్రలో ఉన్న రవి ఆ పిలుపుకు ఉలికి పడి దిగ్గున లేచిండు. హైరానా పడుతూ  లేచి నిలబడి అమాంతంగా వంగి సృజనకు పాదాభివందనం చేసిండు. అలసిపోయిన రవి ముఖం చూసి సృజన హృదయం జాలితో నిండి పోయింది.
         "రవీ గాఢ నిద్రలో ఉన్నట్టున్నవ్ ?" అడిగింది సృజన
         " ఔ...టీచర్. రాత్రంతా పొలం కాడ జాగారమైంది." రవి తన గాఢ నిద్రకు కారణం చెప్పే ప్రయత్నం
         "ఎందుకు?"అంటూ  ఎదురు ప్రశ్న వేస్తూనే సృజన గేట్ తాళం తీసింది.
      "మక్కలేసినం టీచర్ . పందులు ఆ సేన్ను బతుకనిస్తలేవు. దినాం కాపల పోక తప్పుత లేదు. మల్ల తెల్లారంగనే వాడుక పాలు పోసొచ్చి ఎనిమిది గంటలకల్ల కాలేజికురికిన. అందుకే జర్రంత కునుకు పట్టింది."రవి
         " రెక్కల కష్టానికి  ఆసరయ్యే కొడుకును కన్న నీ తల్లిదండ్రులు ఏ జన్మల పుణ్యం చేసుకున్నరో గాని
మస్త్ అదృష్టవంతులు" అనుకుంట ఇంట్లకు దారి తీసిన సృజన రవిని కూర్చోమని చెప్పి లోపలికి పోయింది. ఓ పది నిమిషాల్లో కాళ్ళూ చేతులు కడుక్కొన్న ఆమె  రెండు చేతుల్లో చాయ కప్పులతో  హాల్లోకి ఎంటరైంది. ఓ కప్పును రవికి అందించి కూర్చీలో కూచున్నది. సృజన గవర్నమెంట్ స్కూల్ టీచర్ .ఆమె భర్త  శేఖర్ జూనియర్ కాలేజీ లెక్చరర్. గ్రామాలలో పేదతనంతో చావలేక బతుకలేక రోజులు వెళ్ళదీస్తున్న జనాలను ఎక్కువ.. రైతు కుటుంబాలదీ అదే పరిస్థితి.ఊళ్ళో కాలేజీ ఉన్నా వాళ్ళ బ్రతుకులలో పెద్ద తేడా లేదు.ఎందుకంటే చాలా మందికి చదువు పట్ల ధ్యాస ఏ మాత్రం లేదు.కేవలం ఫీస్ రీ ఎంబర్స్మెంట్ కోసమే చేరేవాళ్ళ సంఖ్యే ఎక్కువ.కొందరి పిల్లలకు చదువాలనే ఆసక్తి ఉన్నా పేదరికం..వ్యవసాయం పనులు ఆ చదువుకు బ్రేకులు వేస్తై.రవి వంటి వాళ్ళు ఏ ఒకరిద్దరో మట్టిలో వేసిన విత్తనం ఆ భూమిని చీల్చుకొని మొలకెత్తినట్లు  తమ లక్ష్యం చేరుకుంటూ ఉంటరు.రవి సృజన పని చేసిన స్కూల్లోనే టెన్త్ చదివిండు.ఆ పిల్లవాడి చురుకుదనం..చదువుపట్ల ఉన్న ఆసక్తి ...పట్టుదల చూసి సృజన ముచ్చట వడుతది.అవసరాన్నిబట్టి  చాలా సార్లు ఇతోధిక ఆర్థిక సాయం కూడా చేసింది .ఇప్పుడు శేఖర్ పని చేస్తున్న కాలేజీ లో ఇంటర్ యం. పి.  సి సెకండ్ ఇయర్ చదువుతున్నడు. లెక్కలలో సందేహాలను తీర్చుకోవడానికి అప్పుడప్పుడూ ప్రత్యక్షమౌతూ వుంటడు. చాయ తాగడం పూర్తి కాగానే రవి గ్లాస్ కోసం కిందికి వంగిందో లేదో రవే  ఆమె గ్లాసుతో పాటు తన గ్లాసు తీసుకొని ఇంటి వెనక్కి పోయి వాటిని కడుక్కోని రావడం నిమిషాల్లో జరిగిపోయింది. స్కూల్లుకు పోయే  హడావిడిలో  చదువలేకపోయిన పనిని పూర్తి చేయదలచుకొని ఆ పని లో మునిగి పోయింది సృజన.
               " టీచర్"
               " ఏం రవీ".     
               " గిది తీసుకో"
               సృజన ఏంటిదన్నట్లు  రవి ముకం చూసింది ." జరంత  జొన్నపిండి తెచ్చిన"చెప్పిండు రవి
               " గదెందుకు తెచ్చినౌ?"
               "సారుకు రొట్టెలంటె పానం కదాని తెస్తి."
               " ప్రతి నెల జొన్నలు తెప్పించి పిండి పట్టియ్యడం నా కలవాటే.ఇంట్ల జొన్నలున్నై. పిండున్న ది. . నువ్వెందుకు తెచ్చినట్లు."
               "మీఇంట్ల లెవ్వనికాదు. నా కుతికొద్ది తెచ్చిన."అభిమానంగ మొహం పెట్టి చెప్పిండు రవి.
               "సరె సరె..ఇప్పుడు తెచ్చినవేమో కాని ఇంకోసారి తేవొద్దు వింటున్నావా ? మీరే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డా  మీ ఎవుసంల ఫాయిదా లేకపాయె .దాండ్ల మాకు అవి ఇవి తెచ్చుడేంది?" కొంచెం మందలిం పు  ధోరణిలో అన్నది సృజన.
              "ఇంకోపారి తేను లే టీచర్."అని  తప్పొప్పుకున్నట్లు అంగీకరిస్తూనే "సారింకా వస్తలేడేంది?"
అడిగిండు.రవి
             " వస్తునే ఉండొచ్చు . వచ్చే టైం గూడ ఐంది. ఇంతల ఈ పేపర్ చదువు" అని ఆంధ్రజ్యోతి
పేపర్ రవి చేతికిచ్చి తను లోపలికి పోయింది.సృజన అడుగు వంటింట్లో పడుతున్నదో లేదో శేఖర్ అడుగు ముందు గదిలో పడ్డది.స్కూల్ నుండి వచ్చిన సృజన సాయంకాలం పనులు ముగించుకొని.. జొన్నరొట్టెలు కూడా  చేసింది. పొద్దటి పప్పు ఉండటంతో కూర వండాల్సిన అవసరం రాలేదు. ఓ ప్లేట్లో రొట్టె పప్పు పట్టుకొని  వస్తున్న సృజనకు " నమస్తే సర్. నేను పోత. " అంటున్నడు  రవి మాటలు వినిపించినై.
           "ఏం రవి .అప్పుడే పోతవా? రొట్టె తిని పో."అనుకుంట రవి చేతికి ప్లేటిచ్చి" మీరూ కాళ్ళు చేతులు కడుక్కొని రండి. రొట్టె తిందురు గాని"అన్నది. అభిమానంగనే రవి రొట్టె తిని వెళ్ళి పోయిండు.
అప్పుడప్పుడు వచ్చి శేఖర్ దగ్గర డౌట్లు క్లియర్ చేసుకోవడం రవికి మామూలే. ఎటొచ్చీ ఎంత వద్దన్నా
వినకుండా మా చేన్లవని కూరగాయలు తెస్తునే ఉంటడు. అవి తీసుకోవడం సృజనకు మనసేమాత్రం అంగీకరించదు.ఆమె ఎప్పుడూ గిట్టుబాటు లేని రైతుల గురించే ఆలోచిస్తూ ఉంటది.ఆ ఆలోచన వస్తే ఆమెకు కడుపులో దేవినట్లైతది.అందుకే రవిని చూస్తె ప్రేమ. శేఖర్ ది కూడా అదే తంతు. లెక్కలు చెప్పడమే కాదు అప్పుడప్పుడు ఆర్థికంగా ఆదుకుంటాడు కూడా.
                                                                      ***             ***            ***


            "  ఆదివారం. సెలవే. ఎవరికి? స్కూల్ కు. మరి తనకో? తనకే కాదు ఆడజాతికే సెలవు లేదు.ఏ నాడు ఉండదు కూడా.ఐనా స్కూల్ కు సెలవేమో కాని స్కూల్ పనులకు సెలవేది? పిల్లల హోంవర్క్ కరెక్షన్ ...పరీక్ష పేపర్స్ ఉండేవే." ఆలోచిస్తూనే వీకెండ్ పనులకు శ్రీకారం చుట్టింది.మధ్యలో ఓ స్పీడ్ బ్రేక్.అభిజ్ఞ నుండి ఫోన్"అమ్మా క్షేమమా అంటూ మొదలై తన చదువు..పరీక్షలు..మెస్ లో తిండి...సమస్తం చెప్పుకొచ్చింది.ఇద్దరూ బోలెడన్ని ముచ్చట్లతో ..సృజనకు టైమే తెలియ లేదు శేఖర్ పిలిచే వరకు. ఒక్కగానొక్క బిడ్డ. దూరాభారంగా డెల్హీ లో ఐ ఐ టి చేస్తున్నది.ఫోన్ పలకరింపులే ఆ తల్లికి  ఓ ఊరడింపు. దగ్గర లేదన్న బాధ తప్ప అభిజ్ఞ గురించి వాళ్ళకేమాత్రం రంది లేదు. చురుకైన పిల్ల.చదువుల సరస్వతి. .  
          వాళ్ళిప్పుడు ఇంటి ఆవరణలో పెంచుతున్న మొక్కలను స్వంత పిల్లలను పెంచినంత జాగ్రత్తగా శ్రధ్ధగా పెంచుతున్నరు.వాటి ఆలనా పాలనలో ఆనందమే కాదు. ఆరోగ్యం కూడా. ఎందుకంటే స్వంతగా పెంచుతున్న  కూరగాయలు తాజాగా ఉండటమనేది కాదు ఏ కెమికల్స్ చల్లని ఆర్గానిక్  జాబితావి. అంతేనా అభిజ్ఞ ఆలోచనలనుండి  ఓ డైవర్షన్.అట్లా ఓ ఐదు సంవత్సరాలు చాలా సాద.ా సీదాగా గడిచిపోయినై.
                    సాయంకాలం నాలుగు కావస్తుంది .సృజన ఇంటిముందు ఆవరణలో  ఇంటి వెనుకచెట్లకు నీళ్ళు పట్టే పనిలో శేఖర్ బిజీగా  ఉన్నరు.గేటు చప్పుడుకు సృజన తల తిప్పింది.గేటు తీసింది ఎవరో కాదు. రవే.  " ఏయ్ రవి .నువ్వేనా? రా! రా! బాగున్నావా? " అంటూ సంతోషంగా పిలిచింది.
              "అంతా మీ దయ టీచర్. "అనుకుంటనే అమాంతం కాళ్ళ మీద పడ్డడు.
              "లే లే ఇదేంపని.ఇంతకూ ఏం విశేషం." అనుకుంటూ రవిని కాళ్ళ మీదినుండి లేవదీసింది.
రవి స్వీటు పాకెట్ తెరుస్తూ  సారేడున్నడు?"అనుకుంట దిక్కులు చూసిండు." ఆగాగు. కొంచెం గుర్రాన్ని కట్టై. ఇంతకూ ఈ స్వీటేంటిది?ఓ.. రిజల్ట్స్ వచ్చినై కదా ! మరిచే పోయిన.ఫస్ట్ క్లాసే వచ్చుంటౌ.ఔను కదా! " అని సృజన ప్రశ్నలు తనే వేసి జవాబులు తనే చెప్తూ తెగ సంబుర పడ్డది. పైగా  పెద్దగా " ఏమండీ! ఇదిగో మన రవి శుభ వార్త తెచ్చిండు. తొందరగా రండి ."అంటూ పిలిచింది.శేఖర్ కూడా అంతే సంతోషంగా గబగబా చేతులు కడుక్కొని వచ్చిండు. శేఖర్ కు కూడా వీర లెవల్లో పాదాభివందనం చేసిన రవి మెల్లగా స్వీట్ డబ్బా తెరిచి చెరో కోవాబిళ్ల అందించిండు. వాళ్ళా స్వీటు ముక్కను తిరిగి రవికే
తినిపించిన్రు. ఈ దండాలు పెట్టడం స్వీటు తినిపించడం కాదు. నువ్వు ఉత్తముడిగా ఎదిగితే మాకదే పది వేలు." అన్నారు ఇద్దరు.
          "సర్...అంతా మీదే దయ."
           " ఇందులో మా దయేంగాని నీ ప్రయత్నం పట్టుదలలే నీ సక్సెస్ కు కారణం" అన్నది సృజన?
           "గట్లనకండి మేడమ్. ఇంటర్ రాంగనే యల్.యల్.బి చేయమని  చెప్పింది మీరే కదా!"
మెల్లెగ ఏదో లింక్ ఆడ్ చేసిండు రవి.ముగ్గురూ హాల్లో చేసిన్రు.కాసేపు చదువులు ఉద్యోగాలపై చర్చ జరిగింది .సవ్యసాచి సృజన ఒకవైపు వాళ్ళిద్దరితో మాట్లాడుతూనే వంటింట్లోకి పోయి స్టౌ మీద బియ్యం పడేసి వచ్చింది.
           "బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాయి రవి " సలహా ఇచ్చిండు శేఖర్ .
          " రాద్దామనే ఉన్నది సర్.పగలేమన్న పని చేసుకుంట రాత్రి పరీక్షకు ప్రిపేర్ కావాలనుకుంటున్న"
రవి
          " పనంటె ?.."
          " ఎవరన్న లాయర్ దగ్గర జూనియర్ గ చేర్పించండి" బ్రతిమిలాడే ధోరణిలో కాదు మీదే ఆ బాధ్యత అన్న లెవల్లో మాట్లాడిండు.
                " రెండెట్ల కుదురుతై.జూనియర్ గ పని చేసుడంటే మాటలుకాదు.పొద్దు మాపు ఆఫీస్ ల పనుంటది.మధ్యాహ్నం గూడ ఏ కోర్టుకు పొమ్మంటే ఆ కోర్ట్ కు అటెండై బెయిల్ ఇప్పించడం..కేసులకు వాయిదా డేట్స్ తీసుకోవడం .మస్త్ పనులుంటై. ఇకఎగ్జామ్  ప్రిపరేషన్ కు టైం ఎక్కడ  దొరు కుతది" అడిగిండు శేఖర్.
                "కేసులతోటి అనుభవం వస్తదని అనుకుంటున్న సార్ .పైగా నా చేతి ఖర్చులు కూడ ఎల్తైయని ఆశ. ఎట్లనన్న మీరు జర కోశీశ్ చేయ్యండి. నేను కష్టపడుత." పని ఇప్పియ్యక తప్పదన్నట్లు మాట్లాడిండు రవి.
               "సరె ..ఐతే  హైదరాబాద్ లో నా ఫ్రెండ్ గోపాల్ హై కోర్ట్ అడ్వకేటుగ పని చేస్తున్నడు.మంచి పేరున్న లాయర్. నువ్వు మంచిగ పని చేస్తనంటె ఫోన్ చేస్త."శేఖర్.
               "తప్పకుండా కష్టపడుత మీకు మాట రానీయ. నా మీన నమ్మకముంచండి" అంటూ రవి నమ్మ పలకడంతో శేఖర్ గోపాల్ కు ఫోన్ కలపడం..విషయం చెప్పి అంగీకరింప చేయడం అన్నీ ఒకటి వెంట ఒకటి జరిగిపోయినై..రవి ఆ పూట అక్కడే భోజనం చేసి.. శేఖర్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ తీసుకొని వెళ్ళి పోయిండు.
                                                                               ***     
        ***            ***

              కాలం గడుస్తునే ఉంటది. ఏ పరిస్థితులు దాని ప్రయాణాన్ని అడ్డుకోలేవు.అది ఎవరి కొరకు
ఆగదు కూడా.రవి గోపాల్ దగ్గర చేరి అప్పుడే రెండు నెలలైపోయింది.పొద్దున్నే చాయ తాగుతూ పేపర్ తిరగేస్తున్నడు శేఖర్. నేనూ ఉన్నానంటూ ఫోన్ చెవులను బద్దలు కొట్టింది."ఎవరై ఉంటారు ?" అనుకుంటూనే ఫోన్ ఆన్ చేసిండు శేఖర్ .
              "హలో ! శేఖర్ మహాశయా! క్షేమమా!" అంటూ గోపాల్  నుండి ఫోను
            ఎందుకో ఆ రోజు లేచింది మొదలు  రవి గురించే ఆలోచనలు.రెండు పనులు సవ్యంగా చేయ గలుగుతున్నాడా లేదా? అని ఆలోచిస్తున్న శేఖర్ కు వెతుకబోయిన తీగ కాళ్ళకు తగిలినట్లనిపించింది.
             " నాకేం. నిక్షేపంగా ఉన్నాను. నీ సంగతే ఆలోచిస్తున్నాను."
             " నా గురించా? నీ శిష్యపుంగవుడు రవి గురించా ఆలోచించేది? " కొంచెం నిష్ఠూర ధోరణి లోనే అన్నాడు గోపాల్
            " ఎందుకు మహానుభావా..ఆ నిష్ఠూరం?"
            "భలే మంచి కాండిడేట్ ను పంపించినౌ"
            "ఇంతకు ఏమైందో చెప్పు.సస్పెన్స్ తో చంపక"
           "చెప్పక తప్పుతదా! మంచి పిల్లగాడిని పంపించినౌ కదాని మస్త్ సంబరపడ్డ.కాని మస్త్ హుషారుతనం చేస్తుండు మీ రవి.అన్ని బద్మాష్ పనులే. వచ్చిన క్లయింట్ల దగ్గర ఏందేందో ముచ్చట్లు చెప్పి పైసలు గుంజుడు..అవకాశం చూసి లేడీస్ కు లైనేసుడు...పైగా ఏ రోజు ఆఫీసుకు టైంకు రాడు. అదేందంటే.  బార్ కౌన్సిల్ ఎక్జామ్స్ ప్రిపరేషన్ అంటడు.ఒకటా..రెండా ..ఎన్నని చెప్పమంటవ్? .కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేట్లున్నది.."తన గోడు వినిపించుకున్నడు గోపాల్.
             "బుధ్ధిమంతుడనే నీ దగ్గరికి పంపించిన. నిజం చెప్పాలంటె ఈ ఊర్లె ఉన్నప్పుడు ఈ లక్షణాలేవి లేకుండె.ఇంత తతంగం జరిగిందా? ఐనా సరిగ్గ కేసులు అటెండ్ ఐతే లా అంత మంచిగ అర్థమయ్యేది కదా! గిట్లెందుకు చేసిండు.నిన్ననవసరంగ తిప్పలు పెట్టినట్లైంది."
             "నువ్వు చెప్పిన లక్షణాలేవి ఆ పిల్లగానిల మచ్చుకు గూడ నాకు కనపడలే."
             " నీ మాటలను పట్టి చూస్తె సైడ్ ట్రాక్ అయిండని అర్థమైతున్నది.ఇట్లైతదనుకుంటె నీ దగ్గరికి పంపియ్యకుంటి. వాడి వల్ల నీ రిపిటేషన్ దెబ్బతింటది కదా!"బాధతో అన్నడు శేఖర్ .
             "అందుకే దొరా! నీకు ఫోన్ చేస్తున్న."గోపాల్ గొంతు.
             "ఏం చేద్దాం. కనీసం ఆ తప్పును దిద్దుకునే ప్రయత్నాన్ని చేద్దాం.వాణ్ణి పంపించెయ్."అని చెప్పి సృజనకు విషయాన్నంత పూసగుచ్చినట్లు చెప్పిండు.పేదవాడు..వృధ్ధిలోకి రావలసినవాడు..
వచ్చి తీరాలని తోచిన సాయం చేస్తే ..ఫలితం ఇంకో రూపంలో కనబడ్డందుకు వాళ్ళు తలలు పట్టు
కున్నారు. ఆ రోజు వాళ్ళకు కంటిమీదికి కునుకు రావడానికి నిరాకరించింది.
                                                                                  ***     
        ***            ***


              గోపాల్ ఫోన్ చేసి వారం రోజులైంది.సాయంత్రం  గోడ గడియారం ఐదు గంటలను మోగించింది. సృజన..శేఖర్ లు టీ తాగుతూ అభిజ్ఞ పెళ్ళి..భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నరు.
బెల్ మోత వాటిని అడ్డుకున్నది. తలుపు తీసిన సృజనకు రవి దర్శనమిచ్చిండు.అంతకు ముందు  పాదాభివందనాలు చేసిన అతని పధ్ధతి నమస్కారానికి మారింది.సృజనా..శేఖర్ లు కోరుకున్న దదే .వినయం..విధేయత చేసే పనులలో ఉండాల్సి తప్ప..దండాలు"పాదాభివందనాలు కాదని వాళ్ళు కోరుకున్నది కూడా అదే.
              "ఆఁఁరవీ! బాగున్నావా? రా!రా!కూర్చో"అని కుర్చీ చూపించిండు శేఖర్.రవి అసహనంగా కూర్చున్నడు.అది గమనించినా...గమనించనట్లే...ఏం విశేషాలు?"అడిగిండు శేఖర్..తనకేమొ తెలియదన్నట్లు.
               "సార్! గోపాల్ సారు నన్ను ఆఫీసుకు రావద్దన్నడు."
                 "ఎందుకు ?"
                "ఏందో ఆయన సంగతి నాకు సమఝ్ కాలే. మీరేమొ మంచోడు .సాయం చేస్తడని పంపించిన్రు. ఆయనేమొ మస్త్ పనులు చెప్తడు. ఏ పని జర అటిటు ఐనా బగ్గ తిడుతడు."
                 "నువ్వు సరిగ్గ పనులు చేసినా తిట్లు తప్తలేవంటవ్?" కొంచెం అసహనంగానే అన్నడు
శేఖర్."ఐనా ఆఫీసుల మస్త్ పనుంటదని ఆయనకు తగ్గట్టుగ నడుచుకోవాలని ముందే చెప్తికద.మళ్ళీ అన్నడు శేఖర్.
                 "చెప్పిన్రనుకొండి.కని గింత తిప్పలనుకోలె.ఎగ్జామ్ ప్రిపరేషన్ ల రాత్రి జాగారమైంది పొద్దుగాల ఆఫీసుకు అప్పుడప్పుడు జర లేటైతుండె. దానికి అందరి ముందు చెడామడా తిడుతుండె"
                 "అందరంటె?"
                 "ఆఫీసుల ఉండే జూనియర్ల ముంగల"
                 "సరె ఆయనకు నీకు కుదర లేదు. వేరే దారి వెతుక్కోక తప్పదు"
                 " మీరేమన్న హెల్ప్ చేస్తె ఈ ఊళ్ళోనే ఆఫీసు తెరుసుకుంట"అన్నడు మెల్లగ. రవి మాటకు ఏంజవాబు చెప్పాలో అర్థంగాక అయోమయంలో పడ్డడు శేఖర్ . కొంచెం ఆలోచించి ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కు కొంత సాయం చేస్త. ప్లేస్ వెతుక్కో.." శేఖర్ చెప్పడంతో రవి ఇంటి దారి పట్టిండు.రవితో సృజనకు మాట్లాడాలనిపించ లేదేమో..వాళ్ళ సంభాషణలో పాలు పంచుకోలేదు. కాని ఆఫీస్ ఎస్టాబ్లిష్ మెంట్ విషయం విని "రవి తీరును చూస్తుంటే ఇది అపాత్రాదానమనిపిస్తున్నది. "అంది శేఖర్ తో.
                 "చూడు సృజన.కొన్ని సమయాలలో ఇటువంటి నిర్ణయాలు తప్పవు.మెడకు పడ్డ పాము కరువక మానదు కదా!"అని సర్ది చెప్పిండు శేఖర్. చెప్పిన మేరకు శేఖర్ సహాయం చేసినా  రవి ఆ ఫలితాన్ని దక్కించుకోలేక పోయిండు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది. మరో రెండు నెలలకు శేఖర్ సృజనలముందు మరోసారి ప్రత్యక్షమైండు. విషయమంతా తెలిసిన ఆ భార్యాభర్తలకు ఏం మాట్లాడాలో అర్థంగాకమౌన ముద్రలో ఉండి పోయిన్రు.పేపర్ చదువుతున్నట్లు నటించిన శేఖర్
"ఆఁ చెప్పు రవి ..ఏం సంగతి?"ప్రశ్నించిండు శేఖర్.
                 "మీరు కొంచెం సాయం చేస్తె అమెరికా పోత." అన్న రవి మాటలు విని ఇద్దరూ షాక్ తిన్నరు.
మూర్ఛ వచ్చినంత పనైంది.స్పృహలోకి రావడానికి వాళ్ళకు కొంచెం కష్టమే ఐంది. కొంచెం సేపు మాటా మంతీ లేకుండా కూర్చుండి పోయిన్రు.
                  "మీ అభిజ్ఞ అమెరికాలనే ఉండె.నన్ను పంపిస్తె ఆమెకు తోడుగ ఉంట. కావలసిన సాయం చేయొచ్చు.పరాయి దేశంల ఓ మగతోడు అవసరమే కదా ! "అంటూ ఇంకా ఏదో మాట్లాడే ప్రయత్నం
చేయబోయిండు. శేఖర్ కోపం నసాళానికి ఎక్కింది. ఐనా తమాయించుకొని స్థిమితంగానే
                  "రవీ! గుఱ్ఱాన్ని నీళ్ళ వరకు తీసుక పోయినా ఆ నీళ్ళు తాగాల్సిన బాధ్యత గుఱ్ఱానిదే. ఇప్పటివరకు మేం చేసిన సహాయం అటువంటిదే.ప్రస్తుతం నీ భవిష్యత్తుకు నువ్వే బాటలు వేసుకోవాలె.
ఇంకొకరిపై ఆధారపడడం మంచిది కాదు." శేఖర్ .
                 "మీరు చెప్పిన్రనే లా చేసిన.లేదంటే బి టెక్ చేసి సాఫ్టువేర్ ఇంజనీ్ గ. ఎప్పుడో అమెరికాల వాల్తుంటి. గిప్పుడేమొ మాకేం సంబంధం లేదనబడ్తిరి" రవి. శేఖర్ కోపం తారాస్థాయికి
పోతున్నా తనను తాను సంబాళించుకుని. "చూడు రవి. అవన్నీ కుదరని పనులు.అటువంటి
ఆలోచనలేం పెట్టుకోకు.ఇంత వరకు తోచిన సాయం చేసినం.ఇక మా వల్ల కాదు" అని నెమ్మదిగా  చెప్పినా ఖచ్చితంగానే అన్నడు.
                 "కొంచెం మల్లో సారి ఆలోచించండి."కొంచెం ఒత్తిడి తెస్తూ అన్నడు రవి.
                  "ఈ విషయంలో నాకు సెకండ్ థాట్ లేదు."అని చెప్తూనే లేచి లోపలికి పోయిండు...ఇక నువ్వు వెళ్ళిపోవచ్చనే సూచనగా
                                                                               ***     
        ***            ***

                    డిసెంబరు నెల.విపరీతమైన చలి.ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా ఉన్నది.రెండేళ్ళ తర్వాత అభిజ్ఞ ఇండియా వచ్చింది.పిల్లకేవేవో పిండి వంటలు చేసి పెట్టాలనే ఆరాటం..బోలెడన్ని ముచ్చట్లు మాట్లాడుకోవాలనే ఉబలాటం...వచ్చిపోయే చుట్టాల స్నేహితుల దాడి .సృజనకు ఊపిరి సలపడం లేదు. అభిజ్ఞకు ఇష్టమని  అరిసెల పని పెట్టుకున్న సృజన బెల్లం పాకం పడుతున్నది.
                  "అమ్మా! నేను మాధవి వాళ్ళింటికి పోతున్న."చెప్పింది అభిజ్ఞ .
                  "సరె మంచిది.తొందరగా రా.సరేనా?" సృజన
                   "వాళ్ళింట్లోనే లంచ్.అనన్య...భార్గవి..రమ్య..రంజిత అంతా కలుసుకుంటున్నాం. ఐనా ఈ విషయం మొన్ననే చెప్పిన కదా! మరిచిపోయినట్లున్నవ్."
                  " ఔను తల్లీ. రకరకాల పనులలో. ఒక్కటీ జ్ఞాపకముండి చావడంలేదు. సరె.మంచిది..ఏది ఏమైనా చీకటి పడక ముందు వచ్చై వింటున్నావా?" వంటింట్లోనుండే అన్నది సృజన అభిజ్ఞ వాళ్ళ అమ్మ మాట విన్నదో..లేదో కాని"అమ్మా! బై అంటూ వెళ్ళిపోయింది.
                సాయంత్రం ఐదు కావస్తుంది .అభిజ్ఞ మాధవి ఇంటినుండి తిరుగు ముఖం పట్టింది. స్నేహి తులతో గడపడం ఎంతో హాయిగా ఫీలైంది.తిండికన్నా ముచ్చట్లు కడుపు నింపేసినై.ఆ అనుభూతి గాలిలో తేలిపోయినట్లనిపించింది.ఆ ఊహలలో తేలియాడుతూ నడుస్తున్న అభిజ్ఞ కు
               "అభిజ్ఞా బాగున్నావా?"అన్న గొంతు వినిపించింది.ఎవరై ఉంటారని తల వెనక్కి తిప్పింది.
" ఎవరో కాదు. రవే.ఎప్పుడూ అమ్మా నాన దగ్గరికి వచ్చిన శాల్తీ" అనుకుంది.
               "అమెరికానుండి ఎప్పుడొచ్చినౌ."రవి ప్రశ్న.
               "థర్డ్ డిసెంబరు ."
                "జాబ్ చేస్తున్నవట కదా!"
                 "ఔను రెండేళ్ళైంది"
                 "మరి పెళ్ళెప్పుడు చేసుకుంటవు?"
              "రవి మాట్లాడే తీరు అభిజ్ఞకు ఏమాత్రం నచ్చక పోయినా బాగుండదని ముక్తసరి జవాబులు చెప్తూ పోయింది.మరీ పెళ్ళి విషయం మాట్లాడడం ఇబ్బందిగనే కాదు .కోపం తెప్పించింది.ఐనా తమాయించుకొని "ఆవిషయం  అమ్మా వాళ్ళు చూసుకుంటరు"అని పొడిపొడిగా చెప్పి నడక వేగాన్ని పెంచింది. ఐనా పట్టు వదలని విక్రమార్కుడిలా "అమెరికా పోయినా అమ్మ కొంగు చాటు పిల్లలా?"అం
టున్న రవి మాటలు లీలగా చెవులలో చేరినై.ఇంట్లో అడుగు పెట్టిందో లేదో రవి విషయం పూసగుచ్చి నట్లు తల్లికి చెప్పింది.
అక్కడే ఉండటంతో శేఖర్  చెవిలో కూడా పడ్డదావిషయం.ఇద్దరూ రవి నడుచుకుంటున్న తీరు అభిజ్ఞ ముందు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. కాలం దాని మానాన అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది.  అభిజ్ఞ అమెరికా తిరుగు ప్రయాణం కట్టింది.ఇల్లంతా చిన్నబోయింది.మనసు నిండా అభిజ్ఞ  జ్ఞాపకాలు  ..కళ్ళ నిండా ఆమె ఛాయలు..చెవుల నిండా ఆమె మాటల సవ్వడులు.సృజనకు ఏమీ తోచడం లేదు. కాలుగాలిన పిల్లోలె ఏవేవో సదరడం అడ్డం పెట్టుకొని అయోమయంగా అటూ ఇటూ తిరుగబట్టింది. బర్ ర్ న గేటు చప్పుడు కాంగనే  ఎవరై ఉంటరు? గింత చప్పుడేంటిది? అని ఆలో చించుకుంటనే ఇంటి ముందరికి పోయింది.లోపలికి రాష్  గా ఎంటరౌతున్న రవి. ఆ తీరు చూస్తే కొంచెం మందేసిన ట్లున్నడు.ఆ చప్పుడుకు  చెట్ల పనిలో ఉన్న శేఖర్ కూడా గబగబా చేతులు కడుక్కొని ఇంటిముందుకు వచ్చిండు.
               "నమస్తే సారు."  కొంచెం సాగదీస్తూ అన్నడు.ఆ సాగతీతలో అమర్యాద కనిపించింది.ఆ వాలకం చూసి ఇద్దరికీ ఇంట్లోకి రమ్మనాలె అనే ఆలోచనే రాలేదు.
                 "చెప్పు రవీ ! ఏం సంగతి?"
                 "పెళ్ళెప్పుడు చేస్తరు?"
                  "ఎవరిది?"
                  "ఇంకెవరిది? నాదే"
                 "నీ పెళ్ళి మేం చేయడమేంది?"
                 " మీ బిడ్డతోని జరిగే పెళ్ళి మీరు గాగపోతె ఇంకెవరు చేస్తరు?" ఎదురు సవాలిసిరిండు రవి.
                " నా బిడ్డ తోని నీ పెళ్ళైంది? పిచ్చి లేసిందా?."
                 "పిచ్చేం పిచ్చి. మా ప్రేమ  మీకిష్టం కాలేదా!"
                 " మీ ప్రేమేంటిది? అభిజ్ఞ  నిన్నెప్పుడు ప్రేమించింది?"
               " మరిశి పోయినట్లు నాటకాలాడుతున్నరేంది.నీ బిడ్డ నా ఎంట తిరుగలేదా?. అమెరికా ఉడాయించంగనే అన్ని మరిసి పోయినారు." అంటున్న రవి మాటలకు శేఖర్ కోపం నసాళానికెక్కింది.
                " మా బిడ్డ నీతోనెప్పుడు తిరిగింది. నిన్నెప్పుడు ప్రేమించింది. ఆమె చదువంత పట్నంల ఢిల్లీలనే జరిగె.ఎక్కువ తక్కువ బద్మాష్ తనం చేస్తె 420 కేసుల బొక్కలేయించుత. చల్ నడువు  అను కుంటనే రవి గల్లా పట్టి  బయటకు నెట్టి గేటేసిండు.ఆ రోజు సృజన..శేఖర్ లకు నిద్రే పట్టలేదు." తిన డానికి తిండి లేక పోయినా చదువాలనే ఆశ పడుతున్నాడని  తోచినంత సాయం చేస్తే ....కృతజ్ఞత లేదు. సరే తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమేంది?"   రక రకాలు ఆలోచిస్తూ  చాలా బాధ పడ్డారా భార్యాభర్తలు. మరు నాడు ఎందుకైనా మంచిదని పోలీస్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిన్రు.


                                                                            ***             ***            ***


              కాలం మరో రెండు సంవత్సరాలను మింగింది.పెళ్ళి హాలంతా కళ్ళు మిరుమిట్లుగొలిపే అలంకరణలో అందరినీ అబ్బురపరుస్తున్నది.అతిథులతో హాలు కిటకిటలాడుతున్నది.సొన్నాయి చప్పుళ్ళ వీనులవిందు చేస్తుంటే....పూలపరిమళాలు ముక్కుపుటాలను  అదుర గొడుతున్నై.కొందరు వెల్ కం డ్రింక్ ఆస్వాదిస్తున్నరు.మరి కొందరు సున్నితంగా తిరస్కరిస్తున్నరు.హాలంతా కోలాహలంగా ఉంది. పెళ్ళి పేరిట స్నేహితులు బంధువర్గం కలుసుకునే మంచి అవకాశం.కరచాలనాలు..ఆలింగనాలు ...  నవ్వులు .. అలజడి.కేరింతలు...అంతా చూడ ముచ్చటగా.జిలకర బెల్లం పని ముగిసింది.ఇక మిగి లింది మంగళ సూత్ర ధారణ.పూజారి "మాంగల్యం తంతునానేనా" అంటూ మంత్రం మొదలు పెట్టిండు. ఈ లోగా ఏదో అలజడి.పదిమంది మూక మంటపం వైపు దూసుకు వస్తూ.ఆ మూక ముందున్నది ఎవరో కాదు.రవి.అనుకోని సంఘటన. అంతా అయోమయంగా..ఏం జరుగుతుందో అర్థంగాక.
          " నా తోని తిరిగి  ఇంకోణ్ణి లగ్గం చేసుకుంటవా? ఏం కిలాడివే . ఈ పెండ్లి ఎట్లైతదో చూస్త" అను
కుంట మండపం వైపు పోతున్నడు.వెంట మిగిలిన వాళ్ళు. ఏంమాట్లాడుతున్నరో  ఎవరికి ఏమర్థంకావ డం లేదు.సృజన శేఖర్ లబంధు వర్గంలో యువత  వెంటనే స్పందించి ఆమూకతో తలపడ్డరు.ఈ పరిస్థితిని ముందే ఊహించిన శేఖర్  పోలీసులకు ఫోన్ చేసిండు.హాల్లో జనమంతా లేచి నిలబడ్డరు.
సృజన అన్నయ్య రేవంత్ కలగజేసుకొని అందరినీ కూర్చోబెట్టిండు.పదినిమిషాల్లో పోలీసుల జీపు రావడం..రవి గాంగ్ ను పట్టుకపోవడం జరిగి పోయింది.పెళ్ళి కొడుకు మేనబావే కావడం..విషయం  
ముందే తెలిసిందై ఉండటంతో ఏ అపార్థాలు లేకుండా పెళ్ళి సవ్యంగా జరిగి అంతా ఊపిరి పీల్చుకున్నారు.


                                                                                         ***             ***            ***


         సెలవులు పెద్దగా లేకపోవడంతో అభిజ్ఞ  ఆదిత్య అమెరికాకు తిరుగు ప్రయాణం కట్టిన్రు.సృజన
పెళ్ళి తర్వాత సార్టౌట్ పనులతో సతమౌతున్నది.
         "సృజనా! రేపు బయలుతన్నామమ్మా!" అన్నది వాళ్ళమ్మ ఆండాళమ్మ.
         "అప్పుడేనా? ఇంకా  సర్దుకోవాల్సిన పనులు...ఎవరి వస్తువులు వాళ్ళకు చేర్చడం...లెక్కలు సరిచూసుకొని ఎవరికివ్వాల్సినవి వాళ్ళకు ముట్టచెప్పాలె.నువ్వుంటే నాకు కొంచెం సౌలత్ గ ఉంటది. ఇంకో వారం రోజులుండమ్మా!"బతిమాలే ధోరణిలో అన్నది సృజన
         "అందుకే నానను ఉండమన్న. అన్నయ్య వదినలకు జీవితంలో సెలవులు దొరకడం కష్టం. డాక్టర్ల బతుకులే గంతనుకో.మరి పిల్లలను చూసుకోవాల్నాయె .తప్పదుకదా!"సమఝాయించి చెప్పింది తల్లి.సృజన ఒప్పుకోక తప్పలేదు.అనుకున్నట్టే ఆమరుసటి రోజే ప్రయాణమయ్యిన్రు.వాళ్ళను సాగనంపి గేటువేయబోతుంటే ఓ నలుగైదుగురి గుంపు ఇంటివేపు వస్తున్నట్టనిపించింది. తీరా చూస్తే వాళ్ళెవరో కాదు.రవి తల్లిదండ్రులు ..వాళ్ళ చుట్టాలు. వాళ్ళు వస్తూ వస్తూనే అమాంతం శేఖర్ కాళ్ళమీద పడి "చమించు బాంచెను. వాని నోట్లె మన్నుపడ.కన్నకొడుకోలె సూసుకుంటె మీకే ఎసరు పెట్టిండు.తప్పైంది .మల్ల ఈ ఊరి దిక్కు రానియ్యం బాంచెను.మా అన్న కొడుకు తోని బొంబై పంపిస్తం. మీరు దయతలిస్తెనే బెయిలొస్తదంట. సచ్చి నీ కడుపున పుడుతం " అని గీమాలుతునే ఉన్నరు.
          శేఖర్  సృజన..సృజన వాళ్ళ నాన ముగ్గురూ ఒకరి ముకం ఒకరు చూసుకున్నరు.ముగ్గురికి ముగ్గురూ  ఇంటిముందున్న కుర్చీలలో కూర్చున్నరు.ఎవరి నోటి నుండి ఒక్క మాట పెగల్లేదు.దీర్ఘాలోచన లో మౌనంగా ఉండి పోయిన్రు. ఓ పదినిమిషాల తర్వాత
          "ఓ ఆడ పిల్ల జీవితంతో చెలగాటమాడి ఇప్పుడేమొ సుద్దులు మాట్లాడవడ్తివి.మా అదృష్టం బాగుండి ...పిల్ల భర్త..అత్తగారోల్లు నీ కొడుకే బట్ట కాల్చి మీదేస్తున్నడని అర్థం చేసుకున్నరు.లేదంటే ఎంత ఘోరం జరుగుతుండె. ఐనా ఇప్పుడు మా చేతులేమున్నది" బాధ కోపం కలగలిసిన గొంతుతో అన్నడు శేఖర్ .
           "గట్లనకండి బాంచెను. దయగల్ల మారాజులు. మీరే గిట్లంటె మా బతుకులేంకాను..పోంగ పోంగ ఒక్కడే దక్కిండు.సస్తె కాష్టం చెయ్యనీకె సుత ఎవరు లేరు. వాడు తప్పు చెయ్యలేదంటలేము. చేసిండు.పోలీసోల్లు బరిగెలతోని బగ్గనే లగ్గం చేత్తాన్రు. ఇప్పటికే ఆనికి దేవుడు యాది కొస్తాండు. మల్ల ఇంకో ఆడపిల్ల ముకం సూడడు. " రవి తండ్రి.
          " నీ కొడుకు చేసిన తప్పు చిన్నా చితుక కాదు కదా! ఐనా ఇంత సహాయం చేసినోల్లకు కీడు తలపెట్టాలనే ఆలోచనెట్లొచ్చిందో." సృజన తండ్రి పరంధామయ్య అడిగిండు.
           "బుద్ది గడ్డిదిన్నది బాంచెను. సెప్పుడు మాటలిన్నందుకు తగిన సిచ్చ పడ్డది. "
           "చెప్పుడు మాటలేంది? మా కర్థంకాలె. "సృజన
           "శేఖర్ సారు మస్తు అరుసుకుంటున్నడు నిన్ను. పిల్లనుగిన ఇస్తడా ఏంది? ఓ పారి అడిగి సూడక పోయినౌ.వాల్లకు కట్నం తప్పుద్ది.నువ్వు అమెరికల మంచిగ బతుకొచ్చు." అన్నడట ఓ ఆసామి
           " ఈ మాట ఎవరన్నరు?"
           " పేరు నాకు తెలువదు  బాంచెను. నువ్వు కొలువు చేసే తాన్నె సేస్తడట." అన్న రవి తండ్రి మాటలు విని ఆ పుణ్యాత్ముడు ఎవరై ఉంటాడా?"అన్న ఆలోచన వాళ్ళ మెదళ్లను తొలవడం మొదలు పెట్టింది.ఓ గంటసేపు ఏడ్చి మొత్తుకొని వాళ్ళు వెళ్ళి పోయిన్రు.ఆ మనిషి ఎవరో తేల్చుకోవడంలో మునిగి పోయిండు శేఖర్ .పుట్టను తవ్వి పామును తీసినట్లు తనెంట గిట్టని వాళ్ళెవరై ఉంటారని తీవ్రంగా ఆలోచించిండు.తొలచిన మెదడులో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది.తప్పకుండా రాజేశ్ అయి ఉంటాడనే నిర్ధారణకు వచ్చిండు. ఎందుకంటే కాలేజీ కి సంబంధించిన కొనుగోళ్ళలో అవినీతిని బయట పెట్టినందుకు తనపై  గుర్రుగా ఉన్నడు రాజేశ్ .ఆ విషయమే సృజన ముందుంచిండు.ఆ మాట వింటూనే " చెప్పేవాడికి లేకపోయినా వినేవాడికి వివేకం ఉండొద్దూ!" సాగతీసిండు పరంధామయ్య.                                 
         "అదీ నిజమే నాన్న.మరీ ఇంత బరి తెగిస్తడా వాడు"సృజన
          "వాడు..వీడు పదజాలమెందుకులే గాని ఇప్పుడు మన కర్తవ్యమేంటిది" అన్న ఆలోచనలో శేఖర్ మునిగి పోయిండు. "మామయ్యా! ఏంచెయ్యమంటారో మీరే చెప్పండి?" అడిగిండు పరంధా మయ్యను.
          "మనం యఫ్. ఐ. ఆర్ అదీ ఇదీ అంటూ వత్తిడి తేకుండా ఉండటమే. బేల్ కోసం వాళ్ళ తిప్పలేమో వాళ్ళు పడుతరు." చెప్పిండు పరంధామయ్య.
           అనుకున్నట్టే శేఖర్ వాళ్ళు కేసు విషయంలో కామ్ ఐపోయిన్రు.పోలీసులకు ఆమ్యామ్యాలు ...బేల్ డిపాజిట్లు తడిసి మోపెడై అమ్మబోతే అడివై అగ్గువ సగ్గువకు పొలమమ్మక తప్పని పరిస్థితి ఆ తల్లిదండ్రులకు. ఏది ఏమైనా వినదగు నెవ్వరు చెప్పిన పద్యం రవి విషయంలో  నిజమై కూర్చుంది.
                                                                                         ***     
        ***            ***

surya.jpg


నెత్తిమీద నిప్పుల వాన కురిపిస్తున్నదా అన్నట్టు పట్టపగలు ఎండ మండిపోతున్నది.
గుండెలు బాదుకుంటూ, కాళ్లకు చెప్పులైనా తొడుక్కోకుండా పెద్దగా ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కు పరుగెత్తింది హుస్సేన్ బీ. ఆమెనందరూ మున్నీకి అమ్మి అని పిలుస్తారు.  ఆమె అలా పరుగెడుతుంటే వాడకట్టు మహిళలు ఏం జరిగిందో పాపం అనుకుంటున్నారు. కొందరైతే "భర్త ఇంట్లోంచి గెంటేశాడేమో వాళ్ళింట్లో ఎప్పుడూ గొడవలే.  రోజూ చూస్తూనే ఉన్నాం."  అనుకుంటున్నారు. కానీ రోజువారీ గొడవకు ఏడ్చే ఏడుపులు కావు హుస్సేన్ బీవీ.  ఈవాళ ఆమె ఏదో జరగరానిది జరిగితే ఏడ్చినట్టు ఏడుస్తూ పరుగెత్తుతున్నది.
పోలీస్ స్టేషన్ చేరుకొన్న హుస్సేన్ బీ గాభరాపడుతూ మెట్లమీద పడిపోయింది. అప్పుడే బయటినుండి వచ్చిన ఎస్సై రవి ఆమెను గమనించి కానిస్టేబుల్ కి చెప్పి స్టేషన్ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టించాడు.
"ఏం జరిగిందమ్మా? ఎవరైనా కొట్టారా?ఎందుకిలా పరేషన్ అవుతున్నావ్? ఏదైనా అన్యాయం జరిగితే చెప్పమ్మా?"
అంటూ విషయం వాకబు చేశాడు ఎస్సై.
ఆమెలో దుఃఖం,ఆయాసం ఒకేసారి తన్నుకువస్తుంటే ఏమి  చెప్పలేకపోతున్నది. కానిస్టేబుల్ మంచినీళ్ల గ్లాసు చేయికందించాడు. ఆమెకవేవి పట్టట్లేదు.
"సాబ్ మేరీ బేటికో బచావ్. మేరీ మున్నీకో బచావ్.
ఆ అమీర్ షేక్ నా బేటీని చంపేస్తాడు సాబ్."
అని విలపిస్తున్నది. ఎస్సై ఆమె వివరాలు తెలుసుకొని భర్త అజీజ్ ని స్టేషన్ కి పిలిపించాడు. విషయం ఏంటని అడిగాడు.

"ఆమె రెండు నెలల కాడికెళ్లి మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంది సాబ్. ఈయాల ఎక్కువైనట్లుంది. మాఫీ జెయిండ్రి సాబ్. మళ్ళీ ఇటు రానియ్యను" అన్నాడు అజీజ్ ఎస్సైతో.......
ఆమెను బలవంతంగా తీసుకొని ఇంటికి బయల్దేరాడు.  జుట్టు సిగ ఊడిపోయి, బుర్కాకు మట్టి అంటుకుని ఒక విషాద దేవత వలే పిచ్చిగా "బేటీ బేటీ...."
అని గుండె లోతుల్లోంచి కలవరిస్తూ నడవలేక నడుస్తుంది హుస్సేన్ బీ.
చూస్తున్న వారికి ఏదో అనుమానం వెంటాడుతున్నది.
హుస్సేన్ బీ కుట్టు మిషన్ మీద బట్టలు కుడుతూ ఎందరికో పికో పాల్స్ కుట్టడం, డిజైన్లు వేయడం, కుట్లు అల్లికలు  నేర్పేది. నోట్లో నాలుకలాగా అందరికీ తోబుట్టువులా ఉండే హుస్సేన్ బీ అంటే హనుమాన్ పేట గల్లిలో అందరికీ గౌరవం ఉండేది. ఆమెకు ఐదుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు. పొట్ట చేతబట్టుకుని చిట్యాల దగ్గరి మారుమూల పల్లెటూరు జంగంపల్లి వదిలి చౌటుప్పల్ కి వచ్చి కిరాయికి ఉంటున్నారు.
అజీజ్ కొన్నాళ్ళు టైల్స్ షాప్ లో పనిచేశాడు.అప్పటి వరకు బాగానే నడిచింది కుటుంబం. యజమానికి నష్టం రావడంతో షాపు మూతబడింది. నాటినుండి లారీ పనికి పోతున్నాడు అజీజ్. అక్కడ అతనికి కొత్త స్నేహితులు తోడయ్యారు. కొత్త సోపతుల మాయలో పడి రోజు తాగి ఇంటికి వస్తున్నాడు.
ఈ మధ్యనే పెద్ద బిడ్డ మున్నీ నిఖా ఎవ్వరికీ చెప్పకుండా చేసేశారు. ఆనాటి నుండి వాళ్ళింట్లో రోజూ గొడవలు......

ఇంట్లో ఎక్కడ సామాన్ అక్కడే పడి ఉంది. రెండవ అమ్మాయి ఫాతిమా తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లింది. బిడ్డల్ని చూసిన హుస్సేని గుండెలవిసేలా భూమిమీద పడి ఏడుస్తున్నది. ఇది చూసి పొయ్యి పక్కన ఉన్న లొట్టపీసు కట్టెల మోపులోంచి ఒక కట్టెను లాగి కోపంతో ఆమె వీపుపై చరిచాడు అజీజ్ . దుఃఖం చేసిన గాయాల నొప్పి ముందు వీపుపై కట్టె చేసిన గాయం ఆమెను అంతగా బాధించలేదు.
"తేరా సత్తేనాస్ హో....
నా బేటీని పైసలకు అమ్ముకున్నవ్.
కసాయోడా...
కన్నపేగును అమ్ముతుంటే నీ గుండె ఇంతనన్న కరగలేదా.......
థు...నీ జిందగి...."
అంటూ భర్తపై గాడ్రించి ఉమ్మేసింది.


"మాకీ కిరికిరి రోజు ఏంది నీ లొల్లి.
దిమాక్ ఖరాబ్ జేస్తున్నవ్.
ఆరాంసే ఉండనిస్తలేవ్. విషయం బయటికి తెలిస్తే పొట్టు పొట్టు తంతా"
అంటూ పక్కనే ఉన్న బకెట్ ని కాలితో వేగంగా తన్ని బయటికి వెళ్ళిపోయాడు అజీజ్. అంతలోనే ఇంటిముందు ఆటో ఆగింది. నల్లటి బుర్కా, ముగ్గుబుట్టలా నెరిసిన జుట్టు,నోరునిండా జర్దా, చేతిలో మారుతి సిల్క్స్ అనే ప్రింట్ తో ఉన్న పాలితిన్ కవర్ తో ఇంట్లోకి నడిచింది ఒక పెద్దావిడ. ఆమెను చూడగానే "అమ్మీ మై లుట్ గయి...
ఆ హరామి నా బేటీని పైసలకు అమ్మేశాడు...."
అంటూ పెద్దావిడ గుండెలకు అలుముకుపోయింది హుస్సేని.
పిల్లలయిదుగురు ఆమెను అల్లుకుపోయారు.ఆ వచ్చింది హుస్సేని తల్లి నుస్రత్ బేగం.

"ఆగే క్యా హువా గే...
క్యా బోల్ రి తూ...
హోస్ లా ఉన్నావా నువ్వు.
పైసలకు పిల్లనమ్ముడేంది...
మున్నీ ఏది? కన్పిస్తలేద్"
అని కంగారుగా అడిగింది నుస్రత్. ఏడుస్తున్న కూతురి కండ్లు తుడిచి మళ్లీ ఏమైందని అడిగింది.

గుండెను దిటువు చేసుకొని కాసేపు మౌనంగా ఉంది హుస్సేని. తల్లిని చూస్తూ
"ఆ దరిద్రుడు నా పెద్ద బిడ్డ మున్నీని సౌదీ నుండి వచ్చిన అరబ్ షేక్ కి అమ్మేసిండు.
ఆ షేక్ వయసుల చాలా పెద్దోడు.
మున్నీని కొని కానూన్ అడ్డులేకుంట రహస్యంగా నిఖా జేస్కుండు.
అంతటికీ కారణం నా షోహర్ అజీజ్ అమ్మీ...
వాడు నాశనం గాను"
అని జరిగిన వృత్తాంతం చెప్పింది. ఇదంతా విన్న నుస్రత్ హతాశురాలైంది. పది నిమిషాలు మాట పెగల్లేదామెకు. వెంటనే తేరుకొని కన్నీళ్ల గంగను పైట కొంగులో ఇంకించి
"ఈ విషయం మాకు ఎందుకు జెప్పలేదే నువ్వు!
మేం సచ్చినమనుకున్నవా!
నీ మొగుడికి ఈ దుర్బుద్ధి ఎట్లా బుట్టింది.
నాల్గు నెల్ల కింద ఊరికి వచ్చినప్పుడు బాగనే ఉండు కదా...!
పిల్లనమ్ముకునే గతి ఏం వచ్చింది ఆనికి.
ఒక్కమాట జెప్తే నీ భయ్యా హాబీబ్ ని పంపిస్తుంటి గదా బేటీ"
అంటూ విలపించింది.

పొద్దుటి నుండి ఎవ్వరూ ఏం ముట్టలేదు ఇంట్లో. "పిల్లలేమన్నా తిన్నారా" అంది నుస్రత్. లేదన్నట్టు తలాడించింది హుస్సేని. వెంటనే పొయ్యి ముట్టిచ్చి కవర్ సంచి లోంచి తాను తెచ్చిన దేశీ కోడి గుడ్లు ఉడకబెట్టి వండింది. జొన్న రొట్టెలు చేసింది. పిల్లలకు వడ్డించింది. ఎంతో బతిమిలాడితే హుస్సేని నాలుగు ముద్దలు తిన్నది. "ఉస్కో ఆనేదో బేటీ...
నిలదీసి అడుగుతా.."
అంటూ బిడ్డను ఓదార్చింది.

"అమ్మీ నా బిడ్డ ఎట్లా ఉందో! పర్దేశి ముండకొడుకు ఎన్ని బాధలు పెడుతుండో.
నా బిడ్డను వాపస్ దేవాలి అమ్మీ"
అంటూ తనలోని ఆవేదనను తల్లిముందు గుమ్మరించింది హుస్సేని.

సాయంత్రం ఆరు గంటలవుతుంది. సూర్యుడు అప్పుడే పొద్దు కడుపులోకి వెళ్లిపోతున్నాడు. అజీజ్ కల్లు నిషాలో ఊగుకుంటూ ఇల్లు చేరాడు. అత్తను చూసి అసహనంగా మూతి విరిచి మంచం మీద పడుకున్నాడు.
అంతా నిశ్శబ్దం. అలా గంట గడిచింది. అన్నం పెట్టమన్నాడు అజీజ్ లేచి.
"అన్నం పెట్టే పిల్లల్ని అమ్ముకుంటున్నావ్ నీకు అన్నం ఎట్ల తినబుద్ధి అవుతుంది" అంది అత్త నుస్రత్ అల్లుడితో.
"ఇగో సునో అత్త నా పిల్లను నేను అమ్ముకున్న.
నువ్వెవరు నన్ను అడగనీకి. అన్నం పెడతర లేదా "
అన్నాడు అజీజ్.
ఎంతో భారంగా అతనికి భోజనం వడ్డించి బయటికి వెళ్ళిపోయింది నుస్రత్. పరిస్థితి చేజారిపోయింది ఇక తన కొడుకును పిలుచురావడమే దీనికి సమాధానంగా భావించింది. బయటికి వెళ్లిన నుస్రత్ వెనక్కిరాలేదు. ఎలాగోలా బస్టాండ్ చేరి ఆఖరి బస్సుకు జంగంపల్లి చేరింది.
పరిస్థితిని కొడుకు హాబీబ్ కు వివరించింది. తల్లి చెప్పిన విషయం విన్న హాబీబ్ షాక్ కి గురయ్యాడు. పొద్దు పొద్దున్నే తల్లిని తీసుకొని మొదటి బస్సుకు చౌటుప్పల్ చేరుకున్నాడు.

ఇంకా నిద్ర లేవని అజీజ్ ను లేపి కూర్చోబెట్టారు. అజీజ్ కు విషయం అర్థమైంది. అతని గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హాబీబ్ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాడు. రెండు చేతులతో ముఖాన్ని దాచుకుని ...

"అమ్మేసాను...
కాదు కాదు నిఖా చేశాను. ఐదుగురు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే భయం వేసింది. నా పేగులు, తిత్తులు అమ్ముకున్నా చేయలేననిపించింది.
కొత్తగా పరిచయం అయిన స్నేహితులతో సంగతి చెప్పాను.
వాళ్లే అరబ్ షేక్ ల సంగతి చెప్పారు. అట్లనే అనుకున్నట్టు అరబ్ షేక్ సంబంధం దొరికింది.
పిల్ల బతుకు పర్దేశంలనైనా బాగుపడతది అనుకున్న.
మన మతంల మారు పెళ్లిళ్లు ఉండనే ఉన్నయి. ముసలోడైతే ఏంది! అది సుఖపడతది అనుకున్న. మాతో ఉంటే తల్లితోని కల్సి మిషన్ కుట్టుకుంటూ బతుకు ఖరాబ్ జేసుకుంటది. అందుకే పానం జంపుకొని నిఖా జేసిన.
మీకు దెలిస్తే జరగనివ్వరు. అందుకే జెప్పలే..."

అని అత్త కాళ్ళమీద పడి ఏడుస్తున్నాడు అజీజ్. బావ పరిస్థితిని అర్థం చేసుకున్న హాబీబ్ బావను లేపి ఊకోబెట్టాడు. కానీ తాను చేసిన పని సరికాదని నాల్గు చివాట్లు పెట్టాడు. తామంతా ఉండగా అంత నిరాశ పనికిరానిది అంటూ నిట్టూర్పు విడిచాడు.
"వాడిచ్చిన పైసలు ఏం జేసినవ్ బావ. రోజు తాగుతున్నవని తెలిసింది. తాగుడు గా పైసలతోనే తాగుతున్నవా" అన్నడు హాబీబ్.
"షేక్ ఇచ్చిన ఆరు లక్షల రూపాలు నా దోస్తుల దగ్గర ఉంచిన . వాళ్ళు బాకీ కింద తీసుకున్నరు. నాకు పది వేలు ఇచ్చిండ్రు"
అని బదులిచ్చాడు అజీజ్. రెండు చేతుల్తో నెత్తి బాదుకున్నాడు హాబీబ్. ఒక పక్క హుస్సేని ఏడుపు అతన్ని కలిచివేస్తున్నది.

బిడ్డతో మాట్లాడుదామంటే ఈ దేశం కాదు. కానరాని దేశం. కనీసం ఫోన్ నెంబర్ కూడా తీస్కోలే అజీజ్. అందరూ తలపట్టుకొని కూర్చున్నారు. ఇంతలో
"హుస్సేని అత్తమ్మ... హుస్సేని అత్తమ్మ మీ మున్నీ ఫోన్ చేసింది"
అంటూ పక్కింటి లలిత కూతురు శ్రీజ ఫోన్ తెచ్చిచ్చింది. అందరి కళ్ళలో మెరుపులాంటి ఆనందం....

హడావుడిగా ఫోన్ అందుకొని లౌడ్ స్పీకర్ పెట్టాడు హాబీబ్
"హలో... అన్నాడు.
" హలో...
అమ్మీ ముజే బచాలో అమ్మీ.
ఏ బుడ్డా మేరేకో బేచ్ దియా.
నాకు నరకం కనిపిస్తుంది అమ్మీ. అంటూ ఏడుస్తూ మాట్లాడుతున్నది మున్నీ. మున్నీ మాటను విన్న హుస్సేని గుండెలు బాదుకుంది. బేటీ అంటూ శోకం బెట్టింది. అందరూ ఆమెను ఊకోబెట్టారు. అవాజ్ జెయ్యకుండా ఉండమన్నారు.

"బేటా నేను హాబీబ్ మాము" అన్నాడు ఫోన్లో హాబీబ్.
"మాము ఈడ ఉండలేను. మా అబ్బు నన్ను ఈ అమీర్ కి అమ్మేశాడు. నన్ను కాపాడు మాము. దిక్కులేని బతుకు బతుకుతున్న మాము. నా బతుకు కుక్కలు చింపిన విస్తారాకు అయింది.
మాము.....నేనొక్కదాన్నే కాదు
నాలాగా ఇక్కడ మన దేశపోళ్లు చాలా మంది ఉన్నారు.
నన్ను కొన్న షేక్ కళ్ళుగప్పి బయటికి వచ్చి ఎస్.టి.డి నుండి ఫోన్ జేస్తున్న.
నన్ను కాపాడుండ్రి"
అని హృదయం కదిలిపోయేట్టు ఏడుస్తుంది మున్నీ.

"బేటా ....
నువ్వు ఫికర్ పడకు
నేను గాపాడుకుంటా బిడ్డ నిన్ను"
అంటూ కన్నీరు మున్నీరయ్యాడు హాబీబ్.
అంతలోనే ఫోన్ కట్టయింది.
విలపిస్తూ మాట్లాడుతున్న మున్నీని ఎవరో గమనించినట్టయ్యింది. అందుకే  ఫోన్ కట్ చేసింది.

మున్నీ స్వరాన్ని మోసుకొచ్చిన సెల్ ఫోన్ మౌనంలోకి వెళ్ళిపోయింది. అంతటా ఒక నిశ్శబ్దం.

"మేముండగా పిల్లను ఒక కసాయి మనిషికి అమ్మేసావు.కల్లో గంజో తాగి మాతో పాటే ఉండేది బిడ్డ.  దాని బతుకు ఆగం జేసినవ్" అంది నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ నుస్రత్.

"అమ్మీ నువ్వు ఆగు. జరిగింది నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మున్నీని ఎట్లా గాపాడాలో సొంచాయించుండ్రి. పిల్ల బతుకు సేయి జారిపాయే" అన్నాడు హాబీబ్.

అంతలోనే డికాషన్ పెట్టుకొచ్చింది పక్కింటి లలిత. అందరికీ అందించింది. తన ఫోన్ కు మున్నీ కాల్ చేసినప్పుడే ఆమెకు డౌట్ వచ్చింది. ఆమె చప్పుడు చేయకుండా వారి మాటల్ని విన్నది.

"అజీజ్ అన్న సక్కని పిల్ల గొంతు గోసినవ్ గదా! గల్లీకి తల్లి లెక్క ఉన్న హుస్సేన్ అక్కకు ఎంత తాపం బెడుతున్నవ్ అన్న " అన్నది లలిత. ఎవ్వరూ పలకలేదు ఉలకలేదు. "మళ్లీ మున్నీ ఫోన్ రావచ్చు ఫోన్ ఉంచుండ్రి అన్న"  అని ఇంటికి వెళ్ళిపోయింది లలిత.

ఎవ్వరూ ఏం మాట్లాడలేదు.
కాసేపటికి
"ఇందాక మున్నీ ఫోన్ ల మాట్లాడుతూ దాన్ని షేక్ అమ్మేశాడు అంది జీజూ..
ఏంది కథ! వాడు జేసుకొని ఇంకొకడికి అమ్మేసుడు ఏంది?
థు... ఆఖరికి బేటీ బతుకును కుక్కల పాలు జేసినవ్" అన్నాడు హాబీబ్.
మాట పెగల్లేదు అజీజ్ కి
కొస్తే నెత్తురు రాదన్నట్టుగా బండబారిపోయాడు.

అంతలోనే హాబీబ్ చేతిలో  ఉన్న లలిత ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తాడు హాబీబ్.
"హలో మాము..
మై మున్నీ..."
"బేటా నిన్ను ఏడ ఉంచిండ్రు. గది ఏ దేశం. దుబాయిలనే ఉన్నవా...!
నిన్ను జేస్కున్న గా అమీర్ షేక్ నిన్ను ఎందుకు అమ్మేసిండు. నువ్వు ఏమన్న తప్పు జేసినవా  తల్లి...! అన్నాడు హాబీబ్.

మౌనంగా కారిపోతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ
" లేదు మాము అబ్బు నన్ను గాని కి అప్పగించినాక నాల్గుదినాల్ హైదరాబాద్ ల ఒక హోటల్ ల ఉంచిండు. గా నాల్గు దినాల్ నరకం జూపిచ్చిండు. ఆడ ఉండంగనే ఫోన్ ల ఆళ్ల భాషలో ఎవళ్ళతోనో చాలా సార్లు మాట్లాడిండు.

తర్వాత నన్ను దుబాయ్ తెచ్చిండు. వాళ్ళింట్లో పని మనిషి జేసే పనులు జేపిచ్చిండు. వాని కొడుకులు గూడా నన్ను హింస పెట్టిండ్రు. వాని దగ్గర నాలాగా సానా మంది ఉన్నరు.

ఒకనాడు మా అందర్నీ వ్యాన్ ల ఎక్కించుకొని పోయి ఇంకో షేక్ కి అమ్మేసిండు. వాడు మమ్మల్ని ఐదు కమ్రలున్న సత్రం లాంటి ఇంట్లో ఉంచిండు. నా జిందగీ ఖరాబ్ అయిపోయింది మాము" అంటూ గోళ్ళుమంది మున్నీ...

హుస్సేని మున్నీ మాటల్ని విని ఏడుపు ఆపులేకపోయింది. ఒక్కసారిగా పరుగెత్తుకువచ్చి ఫోన్ లాక్కుంది. "బేటి...మేరీ బేటీ...."అంటూ బోరుమంది.
అవతలి నుండి మున్నీ "అమ్మీ.. అమ్మీ..." అంటూ విలపించింది.
అప్పుడక్కడి వాతావరణాన్ని దుఃఖసాగరం ముంచేసింది.

"బేటీ ఎట్లున్నవే...అంది హుస్సేని దుఃఖాన్ని కట్టడిచేస్తూ....
" నా బతుకేం బాగాలేదు అమ్మీ. అబ్బు నా జిందగీల నిప్పులు బోసిండు.
ఈ అరబ్ దేశంల
నాతో పాటు ఉన్నవాళ్లు చెబుతున్నారు అమ్మీ. వాళ్ళను గూడా గిట్లనే కొనుక్కుని తెచ్చారట. ఆళ్లంతా మన హైదరాబాద్ వాళ్లే. ఆళ్ల అబ్బులు కూడా ఇలాగే నిఖా జేసీ పంపేశారట...
ఈడ నా బతుకు ఏం బాగాలేదు అమ్మీ...
నాకు భయంగుంది అమ్మీ
నన్ను ఏం జేస్తరో...."

అంటుండగానే "అమ్మీ...
అమ్మీ...."అన్న కమ్మని పిలుపును తననుండి ఎవరో దూరంగా ఎవరో లాక్కెళ్తున్నట్టుగా అనిపించింది హుస్సేనికి

తప్పించుకున్న మున్నీని వెతుకుతూ నలుగురు యువకులు వచ్చారు. వారి చేతిలో ఉన్న ఫోటోను ఫోన్ మాట్లాడుతున్న మున్నీని పోల్చుకున్నారు. అంతే మున్నీ చేతిలోని ఫోన్ చేజారి కిందపడి వేలాడుతున్నది.
ఆమె కనుమరుగవుతున్నట్లు, దూరమవుతున్నట్లు "అమ్మీ.. అమ్మీ...."అన్న అరుపులు మాత్రం
హుస్సేనికి వినిపించాయి. ఆ పిలుపులు బిడ్డ పరిస్థితిని పరిచయం చేశాయి.
ఆమె గుండె వేగం పెరిగింది. ఒక్కసారిగా జీవితం సుడిగుండంలోకి నెట్టబడినట్టయ్యింది. పట్టుతప్పి పక్కనే కూర్చుని ఉన్న తన తమ్ముడి మీద వాలిపోయింది.

మున్నీకి అమ్మీ

ఆచార్య సూర్యాధనంజయ్ 9849104186

WhatsApp Image 2022-09-12 at 8.51_edited.jpg

  -సుభాషిణి తోట, 9502818774

          మెహర్ అలా అడుగుతుందని అసలూహించలేదు ఫాతిమా.. ఒక్క సారిగా తను నిలదీసినంతగా అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలీక తన గదివైపు వెనుతిరిగింది.. 

  ఒకో అడుగు వేస్తుంటే తనగది సమీపిస్తోంది కానీ వెనుకనుంచి మెహర్ ప్రశ్న వీపును బల్లెం తో పొడుస్తున్నట్టు అనిపిస్తోంది.. ముందుకు అడుగేయటం ఇక నావల్ల కాదు అనుకుంటూ ఒక్కసారిగా వెనుతిరిగింది మెహర్ కు ఏదో చెబుదామని..కానీ సరిగ్గా అప్పుడే ఆమె తన గది తలుపేసుకుంటుండటం కనిపించింది..

    రేపు మాట్లాడొచ్చులే అనుకుంటూ గదిలోకొచ్చింది.. మంచమ్మీద నడుం వాల్చినా మనసు కుదుట పడటం లేదు..ఇందాక మెహర్ సంధించిన ప్రశ్నే చెవుల్లో ధ్వనిస్తోంది.. వేళ కాకపోయినా ఖురాన్ తీసి కల్మా చదుకుంది మనశాంతికోసం..

     '' మతమేదైనా సరే ఎవరి పవిత్ర గ్రంధం వారికి ధ్యానంతో సమానం.. యోగ విద్య సమానమైన ఉపశాంతి లభిస్తుంది '' అని అనుకుంది.. మళ్ళీ వెళ్ళి పడుకోవాలనుకుంది కానీ నిద్ర రావటం లేదు..ఫాతిమా ఇవాళ అడిగింది కానీ ఈప్రశ్న నన్ను చాలా రోజులుగా వేధిస్తోంది అని అనుకుంది.. '' సాహిర్ '' అంటూ పిలిచింది.. '' ఓహ్ ఈ టైం లో వాడు ఇంట్లో ఎందుకుంటాడు '' అనుకుంటూ సెల్ తీసి అతనికి ఫోన్ చేసింది.. '' బేటా ఆ సంబంధం విషయం ఏమయ్యిందీ '' అంటూ ఆరా తీస్తోంది.. 

      ప్రవాహం కర్ర పుల్లను తనలో కలుపుకోవాలనుకుంటుంది కలిసి సాగమంటుంది కానీ కర్రపుల్ల కలిసి నడుస్తూనడుస్తూనే హఠాత్తుగా ఆగిపోతుంది.. కుటుంబ సభ్యులు తన దుఖం మరిపింపచేసేందుకు ప్రయత్నిస్తున్నా మెహర్ ఎవరితోనూ కలవలేకపోతోంది.. ఎక్కువ భాగం తనగదిలో ఒంటరిగా దిగులుగా గడుపుతోంది..  బయటకు వెళ్ళాల్సొచ్చినప్పుడేకాదు ఇంట్లో ఉన్నప్పుడూ బుర్ఖాను ఆశ్రయించాలి అనుకుంటోంది ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కి ఉబ్బిన కళ్ళు ఎవరికంటా పడనీయొద్దని..

     ఫోన్ బల్లమీద పెట్టి ఆరాం కుర్చీలో కూలబడింది ఫాతిమా.. కళ్లు మూసుకోగానే గతం ఆవరించింది..

     '' సాహిర్ ఐసా మత్ బోల్నా బేటా ఎలాగైనా పాషాకు నిఖా పక్కా చేయాల్సిందే .. కాస్త గట్టిగా ప్రయత్నించు '' అంది ఫాతిమా.. '' తమ్ముడికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదమ్మా '' అని చెప్పిన తన పెద్ద కొడుకు సాహిర్ తో..

'' అమ్మీ ఆ పలకలన్ని మీచేతుల్లోనేగా తయారు అయ్యేది ... అదే చేతులతో ఆపలకమీద మన బతుకులు బాగుపడాలనీ రాయొచ్చు గా అంది మెహరున్నీసా" ఆ మాటలకు వాళ్ళ అమ్మ కరీం బీ చేతిలో ఉన్న పింగాణీ గ్లాసు జారి మట్టి పలకలా పగిలిపోయింది....

        '' ఏమయ్యా నువ్వు, నేను, మన ఇద్దరు మగ పిల్లలు ఇలా మన బతుకులు ఆపలక పరిశ్రమలో పగిలిపోవలసిందేనా.. చూడు మెహర్ పెళ్ళీడుకొచ్చింది ఏదో తంటా పడి దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాలి '' అంది కరీం బీ.. '' మన అమ్మాయి పేరు మెహరున్నీసా కానీ మన పెళ్ళికొడుకుకు మెహర్ ఇచ్చుకునే స్థితిలో లేము కదనే ''  అన్నాడు ఆమె భర్త ఖాదర్..

      తల్లి తండ్రి తన గురించి బాధపడుతుండటం తెలుస్తోంది మెహర్ కు.. తన స్నేహితురాళ్లల పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాలనుంది కానీ తనకు కట్నమిచ్చి పెళ్ళి చేయలేని అసహాయత గుర్తొస్తోంది..  తల్లిదండ్రులకు ఏమన్నా సాయపడగలనా అనుకుంటుంది ఇదేమాట వాళ్ళతో అంటే '' ఆడపిల్ల బుర్ఖా దాటి రావటం బాగోదు..మనం కూటికే పేద కానీ కులానికి కాదు.. నువ్వు ఆ పరదా చాటునే ఉండు చాలు '' అని అంటుండేవారు.. తన ఇద్దరు అన్నల్ని మాత్రం తమ వెంట పనికి తీసుకుపోయేవారు..

      అమ్మీ అంటూ పెద్దగా కేకవేస్తూ లోనికొచ్చాడు సాహిర్.. '' క్యా హువా సాహిర్ '' అని ఫాతిమా అడుగుతుండగా.. తమ్ముడికి పిల్లనిచ్చేందుకు ఒకరు ఒప్పుకున్నారు.. ఇప్పుడంటే మనది ఈ యర్రగొండ పాలెం కానీ ఇంతకుమునుపు మనది ఆ మార్కాపురమే కదా..అని అంటుండగా.. ఆ..అయితే అంది ఫాతిమా ఆతురతగా.. ఆఊర్లో ఒకరు పాషకు పిల్లనిస్తామన్నారు అనగానే ఫాతిమాకు పట్టరాని సంతోషం కలిగింది.. '' యా..అల్లాహ్ తుం కిత్నే అచ్చే హో.. మనం వెంటనే పోదాం ఆ బంగారు పలకను వెంటనే ఇంటికి తెచ్చేసుకుందాం '' అంది..

    మాంగ్నా చేసుకోడానికి వస్తామని పిల్లాడి వైపు వాళ్ళు కబురందించగానే మెహర్లో భయం నీరెండలా గుండెను చేరుకుంది... రాత్రంతా నిద్రలేదు.. పొద్దున్నే తన సహేలి అంజూ దగ్గరికి పరిగెత్తుకుంూ వెళ్లి విషయమంతా చెప్పి.."నాకు చాలా భయంగా ఉంది అంజూ" అంది

'' ఎందుకే నవ్వుతూ అంది అంజూ''..."మొన్న కదూ మన చుట్టాలమ్మాయి సలీమ చెల్లెలు అత్తారింట్లో అత్త వేధింపులు తట్టుకోలేక ఆ బాధలు భరించలేక ఉరేసుకుంది నన్ను చేసుకుంటాం అని వస్తున్న వాళ్లు అలాంటి వాళ్ళేనా ఈ అత్తా గయ్యాళేమో '' అంది మెహర్  కాస్త కోపంగా.. .. ఆమాట వినగానే '' చ ఊకో ఎవరికో ఏదో జరిగిందని నీకు జరుగుతుందా ''... అంది అంజూ 

         పిల్లను చూడటం అయ్యాక.. పెళ్ళి కొడుకు పాష సహా వచ్చిన అతని కుటుంబసభ్యులందరూ తమకు నచ్చిందన్నారు .. '' కానీ  బహెన్ '' అంటూ ఖాదర్ నసుగుతుండగా.. '' కట్న కానుకలు మాకేం వద్దు ఆడపిల్లే అన్నిటికన్నా సంపద.. అవసరమైతే మీ ఖర్చులూ మేమే భరించి మా కోడలిని తీసుకుపోతాం '' అని అభయమిస్తున్న ఫాతిమా దేవతలా కనిపించింది ఆ దంపతులకు ఆక్షణం.. అలానే ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తుండగా.. '' కానీ మా అబ్బాయికి సంబంధించి కొంత లోపం ఉంది అది మీకు నచ్చితేనే మనం ముందుకెళదాం..నేను ఏదీ దాచదలచుకోలేదు ''.. అని అంటుండగా.. '' మీ పెద్దబ్బాయి అన్ని విషయాలు చెప్పాడు.. మీ అబ్బాయి చిన్నతనం లో అనారోగ్యం కారణంగా పెద్దగా చదువుకోలేదు.. ఆ అనారోగ్యం మళ్ళీ తిరగబెడుతుందేమో అని మీరు భయపడుతున్నారు..ఇదేగా మీరు చెప్ప దలిచింది..మేం అన్నిటికీ సిద్ధపడ్దాం.. ఇప్పుడు అబ్బాయిని చూశాక మరింత సంతోషిస్తున్నాం మీ ఇంటికి మాపిల్లను ఇచ్చేందుకు '' అని అంది కరీం బీ.. '' మీకు సరే కానీ మీ అమ్మాయి ఏమంటుందో అసలు ప్రాధాన్యత తనకు కదా ఇవ్వాల్సింది '' అని ఫాతిమా మెహర్ వైపు చూస్తుండగా '' నాకు ఇష్టమే ఏమీ అభ్యంతరం లేదు అని సిగ్గుపడుతూ'' లోనికి పరుగుతీసింది మెహర్..

    పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అమ్మాయి మాది అనిపించుకుని ఇంటికి తిరిగి వెళ్ళాక... వాళ్ళ మాట తీరు ...కుటుంబ కట్టు బాట్లు మంచితనం గ్రహించిన మెహర్ కు కాస్త మనసు శాంతించింది... కొద్ది రోజుల్లోనే పాషా తో మెహర్ పెళ్ళి జరిగింది..

    అత్తారింటికి వెళ్ళబోయే రోజు మెహర్ తల్లి దగ్గరకు వెళ్ళి వెళ్ళొస్తా అని కంట్లో నీటితోనే చెప్పింది... అన్నలిద్దరూ చెల్లిని దగ్గరకు తీసుకోగానే కన్నీళ్లు ఆగడంలేదు మెహర్కు గుడిసె అయినా పుట్టిల్లు పుట్టిల్లేగా ...నక్కో బేటీ  పక్కన అత్తలు పిన్నమ్మలు సముదాయిస్తున్నారు...ఈఇంటికంటే నీకు ఆ ఇల్లే బాగుంటుంది.. ఇంకెప్పుడు ఈ ఇంటికి రావు కూడా '' అని అంటున్న ఆమ్మీ మాటలకు నివ్వెరపోయింది మెహర్....

        ఆత్మీయ ఘన స్వాగతం తో ఫాతిమా కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది మెహర్ కొత్తగా అంతా కొత్తగా ఉంది తనకు ఫాష అమాయకుడు అయినా తనని బాగా చూసుకుంటున్నాడు ఆడబిడ్డ అత్త మామ... బావ గార్లు వీళ్లేవ్వరు తను సినిమాల్లోనో పొరుగింట్లోనో చూసినట్టు లేరు...ఉన్నంతలో తినడం.... దాచుకోవడం.. వండిపెట్టడం ,ఉమ్మడి కుటుంబం... తోడికోడళ్ళు అత్త మామ అందరూ ఒకే ఇంట్లో అయినా ఏ గది ఇరుకుగా ఉండదు.. కాస్త పచ్చడి వేసుకు తిన్నా కడుపు నిండిపోయేది ...

     అత్త సముద్రం లాంటిది.. ఇంటికి తరలివచ్చే నదుల్ని తనలో కలుపుకుంటుంది.. మొదటి నాలుగైదు రోజులు కొంత బెరుకుగా భయంగా అనిపించినా.. వేపచెట్టు నీడలాంటి అత్త స్నేహం లో ఇట్టే కలిసిపోయింది మెహర్ .. తన పుట్టింటితో పోలిస్తే అన్నివిధాలా పెద్ద కుటుంబం తన భర్తది.. అన్నిటికి మించి అత్త పెద్ద మనసు బాగా నచ్చింది .. బెరుకుతనం తగ్గి కుటుంబంలో కలిసిపోవడం జీవితం ఇంత హాయిగా ఉంటుందా అని తెగ పొగుడుకుంది తనని తానే ...

        రోజులు పాత బడుతున్నాయ్.. తీగకు పందిరిలా తను అల్లుకుపోయింది.. పాష తనని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.. కొద్ది నెలల్లోనే తను నెలతప్పిన సంగతి తెలియగానే ఎంతో సంతోషించాడు..అత్త హడావుడైతే అంతా ఇంతా కాదు ఆ సంతోషాన్ని అల్లా దీవెనగా నమ్మి ప్రత్యేక నమాజులు చేసింది..  భర్తతో ఉన్నంతసేపు పుట్టేబిడ్డగురించి వాడు చేసే అల్లరి గురించి ... వాడిని ఎలా పెంచి పెద్ద చేయాలన్న కోరిక గురించి ఇద్దరు పదే పదే చర్చించుకునే వారు...పాషా ఓ రోజు పని నుండి వస్తూ వస్తూ కార్ బొమ్మ పాక్ చేయించుకొని తెచ్చాడు... కాళ్ళు కడుక్కొని ఇంట్లో వాళ్లకు తెలీకుండా వాళ్ళ రూంలోకి వెళ్లి "మెహర్" అని ప్రేమగా పిలిచాడు

"హా జీ" అంటూ తను రాగానే ఇవాళ నీకొకటి ఇస్తాను దానికి నువ్వేమి ఇస్తావు అనగానే సిగ్గుతో కొంగుకప్పుకుంది మెహర్..  తెచ్చిన  బహుమతిని అపురూపంగా చూస్తూ " మేరా బచ్చే కేలియే" అన్నాడు పాషా" అంటుండగా తుంహారా నై హమారా "అంటూ చేతిలోకి తీసుకుంది మెహర్...

         నెలలు నిండిన కొద్దీ మెహర్  ఏ పని చేయలేక పోతుంది అయినా తిని కూర్చోడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు... తల్లి గారింటికి కాన్పు అని పోవాలని ఎప్పుడూ అనుకోలేదు.. .

ఒక్కసారి మాత్రం మెహర్ వాళ్ల అమ్మ నాన్న చూడ్డానికి వచ్చినప్పుడు 

'' మెహర్ ఇక్కడే కంటుంది... వీలైతే మీరు ఉండండి '' అంది ఫాతిమా... అంతే ఎంతో సంతోషంతో వెళ్ళిపోయారు మెహర్ తల్లి తండ్రులు...  అందరూ అనుకున్న రోజు రానే వచ్చింది...నొప్పులు తీస్తున్న  మెహర్ లో భయం ఎక్కువైంది... అనుభవం ఉన్న అత్త దొరకడం తన అదృష్టం అని మరోసారి రుజువు చేస్తూ.. మెహర్ పాదాలు ఒళ్లు చల్లబడకుండ ఒత్తుతూ  "నక్కొ బెటా నక్కో...  గభరావు మత్".. సబ్ టీక్ హోగీ"

అంటూ కోడల్ని భయం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది....కానీ అంతలోనే బిడ్డ అడ్డం తిరిగిందనీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు....పెద్దాపరేషన్ తో పరేషాన్ ఖతం హోగయా... బంధువులు చుట్టాలకి ప్రసూతి గది బయట జరిగిన విషయాన్ని చెబుతున్నాడు మామ గారు...బే టీ..... బేటా ....పాషా మనసులో అనుకుంటూ బెంచీ చివర్లో అవిసిపోయిన బెండులా కూర్చున్నాడు...

పెద్ద డాక్టరమ్మ .. పెద్ద డాక్టరమ్మా.. బంధువులలో ఒకరు పెద్దగా చెబుతున్నారు... ఫాతిమా ఉలిక్కిపడి లేచి  డాక్టర్ దగ్గరకు వెళ్ళి  "క్యాహువా మేం సాబ్. మేరా బహు '' అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది...

       '' అబ్బాయి పుట్టాడు... అంతా బావుంది ఇంకో పదిహేను నిమిషాల్లో బిడ్డని తల్లిని చూడొచ్చు '' అంటూ చేతికున్న గ్లౌజ్స్ తీస్తూ వెళ్ళిపోయింది...'' యా అల్లాహ్ ''  అంటూ అక్కడున్న వారు అంతా ఊపిరి పీల్చుకున్నారు... బిడ్డ పుట్టిన దగ్గర నుండి మెహర్లో అమ్మతనం ఎక్కువైపోయింది...పాషా కూడా ఇంటి పట్టునే ఉండటం మొదలు పెట్టాడు.. బిడ్డను ఎత్తుకోవడం అస్సలు వదలట్లేదు...

         మెహర్ ఒకరోజు వంట పని పూర్తి చేసుకొని తన రూంలోకి రాగానే పిల్లాడు కనపడలేదు... గదంతా కలియ చూసింది...బాబు ఏడుపు లేదు...తనలో ఒకలాంటి ఒణుకు మొదలైంది "మేరా బేటా"అంటూ పరుగున వసారాలోకి వచ్చి చూసింది హాయిగా నిద్ర పోతున్న బిడ్డ .. బిడ్డని నేర్పుగా ఎత్తుకుని అటు ఇటు తిరుగుతున్న తండ్రి తారసపడ్డారు... "ఏ క్యా హై జీ"...కాస్త కోపంగా అంది  "ఉష్" పిల్లాడు పడుకున్నాడని సైగ చేసాడు పాషా...

మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది , పిల్లాడ్ని తండ్రి చూడకుండా ఉండలేక పోతున్నాడు... '' కామ్ కో భూల్ గయా ఆప్ ''...పొద్దున్నే నమాజ్ చేసి లోపలికి వస్తున్న భర్తని అడిగింది మెహర్...'' నీతో కాస్సేపు మాట్లాడాలి '' అన్నాడు పాషా...పక్కకు వచ్చి కూర్చుంది ..'' ఈ మధ్య ఎందుకో ఒంట్లో నలతగా ఉంటోంది ''.. భార్య ఒళ్ళో తలపెట్టి అన్నాడు పాషా... '' ఏమీ కాదు అల్లా దయతో అంతా సర్దుకుంటుంది '' అంటూ పిల్లాడిని పాషాని రెండు బుజాలపై ఆనిచ్చుకుంది.. పిల్లాడు తండ్రి ఇద్దరు ఒకరి కళ్లలోకి ఒకరు చూడటం చూసి... '' బలే ఉంది ఈ రోజు ఇలాగే ఉండాలి ఎప్పుడు '' అంది... పిల్లాడు మళ్లీ మళ్లీ వాళ్ళ నాన్నను చూస్తూ కళ్ళని కొడుతున్నాడు... 

  బయటకు వెళ్ళబోతున్న కొడుకును ఆపింది ఫాతిమా '' పాషా  నేను ఒకటి చెప్పనా "అంది ... "బోలో అమ్మీ "అన్నాడు పాషా " ఇంతలో బిడ్డను ఎత్తుకొని అటువైపొస్తోంది మెహర్..'' మీ ఇద్దరికీ లేనిది బిడ్డకు ఉండాల్సిందే "అంది "అదృష్టమా" అన్నాడు పాషా

"నహీ... "పడ్నా " అంది కాస్త గర్వంగా... "హా సహీ బోలా.... అల్లాకే  దువా" అన్నాడు పాషా భార్యని కొడుకుని మార్చి మార్చి చూస్తూ..." బిడ్డకు మనం ఆస్థి ఇవ్వగలగటం కాదు వాడ్ని మంచి ప్రయోజకుడిగా చేయాలి ఉన్నత విలువలుకల వ్యక్తిగా తీర్చిదిద్దాలి '' అని అంటుండగా .. అందుకు మనమేం చేయాలి అన్నట్టు చూసింది మెహర్ '' చదువుని ఇస్తే విజ్ఞానవంతుడవుతాడు, సమాజం హర్షించే పౌరుడవుతాడు..అలాంటి బిడ్డలు కుటుంబానికే కాదు దేశానికీ గర్వకారణమే  అవుతాడు ''...అని అంది ఫాతిమా...

        రాను రాను పాషాలో మార్పు మొదలైంది తినడం పూర్తిగా బంద్ చేశాడు..కడుపులో ఏదో ఉందని... ఆసుపత్రికి పోదాం అని చెబుతూనే...ఇంకేదో అవుతుందని తన గదిలో ముడుచుకొని పడుకోవడం మెహర్ను కలవర పెడుతోంది... ఇంట్లో వాళ్ళు అందరూ అతని గురించి మాట్లాడుతున్నారు... ఏమైందో తెలుసుకో అని  పురమాయిస్తున్నారు... ఇంతలో పాషా తండ్రి హఠాన్మరణంతో అతను ఇంకా కుంగిపోయాడు...చూస్తూ చూస్తూనే అతని మెదడు పనిచేయడం మానేసింది.. తరువాత మిగతా శరీరం చచ్చుబడిపోయి... కన్నుమూశాడు పాషా.... కలలు కన్న జీవితం కళ్ళ ముందే కూలిపోవడం మెహర్ నిస్సహాయికగా మార్చింది.... కలలు  కన్న రంగులు కళ్ళముందే వెలసిపోతున్నట్టు అనిపిస్తోంది..

    పాషా జ్ఞాపకాలతో బరువుగా గడుపుతోంది.. బిడ్డలో పాషా రూపాన్ని చూసుకుంటోంది అలా చూసినప్పుడల్ల అతని జ్ఞాపకాలతో మరింత దుఖిస్తోంది..

   ఒకరోజు బిడ్డను ఎత్తుకొని బీరువా సర్దుతుండగా.. అందులో ఉన్న పాషా ఫొటో వంక చూస్తూ పిల్లాడు ఆఫొటో వైపు వెళ్తానని జారిపోతున్నాడు..మెహర్ సముదాయించి ఎత్తుకుంటుంటే చేతులతో ఆఫొటోలోని మానాన్న '' ఏడి ఎటెళ్ళాడు  '' అన్నట్టు సైగ చేయటంతో మెహర్ గుండెపగిలింది.. ఏం సమధానం చెప్పాలో తెలియక.. ఏడుస్తున్న తల్లి ముఖాన్ని  కొంత సేపటి తరువాత పిల్లాడే తుడవటంతో.. వాడ్ని గుండెలకు హత్తుకుంది.. 

   రోజులు భారంగా గడుస్తున్నాయి.. ఇంటి పక్కన ఉండే స్నేహితురాలొచ్చి ఒకరోజు.. '' ఇక నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వరు నువ్వు తిరిగి మీ పుట్టింటికి వెళ్ళాల్సిందే '' అని అనగానే.. ఆమెలో కొత్త భయం మొదలయ్యింది.. అత్తింటి ఆధారం కూడా కోల్పోతే ఇక తన బతుకేం కావాలి అని అనుకుంటోంది.. 

   పుట్టింటికి చేరటం ఇష్టం లేదు తనకు.. పాషా ఉన్నప్పుడోఒ ఒకటి రెండూ సార్లు మినహా పెద్దగా పోలేడు.. ఏ తల్లైనా రాత చెడిన బిడ్డను గుండెల్లో పెట్టుకుంటుంది కానీ తనకే తన పుట్టింటికి పోవాలని లేదు.. వాళ్ళ పేదరికానికి తాను మరింత భారం కావటం ఇష్టం లేదు, అత్తింట్లో అయితే రక్షణగా ఉంటుంది.. అని అనుకుంటుండగా స్నేహితురాలు అలా చెప్పటం తనని కలవరపెట్టింది..

     ఆభయం తోనే ఫాతిమాను అడిగింది అత్తమ్మా నన్ను ఈ ఇంట్లోంచి పంపించేస్తారా '' అని. అడగాలి అనుకుంటూనే నిద్రలోకి జారుకుంది. సరిగ్గా అప్పుడే  ఆ దృశ్యాన్ని కిటికీలో నుండి గమనించిన ఫాతిమా.. కోడలి గదివైపు వెళ్ళి చూసింది.. '' ఏడ్చి ఏడ్చి ఎప్పుడు పడుకుందో బిడ్డ తెల్లారగానే తన భయం తీర్చేయాలి '' అని అనుకుంది..

తలుపు ధన్ ధన్ శబ్దం చేస్తూ  అత్త పెద్దగా పిలుస్తుండటంతో గదినుంచి బయటికొచ్చింది కన్నీళ్ళు తుడుచుకుంటూ లేచి.. '' నన్ను ఈ ఇంటినుంచి పంపవద్దని అత్తను వేడుకుంటాను '' అనుకుంటూ వచ్చి తలుపుతీసింది..

       ఎదురుగా కనిపించిన మెహర్ ఏదో అడగబోతుండగా.. ముందుగా తనే నోరు విప్పింది ఫాతిమా.. కోడలి కళ్లల్లోకి చూస్తూ కన్నీళ్ళు తుడిచింది.. '' గబ్ రావ్ మత్ బేటీ.. నిన్ను పంపించ దలిస్తే నా బిడ్డలా పంపిస్తాను '' అంటూ భుజమ్మీద ఓదార్పుగా చెయ్యేసింది.. కానీ ఆమె మాటకు అర్థం ఏంటో మెహర్ కు అవగతం కాలేదు..

    '' ఏం సాహిర్ ఇంకా సంబంధాలు వెతుకుతూనే ఉన్నావా.. అని ఎవరో అడిగారు, ఇంకా మీ తమ్ముడికి పిల్ల దొరకలేదా '' అని ఇంకొకరు అడుగుతుండగా.. '' హా మళ్ళీ వెతుకుతున్నా, పిల్లని కాదు పిల్లాడ్ని, మాతమ్ముడికి కాదు అతని భార్యకు '' అని చెప్పేసరికి ముందు అవాక్కవుతున్నా.. ఆ విప్లవాత్మక నిర్ణయానికి, అభ్యుదయ ఆలోచనకు, స్త్రీ పక్షపాత గుణాన్ని మెచ్చుకుంటున్నారు.. మసీదులో మౌలా చెప్పింది విని రావటం కాదు ఆ ధర్మ గుణాల్ని, ఆచరించటమే అసలైన ఇస్లాం అని పొగుడుతున్నారు.. ఇన్షా అల్లా.. ఆ అమ్మాయికి మంచి జరగాలి అని కోరుకుంటున్నారు..

 ''అమ్మీ ''...అంటూ లోనికొచ్చాడు సాహిర్..ఈసారి అతని గొంతులో అప్పటి హుషారు లేదు..తల్లికి చాలా సేపు ఏదో వివరించాక.. '' సరే అలాగే చేద్దం బేటా.. తనకు మళ్ళీ పెళ్ళి విషయం మెహర్ కు ఇప్పటికే చెప్పాను కానీ తన భర్తగా మరొకర్ని ఊహించలేను నా బిడ్డకు దూరం కాను అని మొండిగా వాదిస్తోంది.. మళ్లీ ఇంకొకరితో పెళ్ళిని తిరస్కరిస్తోంది ...నచ్చ చెప్పగా చెప్పగా కొంత మెత్త పడింది.. ఇక ఈ సంబంధం విషయం ఒకసారి చెప్పి ఖాయం చేద్దాం '' అంటూ కోడలి గదివైపెళ్ళింది..

     ఫాతిమా అటువైపొస్తుండగా మెహర్ పొయ్యిదగ్గర కనిపించింది..అపుడే గంజివార్చి పొయ్యిలో మండుతున్న కట్టెల్ని బయటకు లాగి ఆ మంటపై నీళ్ళు చల్లి చల్లారుస్తోంది.. తను చెప్పబోయేది విని కోడలు ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసు, బంధువులు, ఇతర కుల పెద్దలు ఏమంటారో తెలుసు కానీ చేయబోయేది ఒక మంచిపని కనుక దైర్యంచేసింది '' పేరుపెట్టి  పిలవగానే..  ''హా మాజీ '' అంటూ అత్త వైపు తలతిప్పింది మెహర్ '' నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి నీ జీవితం ఇలా మోడు వారటానికి వీల్లేదు,పచ్చగా కళకళ లాడాలి '' అని అనగానే.. భోరున ఏడుపు మొదలుపెట్టింది .."ఊరుకో ఏడవటం స్త్రీ లక్షణం అని నీకేవరైన చెప్పారా" అంది తన కళ్ళు తుడుస్తూ.. "నహీ మాజీ నావల్ల కాదు మళ్లీ ఆ ప్రస్తావన నాదగ్గర తేవొద్దు "అంటూ భర్త ఫోటోని ఆలింగనం చేసుకొని కుములుతుండగా "పిచ్చి పిల్ల నువ్వు అమాయకురాలివి అనుకున్నా కానీ ఇంత బేల తనం ఇంత పిరికితనం కూడా ఉందా" అంది  ... " ముఝే మాఫ్ కరో అమ్మి  మీ దగ్గర నేనెందుకు ఉండకూడదా ఇంకెవరికో ఎందుకు చెందాలి నేను అంది"  కళ్ళు ఇంకా ఇంకా వర్షిస్తుంటే '' దేఖో..పాష ఉన్నంతదాకా నువ్వు ఈ ఇంటికోడలివి..కానీ ఇప్పుడు మా బిడ్డవి "బిడ్డని మెట్టినింటికి పంపడం ఆచారం కదా...ఏ సంప్రదాయంలో అయినా ఆ ఆచారం మామూలు విషయం ,నా బిడ్డకు ఆ తంతు జరిపించకుండా ఎలా నా దగ్గరే పెట్టుకోను " అంది , పెద్ద మనసుతో అలా మాట్లాడుతున్న అత్త తల్లి కంటే ఎక్కువగా కనిపిస్తుంది.... "అమ్మి"  అంటూ రెండు చేతులూ ఎత్తి కాళ్ళ దగ్గర కూల బడింది... "ఏ క్యాహై  " ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టం" పెళ్ళి ఏర్పాట్లకు   ఏవి కావాలో సాహిర్ కు పెద్ద కోడలికి లిస్టు చెప్పాలి పద అంటూ ముందుకు నడిచింది ఫాతిమా..

       పెళ్లికొడుకు వాళ్ళు అందరూ మెహర్తోపాటు ఆమె కొడుకునీ ఒప్పుకున్నారు...

కొద్దిమందిబంధువుల సమక్షంలో మెహర్ కు కొత్త జీవితాన్నిచ్చింది ఫాతిమా.....పెళ్లికొడుకు సాహిర్ వాళ్ళ అన్నదమ్ముల తో కలిసిపోయాడు .. ఇప్పుడు మెహరున్నీసా ఆ ఇంటికి ఆడపడచులా మారింది.. 

      "గాలివీచి పూవుల తీగ నేలవాలిపోగా.. అటులే దాని వదిలివేతువా..చేరదీసి నీరుపోసి చిగురించనీయవా.. " రేడియోలోపాట మంద్ర స్థాయిలో వినవస్తోంది..

       మెహర్ ను తన భర్తతో పంపించే హడావుడి మొదలయ్యింది.. ఫాతిమా మిఠాయిలు పంచి తనూ నోట్లో పెట్టుకుండగా.. '' యా అల్లాహ్..ఇది రంజాన్ మాసం కదా.. ఫాతిమా ఉపవాస దీక్ష చేయటం లేదా '' అని పక్కింటి ఆయేషా బుగ్గలు నొక్కుకుంటుండగా.. '' ఇది కూడా పుణ్యాకార్యమే అని అల్లామియాకు అర్థమవుతుందిలే '' అంది ఎదురింటి రసూల్బీ..

    కారు కదులుతుండగా ఫాతిమా మరోసారి ప్రేమగా చెప్పింది '' బేటీ వస్తూ పోతూ ఉండు ఇది నీపుట్టినిల్లని మరిచిపోకు అని "

                                                                                                  ***.  

అత్తమ్మ

Veluri prameela sharma_edited.jpg

 వేలూరి ప్రమీల, 9492535415

 

      తూర్పు సింహద్వారపు గంటలు, తెల్లవారకముందే లయబద్ధంగా చప్పుడు చేస్తూ, పక్షుల కిలకిలారావాలకు బాణీలు కడుతున్నాయి. భానుడి లేలేత కిరణాల నులివెచ్చని స్పర్శకు, పరదాలమాటున నిద్రిస్తున్న రాకుమారి చిత్రలేఖ... కలువరేకుల్లాంటి కనురెప్పల రెపరెపల నడుమ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. అరుణ వర్ణపు కాంతి, చెక్కిలిని ముద్దాడుతుండగా... తామర తూడుల్లాంటి అందమైన చేతివేళ్ళ నడుమనుండి, ఉదయిస్తున్న భానుణ్ణి దర్శించుకుని, మనసులోనే దణ్ణం పెట్టుకుంది చిత్రలేఖ. 

 

      కిటికీలకున్న పరదాలను పక్కకు జరిపి, ఉత్తరదిక్కున ఉన్న గుఱ్ఱపుశాలవైపు దృష్టిసారించింది. గుర్రాలకు కళ్ళేలను బిగించి, స్వారీకి నాడాలను సరిచేస్తున్న సిద్ధప్ప... రెండవ వరుసలోవున్న తెల్లని గుర్రాన్ని ప్రేమగా నిమురుతూ, తినడానికి గడ్డిపరకల్ని వేసాడు. గుర్రం తినకపోవడం చూసి, తన వెంట తెచ్చుకున్న నార సంచిలోనించి రెండు జొన్న కంకుల్ని తీసి గుర్రం నోటికి అందించాడు. ఎంతో ఇష్టంగా తినే జొన్న కంకుల్ని సైతం తినడానికి హితవు లేనట్టు, మొహం పక్కకు తిప్పుకుంది బృహతి. 

       పట్టుకుచ్చులాంటి పొడవైన తెల్లని తోకను, వెనక రెండు కాళ్ళ మధ్యా లోనికి లాక్కుని, తన అయిష్టతను వ్యక్తం చేస్తున్న బృహతి పృష్ఠభాగంపై చేతితో మెల్లగా తట్టి, మెడను ప్రేమగా స్పృశిస్తూ... తన తలను ఆ తెల్ల గుఱ్ఱానికి ఆనించి, నిట్టూర్చాడు సిద్ధప్ప. నల్లటి కాటుకనద్ధినట్టున్న విశాలమైన కళ్లలోంచి వర్శిస్తున్న కన్నీటి ధారలు, ఆ మూగజీవి మనసులోని బాధకు అద్దం పడుతున్నాయి. 

 

        "రాకుమారీ! ఈరోజు మాఘ పౌర్ణమి... కొలనినుంచి ఎర్రని తామరలు తెప్పించాను. అమ్మవారి అలంకారానికై తెల్ల చామంతి దండలూ, తులసి మాలలూ, పట్టు వస్త్రాలూ సిద్ధం చేసాను. విప్పపువ్వు, పట్టు తేనె సమర్పించి, చెంగాలమ్మ పరమేశ్వరి ఆశీర్వచనం తీసుకోమని నాన్నగారి కోరిక. గులాబీ రేకులూ, కస్తూరీ కలిపిన పన్నీటి జలము, స్నానానికి సిద్ధంగా ఉంది... పాలమీగడా, పసుపూ రాసుకుని, తొందరగా స్నానం ముగించిరండి" చందన గంధమద్దిన ఎర్రటి అంచున్న తెల్లని పట్టు చీర, రవికెను నెమలి తల్పంపై ఉంచుతూ చెప్పింది, చెలికత్తె జాహ్నవి.

       అర్థగంటలో అభ్యంగన స్నానం పూర్తిచేసి, సూర్యనాస్కారాలు చేసుకుని, పట్టువస్త్రాలు అలంకరించుకుని, రాచ మర్యాదలతో అమ్మవారి గుడికి బయలుదేరింది చిత్రలేఖ.

తాను ఎంతో ప్రేమగా చూసుకునే బృహతికి నుదుటన కుంకుమ అద్ది,  చెవులకు బంగారుపోగులు తగిలించి, అమ్మవారికి సమర్పించే కానుకలను తీసుకుని, నూట ఎనిమిది గోక్షీర కలశాలతో అమ్మవారి అభిషేకానికై తరలివెళ్లింది రాకుమారి చిత్రలేఖ.

 

       మాఘపౌర్ణమి రోజు రాత్రి రాకుమారి చిత్రలేఖ, వెన్నెల రాతిరిలో కోటకు దగ్గరలో ఉన్న   కాళిoది నది అందాలను, కోట గవాక్షం నుండి వీక్షిస్తూ పరవశంతో మైమరచిపోయింది. 

  నీరపు చుంబనమందుటకు, తారల గుంపును విడివడి, చీకటి ఒడిలో చేరిన చంద్రుడు... కాళిందీ నది నురగల ముత్యపు కాంతిలో తెల్లని పూలబంతివలె  తేలియాడుచుండడం చూసి, ఆనందాశ్చర్యాలకు లోనయ్యింది. నింగి విడిచి, నీటిలోకి జారినట్టున్న ఆ నిజపూర్ణ బింబానికి భక్తితో నమస్కరించింది. 

     నది ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్లపైకి చేరి, నిద్రిస్తున్న తెల్లని కొంగల గుంపులు... విరబూసిన చెట్లను తలపిస్తుంటే, నీటి అలలను తాకి ఆటలాడు పిల్లగాలి చల్లని స్పర్శకు, నిద్రలోకి జారుకుంది చిత్రలేఖ. 

                                                                       ******    ******    ******   ******

     "డాక్టరు గారూ! రెండు, మూడు సంవత్సరాలుగా మా అమ్మాయి మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదు. తానేదో రాజవంశానికి చెందినదానిననీ, నదీ విహారానికి వెళ్ళినప్పుడు, సుడిగుండంలో పడవ చిక్కుకుని ప్రాణాలు కోల్పోబోతే, చెంగాలమ్మ అమ్మవారు తనని కాపాడిoదనీ... ఏవేవో పొంతనలేని మాటలు మాట్లాడుతూ, నిద్రలో కలవరిస్తోంది. ఎంతోమంది వైద్యులకి చూపించాం. వ్యాధి నయం కాలేదు. చివరి ఆశగా మీ దగ్గరకి తీసుకువచ్చాం. మా అమ్మాయి మామూలు మనిషి అయ్యే మార్గం చూడండి డాక్టర్!" అంటూ డాక్టర్ దాయానంద్ కు చేతులు జోడించి వేడుకున్నారు... నిఖిత తల్లిదండ్రులు. 

 

       సరిగ్గా మూడు సంవత్సరాల క్రిందట, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆరుగురు విద్యార్థినులు, చంద్రయాన్-2 రాకెట్ ను అంతరిక్షoలోకి ప్రవేశపెట్టినప్పుడు, చూడడానికి శ్రీహరికోట వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తలు కొందరు, 'షార్' చైర్మన్ తో కలిసి, రాకెట్ లాంచింగ్ కు ముందు... సూళ్ళూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి, అమ్మవారిని దర్శించుకుని, రాకెట్ నమూనాను అమ్మవారి ముందుంచి, ప్రత్యేక పూజలు చేయించారు. 

      ఆరోజు ఆలయ సందర్శనార్థం అక్కడికి కొందరు విద్యార్థులు కూడా వెళ్లారు. అందరూ చాలా ఆసక్తిగా ఆలయ చరిత్రను గురించి స్థానికులను అడిగి తెలుసుకుంటుంటే... నిఖిత మాత్రం ఆ ప్రదేశం తనకు ఎప్పట్నుంచో పరిచయం ఉన్నట్టుగా అక్కడ తిరగసాగింది. 

      ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పచ్చనిచెట్టు వద్దకు వెళ్లి, అక్కడ ప్రతిష్టించిన నాగులకు నమస్కరించి, దగ్గరలోనే ఉన్న నది ఒడ్డున దేనికోసమో వెతకసాగింది. నది ఒడ్డునే కూర్చుని, అస్తమిస్తున్న  సూర్యునివంక తదేకంగా చూడసాగింది నిఖిత. దూరంగా కనపడుతున్న కొండపై శిథిలావస్థలో ఉన్న కట్టడాన్ని చేరుకోబోయేంతలో... చీకటివేళ అటువైపు వెళ్లవద్దన్న స్థానికుల సూచనతో వెనుదిరిగింది.

 

     అప్పటినుంచీ ఆమె గజిబిజి ఆలోచనలతో సతమతమవసాగింది. విశాఖపట్నం తిరిగి వచ్చాక, తానొక రాజకుమారిననీ, అరేబియా నుంచి వచ్చిన విదేశీ పర్యాటకుడు ఒకరు, తాను గుర్రపు స్వారీపై మక్కువ కలిగివుండడం గమనించి, తమ బృందం వెంట తెచ్చుకున్న గుర్రాలలో రెండు తెల్లటి గుర్రాలను తనకు బహుమతిగా ఇచ్చాడనీ చెబుతుండేది. 

      అయితే తాను ఎంతో ఇష్టంగా శిక్షణనిచ్చిన బృహతి, జగతి అనే ఆరెండు తెల్లని గుర్రాలలో... జగతి, మాఘ పౌర్ణమి రోజున నాగుపాము కరిచి చనిపోయిందని చెబుతుండేది. నిఖిత మానసిక పరిస్థితి చూసి గందరగోళ పడిన ఆమె తల్లిదండ్రులు, కనపడిన వైద్యునికల్లా ఆమెకున్న మానసిక వ్యాధి గురించి చెప్పి, వారిచ్చిన మందులు ఆమెకు వాడేవారు. చివరకు బంధువులూ, స్నేహితులూ ఆమెకు పిచ్చి పట్టిందనీ, ఏదో ఆత్మ ఆవహించిందనీ... రకరకాలుగా చెప్పుకునేవారు. 

 

       వారు చెప్పినదంతా విన్నాక, నిఖితతో విడిగా మాట్లాడి, ఆమెలో అలజడికి కారణమవుతున్న విషయాలు గురించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేసాడు డాక్టర్ దాయానంద్. 

      బ్రెయిన్ కి అవసరమైన స్కానింగ్ లు తీసి, ఆమె మానసిక పరిస్థితిలో మార్పేమీ లేదనీ, నార్మల్ గానే ఉందనీ నిర్ధారించుకున్నాక... ఆమె చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంతుందో తెలుసుకునే దిశగా  ప్రయత్నం చెయ్యమని ఆమె తల్లిదండ్రులకి డాక్టర్ దాయానంద్. అతని సలహా మేరకు నిఖితని తీసుకుని, సూళ్లూరుపేటకు బయలుదేరారు.

                                                                           *****    *****   *****   *****

          సూళ్లూరుపేట చేరుకోగానే నిఖిత ముఖంలో ఏదో తెలియని ఆనందం. అక్కడి ప్రదేశాలన్నీ ఎప్పటినుంచో అలవాటు ఉన్నదానిలా తిరగసాగింది. చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయానికి చేరుకొని, అమ్మవారిని దర్శనం చేసుకుంది. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న చెంగాలమ్మ చెట్టు దగ్గరకు వెళ్లి, భక్తితో మూడు ప్రదక్షిణాలు చేసి, చెట్టు మొదట్లో ప్రతిష్టించబడిన పంచ నాగుల విగ్రహాలకు పసుపు, కుంకుమతో పూజలు చేసి, పాలతో అభిషేకం చేసింది. 

దూరంగా కనిపిస్తున్న కొండమీద శిథిలావస్థలో ఉన్న కట్టడం దగ్గరకి తనను తీసుకువెళ్ళమని కోరడంతో... అందరూ అక్కడికి చేరుకున్నారు. 

        

             ఎప్పటిదో, ఆరు శతాబ్దాల క్రిందటి కోట... చోళ రాజులు శుభగిరి అనే ఆ ప్రాంతాన్ని ఏలిననాటి జ్ఞాపకాలను, నిఖిత పూస గుచ్చినట్టు చెబుతుంటే అందరూ విస్తుపోయి చూసారు. తానొక రాజ కుమార్తెననీ, తన పేరు చిత్రలేఖ అనీ, ఆరు వందల సంవత్సరాలకు ముందు మరణించిన తాను... మరలా ఈ జన్మలో నిఖితగా పుట్టాననీ చెబుతున్న ఆమె మాటల్లో వాస్తవం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

      కోటకు ఉత్తరాన ఉన్న గుఱ్ఱపుశాల ఆనవాళ్లు, రాజ గురువులు శిక్షణనిచ్చిన విద్యాలయం, భోజనశాల, తూర్పు దిక్కున ఉన్న కాళిందీ నది ఒడ్డున 'జగతి' సమాధి ఉన్న ప్రాంతం... అన్నీ ఒక్కొక్కటిగా చూపించసాగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో బృహతి, జగతి అనీ ఆ రెండు శ్వేతాశ్వాలపై చెంగాలమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తుల్ని శుభగిరిలో ఊరేగించేవారమనీ, ఉత్సవానికి ముందు రెండు గుర్రాలకు బంగారు నాడాలు తొడిగి, పూజించేవారమనీ తెలిపింది. అంతేకాదు కాళిందీ నది ఒడ్డున జగతి అనే ఆ గుర్రాన్ని ఉంచిన సమాధిలో, బంగారు నాడాలు, బంగారు చెవిపోగులతో పాటు అరేబియన్ పర్యాటకుడు ఇచ్చిన లెదరు జీను, దానికి అలంకరించి ఉన్న వెండి గొలుసులు కూడా సమాధిలో ఉంచాననీ చెప్పింది.

         అయితే ఒకప్పుడు చోళరాజులు శుభగిరి అనే ఆ ప్రాంతాన్ని పాలించినప్పటికీ, కాల క్రమంలో ఆ నగరం మట్టిలో కూరుకుపోయి... అక్కడి కట్టడాలు సైతం ఆనవాలు పట్టలేనంత శిథిలావస్థకు చేరుకున్నాయి.

 

         చరిత్ర విశ్లేషకుల సమాచారం ప్రకారం నిఖిత చెప్పినదంతా నిజమేనని తేలింది. దాంతో... కాళిందీ నది ఒడ్డున ఆమె చూపించిన ఆ సమాధి ఉన్న ప్రాంతాన్ని తవ్వి చూసారు. అందులో ఆమె చెప్పినట్టుగానే బంగారు నాడాలు, చెవి పోగులు, వెండి గొలుసులు ఉండడం చూసి అక్కడున్న వారందరూ విస్తుపోయారు. నిఖితకు ఎటువంటి మానసిక వ్యాధీ లేదనీ... కేవలం పూర్వజన్మ జ్ఞానం కలగడం వల్లనే, ఆమెకు ఇలాంటి గజిబిజి పరిస్థితి ఏర్పడిందనిదనీ... పూర్వజన్మ స్మృతులతో తమ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉందనీ తెలిసి, ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషించారు. 

              ------సమాప్తం-----

మనోరథo

lana seetha

- లంక సీత , 9868145541

“సీమంతం”

పుండరీకాక్షయ్య  గారింట్లో   పేరంటాల సందడి.

 ఏమిటిటా విశేషము?

వాళ్ళ కోడలికి సీమంతమట. వియ్యాల వారు చాలా గొప్పవారు. ఇన్నోవా  నిండా  ఫలహారాలు, మిఠాయిలు, అరటి గెలలు, ఇంటిల్లిపాదికి పట్టు బట్టలు అబ్బో ఇంకా ఎన్నో!  పక్కింటావిడతో కబుర్లు. ఊరందరిని పేరంటానికి పిలిచారు. పిలిచినప్పుడు వెళ్ళక పోతే బాగుండదు మరి . మనమేమో వాళ్ళ తాహతుకు తగక  రాలేదనుకుంటారు. గొప్పింటి వాళ్ళ ఇంట్లో సీమంతం ఎలా ఉంటుందో చుడాలిగా మరి ! ఓ సారి వెడితేనే సరి.

పేరంటాళ్ళ సందడి హాలులో మారు మ్రోగుతోంది. సావిత్రమ్మ అందరిని సాదరంగా పలకరించి ఆహ్వానిస్తోంది. వచ్చిన వారంతా ఒకరినొకరు పల్కరించుకుంటూ కబుర్లాడుకుంటున్నారు. ఇంతలో "ఏం వొదినా  ఎన్నాళ్ళయింది నిన్ను చూసి మరీ నల్లపూసవైపోయావు" అంటూ సుశీలమ్మ పలకరింపు మీనాక్షమ్మని.

 

 "ఏం చెప్పమంటావు మీ అన్నయ్య పని తోనే సరిపోతుంది రోజంతా .  పొద్దున్న లేచిన దగ్గరనుంచి ఎవరో ఒకరు రావడము. మా అమ్మాయికి పెళ్లి ముహూర్తము చూడండి అనో అన్నప్రాసన ముహూర్తము చూడండి అనో వొడుగుకి మంచి ముహుర్తాలు ఉన్నాయా అనో ఒకరి తరువాత ఒకరు రావడము ఈయన గారు తననే గదా అడుగుతున్నారు  అని వొళ్ళు మర్చిపోయి అదే పనిలో మునిగి పోయి ఏ ఝాముకీ  భోజనానికి రాక అపరాహ్ణము దాటిపోవడము నిత్యం జరిగే బాగోతమే.”

 

“సరే భోజనాలయి ఇలా నడుం వాల్చానో లేదో”  "ఏమోయ్ మబ్బు పట్టి వర్షం వచ్చేలా వుంది దొడ్లో బట్టలు తీయి అంటూ ఒకటే నస. ఎలాగూ లేచావుగా  కాఫీ తో పాటు వేడిగా కొంచెం పకోడీలు చెయ్యి అంటూ సన్నాయి నొక్కులు"  ఇంకా నాకు తీరికెక్కడ పెత్తనాలకి.

“వీళ్ళ వియ్యాలరు బాగా వున్నవాళ్ళటగా అంది గుస గుసగా  కాంతమ్మ”  అవును మరి అబ్బాయి పెద్ద చదువులు చదివి ఫారిన్ లో   ఉద్యోగము, ఒక్కడే పిల్లాడు అందుకే ఏరి కోరి వీళ్ళ సంబంధము చేసుకున్నారట అని మరొకరు. పెళ్ళిలో అమ్మాయికి బంగారము ఘనంగానే పెట్టారుట. వియ్యపురాలికి కూడా బంగారపు గొలుసు, పట్టు చీర పెట్టారుట. ఇంతలో సావిత్రమ్మ అటుగా రావడము తో మాటలు ఆపేసారు.

 

సావిత్రమ్మ మాత్రం  తక్కువదా ! తమ వియ్యాలారి గొప్పదనము తమ హోదా చూపించుకోవాలిగా మరి ! అందుకే ఊర్లో తెలిసిన వారందరిని  కోడలు సీమంతానికి పిలిచింది. ఎంతయినా ఆ ఊర్లో  పేరుమోసిన కుటుంబమాయె మరి ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా ?

 

అమ్మాయ్  నేను చెప్పినవన్నీ ఏర్పాటు చేసావా? అంటూ పురోహితుల వారు ప్రవేశించారు.  వస్తూనే  మూడు ఇరవై కె ముహూర్తం అన్నారు.

 

        ఆ ఆ అన్ని రెడీ గా వున్నాయ్ పంతులుగారు అంది సావిత్రమ్మ. వియ్యపురాలు తెచ్చిన వన్నీ  పళ్లేల నిండా పెట్టి, పళ్ళు, పూలు, గాజులు వగైరా  సిద్ధం చేసింది. సావిత్రమ్మ మరొక పక్క తమ తరఫునుంచి పంచదార చిలుకలు, చందనం బొమ్మలు, ముత్తైదువులకు ఇచ్చే తాంబూలాలు , రవికల బట్టలు తయారుగా  పెట్టింది.

        వచ్చిన వారంతా ఒక్క సారిగా నిశబ్దమయిపోయి మాటలు ఆపేసారు. వీడియొ గ్రాఫరు, కెమెరా వాళ్ళు కూడా ప్రవేశించారు. ఇంకా ముహూర్తంకి  పది  నిమిషాలు టైముంది వుంది. అమ్మాయిని  బ్యూటీ పార్లర్ అమ్మాయి తయారు చేస్తోంది. పంతులు గారు అమ్మాయిని తీసుకు రండి అని తొందర పెడుతున్నారు. వచ్చేస్తున్నాం అంటూ లోపలినుంచి జవాబు. ముహూర్తము దాటి పోకూడదు. త్వరగా రావాలి అని పంతులు గారు ఒకటే తొందర చేస్తున్నారు.  అక్కడ అమ్మాయి ముస్తాబు పూర్తి అవలేదు. ముహూర్తము దాటిపోతుందని అందరికి ఆత్రుత.  పంతులుగారు గట్టిగా అరిచారు...... కోపంగా  ముహూర్తబలం మీకు తెలియడం లేదు అని విసుక్కుంటున్నారు. వెంటనే సావిత్రమ్మ గబ  గబా లోపలి వెళ్లి సగం మేకప్ తో వున్న కోడలిని తీసుకు వచ్చేసింది. అమ్మాయిని చూసి పేరంటాళ్ళందరూ ఒకటే ముసి ముసి నవ్వులు. అమ్మాయికేమో చాలా సిగ్గుగా వుంది. వీడియొ, ఫోటో వాళ్లకి తీయొద్దని చెప్పేసింది.

 

మరి ఈ కాలంలో ముహుర్తానికంటే వీడియోలకు, ఫొటోలకే ఎక్కువగా ఎక్కువ ప్రాధాన్యత  ఉంటోందిగదా !  ముహుర్తాలు దాటిపోయే ఫంక్షన్లు అనేకం  చూస్తున్నాము. పూర్వకాలం లో ముహూర్త బలం అని ఒక్క సెకను గూడా అటు ఇటు కానివ్వకుండా జరిపేవారు.

 

ముత్తైదువులందరు గాజులు తొడగడానికి, పూలు పళ్ళు పెట్టడానికి ముందుకు వస్తుంటే పంతులు గారు "మీరంతా వుండడమ్మా!  అవన్నీ తరువాత చేద్దురు ముహూర్తము దాటి పోకుండా ముందు  పిల్ల తల్లి పిల్ల వొళ్ళో చలిమిడి, పూలు, పళ్ళు పెట్టాలి”  అని మంత్రం మొదలు పెట్టారు. ముహూర్తము  పూర్తి అయిన తరువాత వేడుకలు ఎన్నయినా చేసుకోవచ్చు అన్నారు.  ఓహో ఇది పెద్దింటి పద్దతి గాబోలు అని వెనక్కి తగ్గారు  అందరు. 

 

రుస రుసలాడుతూ మొహం ముడుచుకుని కూర్చుంది. కూతురు మొహం చూసి 'ఇంకేం హంగామా

చేస్తుందో అని భయపడి తల్లి తబడుతూ ముందుది వెనక వెనకది ముందు గా పిల్ల వొళ్ళో ముందుగా చీర పెట్టబోతుంటే  “పంతులుగారు అమ్మా ముందు చలిమిడి, పళ్ళు, పూలు పెట్టాలి ఆ తరువాత చీర పెట్టాలి” అన్నారు. అప్పుడు  పంతులుగారు చెప్పినట్లే అన్ని పెట్టింది. తరువాత అత్తగారు కూడా పెట్టడము పూర్తి అయి  ముహూర్తము  టైముకే  కార్యక్రమము అయిందనిపించారు.

 

"ఇంకొంచెము ఉంటే ముహూర్తము దాటిపోయేదే"  అన్నారు పంతులు గారు.   అమ్మయ్య  అని అమ్మలక్కలందరు ఊపిరి  పీల్చుకున్నారు.

  ఫార్మాలిటీ పూర్తి అవుతూనే అమ్మాయి టక్కున  లేచి మేకప్ పూర్తి చేసుకోవడానికి లోపలి కి వెళ్ళిపోయింది. మేకప్ పూర్తి అయి  ముప్పావు గంట తరువాత అమ్మాయి వచ్చింది. ఇక  మళ్ళీ వీడియొ, ఫోటోల  రీటేక్  కార్యక్రమము మొదలయి ఇంకో ముప్పావుగంట నడిచింది. వచ్చిన వారంతా వెళ్లాలనే తొందరలో వున్నారు. 

తరువాత ముత్తయిదువులందరు ఒక్కొక్కరుగా అమ్మాయి  చెప్పినట్లే    అంటి   అంటనట్టుగా బొట్టుపెట్టి,  గాజులు  తొడిగి దీవించారు.  కార్యక్రమమంతా పూర్తయ్యేసరికి ఇంకో  గంట పట్టింది.

మూడుగంటలకే  ముహూర్తము అన్నారని హడావిడిగా రెండుగంటలకే బయలుదేరి వచ్చారాయె మరి.  అప్పుడే ఆరయిపోయింది. అందరికి వెళ్లాలనే తొందర. అందరు సావిత్రమ్మ గారు ఇచ్చిన  పసుపు కుంకుమ, తాంబూలము తీసుకుని  నెమ్మదిగా నిష్క్రమించారు. ఇల్లు గాలివాన వచ్చి వెలిసినట్లు నిశబ్దముగా అయింది.

 

ఎంతయినా ఆడంగులు కదా  మరి  పోస్ట్ సీమంతం కబుర్లు చెప్పుకోకుండా వెళ్ళలేరు. బయటకు వస్తూనే జంటలు జంటలుగా గుసగుసలు మొదల్లయ్యాయి.. "ఇదేమి విచిత్రమమ్మా సీమంతము అంటే ముత్తైదువులంతా కడుపు చలవ కోసం బొట్టు పెట్టి ,పూలు పెట్టి, పళ్ళు చేతిలో పెట్టి ఆశీర్వదిస్తారు. అటువంటిది ఆ పిల్ల  పూలు పెట్టించుకోలేదు సరిగదా బొట్టు  గూడా వొద్దంది. మేకప్ పాడయిపోతుందిట." అని ఒకావిడ అంటే మరొకావిడ "అంతే కాదు రేపు వాళ్ళ అబ్బాయి వచ్చాక  మళ్ళీ అన్నీ చేస్తున్నట్లు  వీడియో తీస్తారుట వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించడానికి ". "ఓహో ఇవన్నీ డబ్బున్న వాళ్ళ పద్ధతులు కాబోలు" అని మరొకావిడ. ఇళ్ళకి వెళ్లాలని తొందర పడినవాళ్లు వీధి చివర నుంచుని కబుర్లాడుతున్నారు.  “

 

“అంతేలే మరి మనరోజులేమిటి పెద్దవాళ్ళు ఎలా చెబితే అలా నడుచుకోవడానికి. ఈ  కాలం ఆడ  పిల్లలు చదువుకుని మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు వెలగబెడుతున్నారాయె!  డబ్బు సంపాదన వున్నప్పుడు నోరెత్త లేరు మరి అని మరొకావిడ సన్నాయి నొక్కులు.”  “వియ్యాల వారు రేపే పిల్లని తీసుకు వెడతారు అంది సావిత్రమ్మ మరి రేపు ఈ వీడియొ తతంగము ఎలా చేస్తారుట?  ఆ దానిదేముందిలే వియ్యాల వారు ఇంకో రోజు వుండే వెడతారు.”  అంది మరొకావిడ. ఇవీ పేరంటాళ్ళ కబుర్లు.

మొత్తాన్ని పుండరీకాక్షయ్య గారి కోడలు సీమంతము వూళ్ళో ఒక పెద్ద చర్చనీయాంశము అయిపోయింది.

మొదటి కానుపు ఏడవ నెలలోనే తీసుకు వెడదామని వియ్యపురాలు, వియ్యంకుడు వచ్చారు. మరునాడే ప్రయాణము.  సావిత్రమ్మ, పుండరీకాక్షయ్య గారు  వియ్యంకుడికి, వియ్యపురాలికి ఘనంగా బట్టలు పెట్టి , బహుమతులు  ఇచ్చి పంపించారు.

వియ్యాల వారిని సాగనంపాక సావిత్రమ్మ రాబోయే మనవడి గురించి కలలు కనడం మొదలెట్టింది. పైకి ఎంత మోడరన్ కాలంలో ఉంటున్నాఆడవారి మనసుల్లో జీర్ణించుకు పోయిన  పాత పద్ధతులు, పాత ఆలోచనలు ఎక్కడికి పోతాయి!  అందుకే సావిత్రమ్మ  గారి ఆలోచనలు వంశోద్ధారకుడు  మగపిల్లవాడే పుట్టాలని తాను అందుకు తగ్గట్టు ఆర్భాటం గా అన్నిముచ్చట్లు జరపాలని  కలలు కనడం మొదలెట్టింది.

మనవడు పుడితే తమ గొప్పతనము, ఆడంబరాలు చూపించుకుందామని తెగ ఉబలాట పడిపోతోంది. వంశోధారకుడు  మనవడు వచ్చాక కోడలి సీమంతం కంటే గొప్పగా మనవడిని  ఉయ్యాలలో వేయడము, మూడో నెలలో ముద్దలు పంచిపెట్టడము, పాకుతే పాయసము పంచిపెట్టడము వగైరా వగైరా లు ఊహించుకుని మురిసిపోతోంది.

అంతే మూడు నెలలు యిట్టె గడిచి పోయాయి.  ఒకనాడు వియ్యంకులు వారి వద్దనుంచి ఫోను." మీ కోడలికి ఈ రోజు డెలివరీ అయింది  ఆడపిల్ల పుట్టింది. తల్లి, పిల్ల క్షేమం గా వున్నారు" అని. అది విని మగపిల్లాడు పుడతాడు అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకుందాము అనుకున్న సావిత్రమ్మ  ఒక్క సారిగా నీళ్లు కారిపోయింది. ఆవిడ ఉత్సాహమంతా  పొంగిన పాలమీద నీళ్లు చల్లినట్లు చప్పబడిపోయింది.                                                                    

సావిత్రమ్మ కూడా ఆడదయి ఉండి   ఆడపిల్ల అనగానే నిరుత్సహ పడిపోవడము ఎంతవరకు సబబు ? ఈ కాలంలో గూడా ఆడ మొగా అంటూ వివక్షత చూపడము ఆశ్చర్యం అనిపించడం లేదూ ?

                                                ********************

 

ప్రస్థానం

- సిస్టర్ అనసూయ, 8074573716.

 

      అప్పుడే తన డ్యూటీని ముగించుకొని పాలు తాగ గూట్లోకి చేరుటకు సిద్ధంగా ఉన్నాడు సూర్యుడు. 

      అతడు ఇంటికి చేరగానే, అడవిలోని పశువులు, పశువుల కాపరులు, అడవి జంతువులు, పక్షులు తమ తమ ఇండ్లలోకి చేరుతున్నయి.

       వ్యవసాయ కూలీలు, ఉద్యోగం చేసేవారు అందరూ ఇంటికి వెళ్తున్నరు.

      అదే గ్రామానికి చెందిన నిర్మల అనే స్త్రీ అడవిలో  ఓ వేప చెట్టు కింద మాసిపోయిన బట్టలతో ఒక్కతే ఒంటరిగ కూర్చొని ఉంది. ఆమె ఎంతో విచారముతో కృంగిపోయిన హృదయముతో బాధపడుతూ ఉంది.

  పశువులను మేపుకుంటూ నిర్మల కూర్చున్న వేప చెట్టు దగ్గరకు వస్తూ,  ఎవరిమె ఒక్కతే కూర్చొని ఉంది. అచ్చం నిర్మల వలె ఉంది అని తన మనసులో అనుకుంటూ వచ్చి, "ఏందే నిర్మల పొద్దుగింతలప్పుడు ఇక్కడ కూర్చున్నవు? నీ భర్త ఏమన్నా కొట్టిండా ఏంది?" అని అడిగింది శ్వేత.

"ఏం లేదు అక్క" అంది నిర్మల.

" అయితే ఇంటికి పోదాం లే చెల్లా"  అంటూ చేయి బట్టి లేపింది శ్వేత. 

"నేను రాను అక్క.  నువ్వు వెళ్ళిపో అక్క" అన్నది నిర్మల. 

"అవును చెల్లా నిన్న రాత్రి మీ ఇంట్లో ఒకటే అరుపులు కేకలు వినబడుతున్నవి . మీ అత్త నోరుకు భయపడి రాలేదురా ఏమైంది చెల్లె" అన్నది శ్వేత.  

"ఏం చెప్పమంటవు అక్క నా బాధ, దేవుడు తొందరగా తీసుకపోతే" బాగుండు అంటు ఏడ్చింది నిర్మల. "నీకేమైంది రా ఇంత చిన్న వయసులో చావు గీవు అంటున్నావ్ పైన తధాస్తు దేవతలు ఉంటారంట అట్లా అనబాకు చెల్లె  చిన్నప్పుడు మా అమ్మమ్మ అంటుంటే విన్నాను." శ్వేత 

"ఉండని అక్క  బతికిన దాంట్లో ఏం సుఖం లేదు"  అని అంటుండగానే మేకలను మేపుకుంటూ మల్లమ్మ కూడా అక్కడికి వచ్చింది. 

వెంటనే శ్వేత "ఏంది మల్లక్క ఇయ్యాల నువచ్చినవ్, మా  మర్ది ఎక్కడికి పోయిండు?" 

 "మా కోడల్ని దావకానకు తీసుకొని పోయిండు." 

"ఎందుకు అక్క ఏమైంది?"

"ఏం కాలే రా నెల తప్పింది. అన్నం పడతలేదు." 

"ఓ అవునా."

"మా చిన్నోడ్ని జర పోరా మేకల కాడికి అంటే నాకు పరీక్షలు ఉన్నవి నేను పోలేనన్నడు. ఇక నాకు తప్పదని మోకాలు నొప్పులు ఉన్న కూడా వచ్చిన.  గాని ఇవేమో కోతి కులమాయే ఎక్కడ పచ్చగ చెట్లు కనిపిస్తే చాలు పరిగెత్తుకుని పోతయి. ఒక్క దగ్గర మేసేవి కావాయే గొర్ల లెక్క" అంటూ నిర్మలను చూసి "నీవెందుకొచ్చినవ్ కోడలా పశువుల కొన్నర" అని అడిగింది మల్లమ్మ.

నిర్మల తలకిందుకేసి ఈమె ఎందుకు వచ్చింది దేవుడా లేనిపోని మాటలు మా ఆయనకు చెప్పగళ్ళ అని మనసులో అనుకుంది.

"దానికి పుట్టెడు బాధలు ఉన్నవి మల్లక్క! ఇంటిల్లుపాది  నల్లిని పొడిచినట్లు పొడుస్తున్నరు  అంటూ

సరే చెల్లా అందరూ ఇంటికి వెళ్తున్నరు పోదాం రా" అని మరల చేయి బట్టి లేపింది శ్వేత.

నా జీవితాన్ని ఈరోజుతో ముగించుకోవాలని నేను అనుకుంటే సరుక్కునా వీరి కంట బడితిని. ఈ అక్కేమో వదులుతలేదు. ఏంది దేవుడా! నా బ్రతుకుతో ఆడుకుంటున్నావ్ అని మనసులో అనుకుంది నిర్మల.

"ఇంగా లే నిర్మల పొద్దుగూకింది అందరూ ఇల్లు చేరినాలే, మీ బావ పరీశాన్ అయితడు అని చేయబట్టి లేపింది శ్వేత.

వెంటనే మల్లమ్మ "లే బిడ్డ మన ఆడోళ్లకు ఎప్పుడు ఈ బాధలు ఉండేవే. మనకు ఒత్తుకున్నంత ఓపిక భూదేవికున్నంత సహనము ఉండాలని మా నాయనమ్మ అంటుంటే విన్నాను. ఇప్పటి పిల్లలకు ఒత్తు గురించి తెలవదు. ఇప్పుడు అన్ని గ్యాస్ పొయ్యిలాయే మా చిన్నప్పుడు చలికాలంలో అందరం ఒత్తుల నీళ్లతో ముఖం కడుక్కునే వాళ్ళం. అప్పుడప్పుడు స్నానం కూడా వత్తుల నీళ్లతోనే చేసేవాళ్లం."

 "వత్తంటే ఏంటిది మల్లక్క?"

అని అడిగింది శ్వేత.

మల్లమ్మ-"ఒసే నీకు సగ తెలవదా వత్తు అంటే"

"తెలవదక్క. తెలిస్తే ఎందుకు అడుగుత" శ్వేత.

అప్పుడు మల్లమ్మ శ్వేతతో 

"ఒత్తు అంటే! మూడు పోయిరాళ్లకు బదులు రెండు పోయి రాళ్లు ఒక కుండను పెడతారు. ఆ కుండలో నీళ్లు పోస్తరు. అన్నము కూరతో పాటు, కుండలో ఉన్న నీళ్లు కూడా బాగా కాగుతయి. దీనినే ఒత్తు అంటరు. ఆ కుండలో ఉన్న నీళ్లను ఒత్తుల నీళ్లు అంటరు." 

"అవునా!!" అక్క అంటుంటే, నిర్మల తన మనసులో నేను చచ్చిపోతానని కనుక్కొని వస్తే ఇలా జరిగిందేంది ఈరోజు కాకపోయినా అందరు పడుకున్నాక రాత్రికి ఎట్లైనా రావాలి. బతికిన దాంట్లో ఏమి లాభం లేదు మా అమ్మ దగ్గరకు పోదామంటే అక్కడ ఇద్దరు వదినలు ఉన్నరు. వారి దగ్గర ఏం బాగుంటది అనుకుంటున్నా సమయంలో 

"లే నిర్మల నా మాట విను నా కోసం లే ఈ రాత్రి మా ఇంట్లోనే ఉందువు మీ ఇంటికి ఏం పోవద్దు" అని శ్వేత అనగానే నిర్మల మనసు మార్చుకుని లేచింది.

 ముగ్గురు కలిసి నడుస్తున్నరు. "ఇప్పుడు చెప్పు నిర్మల ఏమైంది" అని అడిగింది శ్వేత.

 "ఏమి లేదు అక్క  నాలుగైదు రోజుల నుంచి రాత్రి 12 గంటలకు ఇంటికి  వస్తుండక్క మీ మరిది. ఇంత రాత్రి దాకా ఏం పని ఉంది. మొన్ననే కదా ఆపరేషన్ అయింది. ఉన్నది మనిద్దరమే నాయే. రోజు మధ్య రాత్రి వస్తున్నవని అడిగిన అంతే అక్క. నా జుట్టు పట్టి గిర గిర తిప్పి కొట్టుకుంటూ నీ దగ్గర ఇంకేముందేలం... గర్భసంచి తీసేసిరి. ఇక నీకు పిల్లలు పుడుతరన్న  ఆశ కూడా లేదు. ఇంకెందుకే ఇక్కడ ఉండేది. మీ ఇంటికి వెళ్ళిపో. పిల్లల కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నను ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు అంటూ నానా మాటలు తిడుతూ  కొడుతుండు అక్క" అని  ఏడుస్తూ చెప్పింది నిర్మల.

"ఏడవకు నిర్మల ఇంతకుముందు సొంతం మేనమామ బిడ్డను పెళ్లి చేసుకుండు. దానికి కూడా అచ్చం నీలాగే గర్భసంచికి పుండై ఆపరేషన్ అయింది. పిల్లలు పుట్టరని దాని సగ అట్లనే ఎల్లగొట్టిండు. ఇట్లా ఎంతమంది ఆడపిల్లలను మోసం చేస్తడు" అని శ్వేత అంటుండగానే మల్లమ్మ "ఇన్నాళ్ల లెక్క బయటికి వచ్చి కూసుంటే ఒకరి కష్టాలు ఒకరికి తెలిసేవి ఇప్పుడు టీవీలు సెల్ ఫోన్లు వచ్చి ఓకే ఇంట్లో ఉన్న తల్లి పిల్లలు భార్య భర్తలు కూడా కలిసి మాట్లాడకుండా ఉంటున్నరు. చూసినవా నిర్మల నీకు ఆపరేషన్ అయిన సంగతే నాకు తెలవదు. ఎందుకురా ఆపరేషన్ నువ్వు మంచిగనే ఉంటివి.

"అవును మంచిగనే ఉంటిని. పిల్లల కోసమని ఒక ప్రైవేట్ హాస్పటలకు వెళ్ళిన. డాక్టర్ అన్ని టెస్టులు చేసి,  గర్భసంచిలో గడ్డ ఉంది.  వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నది. మేము నిజమేనని నమ్మి ఆపరేషన్ చేయించుకున్నను.

 నాకు కిలో గడ్డ ఉందని చూపించి నమ్మించింది. నాకు ఆపరేషన్ అయిన వెంటనే చలితో జ్వరం వచ్చి గడగడ వణుకుతున్నను. ఏం చేయాలో అర్థం కాట్లేదు. ఎందుకు మేడం ఆపరేషన్ అయిన వెంటనే జ్వరం వచ్చింది అని అడిగితే మలేరియా జ్వరం వచ్చిందమ్మా అని  చెప్పి ఏమి కాదమ్మా అదే బాగా అయితది ఓపిక పట్టండి అన్నది.

 కొన్ని రోజుల తర్వాత షుగర్ ఉందని  చెప్పింది. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకపక్క ఆపరేషన్, మలేరియా జ్వరము మరొక పక్క షుగర్. ఆరోగ్యంగా ఉన్న నేను హాస్పటల్ కొచ్చి రోగాలను తగిలించుకున్న ఏంది నా జీవితం ఇట్లా అయిపోయిందని తలుచుకుంటే తలుచుకుంటే మనసంతా బాధైతుంది.

 ఏది తిందామన్నా ఇబ్బందిగా ఉంది. 

ప్రతి దినము జావలతో గడుపుతున్నను. దినదినము నా ఆరోగ్యం కృషించిపోతుంది.

 నాకు అన్నం తింటే వెళ్ళిపోతుంది. నా ఆరోగ్యం రోజురోజుకు దిగజారిపోతుంది. లేవలేక పోతున్నను. ఒంటరిగా నడవలేక పోతున్నను. మా తల్లిదండ్రులు నారెండు  రెక్కల కింద చేయి పెట్టి పట్టుకొని లేపి నడిపిస్తున్నరు.

ఒకరోజు మా పెద్దమ్మ బిడ్డ ఫోన్ చేసింది. నా ఆరోగ్య స్థితినంతా  తెలుసుకుని, డాక్టరమ్మ మిమ్ములను మోసం చేసింది చెల్లా. మీరు వేరే హాస్పటల్ కు వెళ్లండి అని చెప్పింది.

 కానీ మేము ఉన్న డబ్బంతా  ఇక్కడే ఖర్చు  పెట్టుకున్నాం. ఇంకా వేరే ఆస్పత్రికి ఎలా వెళ్ళేది  అని ఆ డాక్టర్ చెప్పినట్లే వింటూ వచ్చాము. రెండు నెలల తర్వాత మరల హాస్పిటల్ కి వెళ్లాను డాక్టర్ చూసి ఇక నావల్ల కాదు. హైదరాబాదులో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళండి అని చెప్పింది. 

చేసేది ఏమీ లేక నన్ను మరొక హాస్పిటల్ కు తీసుకపోయిండ్రు. అక్కడ నన్ను చూసి గర్భసంచి మొత్తము చీమొచ్చింది. మరల ఆపరేషన్ చేసి గర్వసంచి తీసేయాలి. లేకపోతే బతకడం చాలా కష్టము అని  డాక్టర్ సార్ అన్నడు. నా భర్త రెక్కల కష్టమంతా అప్పటికే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు.

 నా పరిస్థితిని చూసి మా నాన్న దగ్గర  చేతులొక్క పైస లేదని, ఎకరంశెల్క అమ్మి నన్ను బ్రతికించుకున్నడు. నాకు ఆపరేషన్ అయ్యేంతవరకు నా భర్త బాగానే దగ్గరుండి చూసుకుండు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందో ఏమో నన్ను రోజు తిడుతూ, కొడుతూ, హింస పెడుతుండు"  అని చెప్పింది నిర్మల. 

"ఇంత జరిగినా ఇంటి పక్కల ఉన్న నాకే తెలవదు. ఇగ దూరంగా ఉన్నా నీకు ఎట్ట తెలుస్తదని" అన్నది శ్వేత. 

"నిజమే శ్వేత అని మల్లమ్మ అంటుండగానే ఒక వ్యక్తి మేక పోయిందని దాన్ని వెతుక్కుంటూ

వచ్చి మల్లమ్మ మేకలను  చూస్తున్నడు. వెంటనే మల్లమ్మ "ఎవరయ్యా నీవు నా మేకలను పారాబట్టి చూస్తున్నావ్" అన్నది.

అందుకు అతడు "మాది మీ పక్క ఊరే నా మేక ఒకటి పోయింది దాన్ని వెతుక్కుంటూ వస్తున్న. అది అచ్చం మీ నల్ల మేక లెక్కనే ఉంటదని" అనగానే మల్లమ్మ వెంటనే "ఇవన్నీ మామేకలే నీ మేక మా వాటిల్లో లేదన్నది".

నేను పొద్దంతా మేక కోసం తిరుగుతున్న. అది ఎక్కడ ఉందో ఏమో అంటూ నిర్మల వంక చూసి... "బాగున్నావా  కోడలా" అని పలకరించిండు. 

నిర్మల అతనిని చూసి "బాగున్న మామ" అని అంటుండగానే శ్వేతా కల్పించుకొని "ఈమె నీకు ముందే తెలుసా" అన్నది.

" తెలుసమ్మా ఈమెను మా ఊరికే ఇచ్చిండ్రు. వాడు మా చుట్టమే కానీ చాలా కిరాతకుడు పైసలకు కక్కుర్తి పడి సొంత అన్న భార్యను చంపిండు. ఈ పిల్లను కూడా ఇంట్లో తోలి టీవీ సప్పుడు ఎక్కువ చేసి కొట్టేవాడు. ఒకరోజు ఇంట్లో పెట్టి తాళం వేసి మూడు నాలుగు రోజులు దాకా రాకపోతే పక్కింటి వాళ్ళు చూసీ.. తాళంవిర్ర కొట్టి బయటకు తీసిండ్రు"

అని అంటుండగానే మల్లమ్మ కల్పించుకొని "ఏంది బిడ్డ నీకు ఎక్కడ  బోయిన సుఖము లేదు. అయినా ఈ ఆడవాళ్లకు అన్ని తిప్పలే ఎటు చూసినా ఆడదానికే బాధలు" అని అంటుంటే

 "నిజమే అత్తమ్మ పిల్లలు పుట్టకపోయినా ఆడదాని లోపం  అంటారు. మగ పిల్లవాడు పుట్టకపోయినా  ఆడదాని లోపం అని రెండో పెళ్లి చేసుకుంటారు. ఇదంతా మగవాడి లోపమని కానక ఆడవాళ్ళ లోపం అంటరు కదా" అన్నది శ్వేత.

అంతలోనే మల్లమ్మ కొడుకు ఎదురొచ్చి "ఏందమ్మా ఇంకా ఇంటికి రాలేదు. మేకలు ఎటన్న పోయినవేమనని భయపడి వస్తున్న."

 "అవునా కొడకా అవి ఎటు పోలే.  కానీ డాక్టర్ ఏమన్నడు. ఏమనలే అమ్మ అన్ని బాగానే ఉన్నవి. మల్ల నెలకు రమ్మని చెప్పిండు" అనగానే 

అవున్రా పిల్ల, పిల్లగాడా అని అడిగితేమైంది." 

"మనం అడిగిన కూడా వాళ్ళు చెప్పరమ్మ" అని మాట్లాడుతుండగానే ఊరు వచ్చింది ఎవరింటికి వాళ్లు వెళ్తున్నరు. 

శ్వేత, నిర్మలతో మా ఇంటికి రా చెల్లె రాత్రికి ఇక్కడే ఉండి పొద్దడికి మీ ఇంటికి పోదువు అనగానే వద్దులే అక్క మా ఇంటికి పోతా ఈ రాత్రికి

ఏమన్నా చంపుతాడా ఏంది?

 నన్ను చంపి ఆయనే వంద ఏండ్లు బతుకని అక్క." అంటుంటే శ్వేత చెయ్ పట్టుకొని తన ఇంటికి తీసుకొని పోయింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే శ్వేత అక్క కూతురు నిస్సి కనపడింది.

వెంటనే శ్వేత "బాగున్నావా తల్లి" అని పలకరిస్తూ "ఎన్నాళ్ళకు కాలాడినయ్ తల్లి  ఇక్కడికి రావడానికి. శ్వేత

"లేదు పిన్ని నాకు కూడా రావాలని ఉంటది గాని వీలు పడక రాలేకపోయాను. ఇప్పుడు ప్రాజెక్టు పని మీద వచ్చిన."

" ఓ అవునా తల్లి"

శ్వేత కూతురు వచ్చిందని ఎంతో సంతోషపడి చికెన్ తెప్పించి వంట చేసి పెట్టింది. 

అందరు కలిసి భోజనం చేసిన తర్వాత నిర్మలను పరిచయం చేసింది. 

నిర్మల తన బాధనంతా నిస్సికి చెప్పుకుంది. నీవు పెద్ద చదువు చదివినగా తల్లి ఏమి చేస్తే ఈమెకు న్యాయం జరుగుతుంది  అని నిస్సిని సలహా అడిగింది శ్వేత. "

"ఏం లేదు పిన్ని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి. అప్పుడు వారు  ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇస్తరు" అంటూ ఎన్నో విషయాలను చెప్పింది.

వెంటనే నిస్సి సెల్ నెంబరు తీసుకుంది నిర్మల. 

కొన్ని రోజుల తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ లో భర్త మీద కేసు పెట్టింది నిర్మల. అప్పుడు వారు ఇద్దర్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిండ్రు. వారి దగ్గర నా భార్యను మంచిగ చూసుకుంట అంటడు కానీ ఇంటికొచ్చి మరల అదే కొట్టుడు తిట్టుడు.

 నిర్మల ఈ నరక బాధ నేను భరించలేను నావల్ల కాదు అని నిస్సి తో ఫోన్ చేసి మాట్లాడింది.

 నీవు కృంగిపోకమ్మ ఓపిక పట్టుకో నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ ఆలోచన వల్ల ఆపరేషన్ అయినందుకు ఏమో నా శరీరము రోజురోజుకు బలహీనమైపోతుంది. నేను ఎక్కడికి తిరుగలేని స్థితిలో ఉన్నను. ఇక నా సంగతి వదిలేయండి. నాలాంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నరు. వారికి నాలాంటి పరిస్థితి రాకుండా చూడండి అంటూ మీరు నా మీద జాలి పడినందుకు కృతజ్ఞతలు. నేను కన్న కష్టం చేసి, నా తల్లిదండ్రులు ఇచ్చిన సహకారంతో ఇల్లు కట్టుకున్న. కానీ ఇప్పుడు ఆ ఇల్లు నాది కాదని ఇంట్లో ఉండొద్దని హింస పెట్టి బయటికి పంపించేశాడు నా భర్త. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు  బానిసలాగా పనిచేయించుకొని, ఇప్పుడు ఆరోగ్యం బాగా లేదని పిల్లలు పుట్టరని నన్ను ఒంటరిని చేస్తుండు. నాకు పిల్లలు లేకపోయినా నా భర్తే సర్వస్వము అనుకున్న కానీ ఇప్పుడు ఆయన మనసు మారిపోయింది ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని అనుకుంటుండు. అందుకని నేను కూడా ఆయన సుఖాన్ని కోరుకొని నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకున్న. నా నిర్ణయము తప్పయితే నన్ను క్షమించండి" అంటూ ఫోన్ కట్ చేసింది నిర్మల. 

నిస్సి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నిర్మల ఫోను ఎత్తలేదు. నిజమే ఈనాడు నిర్మల లాంటి స్త్రీలు ఎందరో ఉన్నరు. వారి సమస్యలను బయటికి చెప్పకుండా వారితోనే అంతమై పోవుచున్నవి. స్త్రీలకు ఇంకా స్వాతంత్రం రాలేదు. ఎన్ని  స్వాతంత్ర్య దినోత్సవంలు, ఎన్ని మహిళా దినోత్సవములు జరుపుకున్న... స్త్రీ మానప్రాణాలకు రక్షణలేదు.  స్త్రీ జీవితానికి ఇంకా స్వాతంత్రం రాలేదు.  స్త్రీ ఇంట్ల, బయట అణచివేయబడుతుంది.  కొంతమందికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది.

 నేడున్న చట్టాలు న్యాయస్థానాలు ఏవి కూడా స్త్రీకి రక్షణ ఇవ్వలేక పోతున్నవి. స్త్రీ ఆర్థిక, సామాజిక, స్వావలంబన సాధించే దిశగా తన ప్రస్థానం మొదలుపెట్టాల్సి ఉంది అంటూ మనసులో అనుకుంది నిస్సి.

 వృధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి  అక్కడే ఉండిపోయింది నిర్మల.

***

sister anasuya
jyothirmai_edited.jpg

బోషాణం

  -జ్యోతిర్మయి మళ్ళ, 9296356220

 

"ఏయ్ కమలా పద పద " 

"ఎక్కడికక్కా"

"చప్పుడు చెయ్యకుండా నా వెనకాల రా" రోకలి గోడవారగా నిలబెట్టి, నడుంకి చుట్టి పక్కన దోపుకున్న పైటచెంగు పైకి లాగి చేతులు తుడుచుకుంటూ కదిలింది కాంతం.

"సరేనక్కా"   రోటి పక్కనే ఉన్న గిన్నెలోని నీళ్ళల్లో చేతులు ముంచి తీసి దులిపి  చెంగు తో తుడుచుకుంటూ పైకి లేచి తోటికోడలిని అనుసరించించింది కమల.    

పెరట్లోని వసారాలోంచి వంటగదినీ నడవగదినీ దాటుకుని వరండాలోకొచ్చాక అర్థమయింది కమలకి తామిద్దరూ అత్తగారిని అనుసరిస్తున్నామని. నాలుగడుగుల దూరంలో అత్తగారు వరండా గదిలోంచి అటకమీదికి చెక్కమెట్లు ఎక్కబోతూ అటూ ఇటూ చూసింది. కాంతం తలుపు వెనకాల దాక్కుంటూ కమలని కూడా తన వెనక్కి లాగింది. కమల ఆశ్చర్యంగా చూస్తుంటే నోటిమీద చూపుడువేలు పెట్టి "ష్" అంటూ నవ్వింది. అత్తగారు   ఆఖరి   మెట్టు ఎక్కి   అటకమీదికి వెళ్ళగానే రా అంటూ సైగచేసింది కాంతం. కమలకు అర్థం కావట్లేదు ఇదంతా.       

వర్ధనమ్మ  ఆ ఇంటి పెద్ద. ముగ్గురు కొడుకులూ ఇద్దరు కూతుళ్ళూ ఆవిడకి. చిన్న కూతురుకి నాలుగేళ్ల వయసప్పుడు భర్త చనిపోయి ఇంటి బాధ్యతంతా నెత్తిన పడితే  చెదరకుండా బెదరకుండా ఇంటిని నడిపించిన ధైర్యశాలి. 

 

అందరికీ పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళూ పుణ్యాలూ అన్నీ చూసి ఆ ఇంటి బాధ్యతంతా మోసి ఊళ్ళో అందరి దగ్గరా ‘వర్ధనమ్మ  గొప్ప ధైర్యవంతురాలు, ఎవరి దగ్గరా దేనికీ చెయ్యి చాచకుండా పిసరంత మాట కూడా పడకుండా ఇంటిని నడిపించుకొచ్చింది’ అన్న పేరు తెచ్చుకుంది.  ఆ ఊళ్ళో అమాయకమైన భర్త చాటు ఇల్లాళ్ళందరికీ వర్ధనమ్మ ఒక ఆదర్శం. పెద్ద కొడుకు   సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు అక్కడే కాపరం.  రెండు వారాలకొకసారి ఆదివారం భార్యా పిల్లలను తీసుకుని    ఇంటికొచ్చి రోజంతా   ఉంటాడు. కొడుకులు ముగ్గురూ అమ్మ చెప్పిన మాటను  కలలో కూడా పెడచెవిన పెట్టడం  చేతకాని బుద్ధిమంతులు.  చిన్న కొడుకులిద్దరూ   వ్యవసాయం చూసుకుంటూ   తండ్రి వదిలెళ్ళిన పొలాన్ని నాలుగింతలు చేసిన సమర్ధులు. ఇద్దరు కూతుళ్లకీ పెళ్ళిళ్ళయ్యి అత్తారిళ్ళల్లో చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. పెద్ద కూతురి భర్త ఉద్యోగస్తుడవ్వడం వలనే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారని తన కళ్ల  ముందు తిరుగుతుందని చిన్న కూతుర్ని ఊళ్లోనే వ్యవసాయదారుడికి ఇచ్చి చేసింది.  

 

కాంతం రెండో కోడలు. కాపురానికి వచ్చి పదేళ్ళు అయింది. అత్తగారి మాట జవదాటని ఉత్తమ కోడలు. అయితే అది భయంతో మాత్రమే. నిజానికి వర్ధనమ్మ మాట వినడం ఇష్టం ఉండదు ఆమెకి. భర్త కోప్పడతాడనీ అందరూ గౌరవించే ఇంటిపెద్దని తానొక్కతీ ఎదిరిస్తే అందరి దగ్గరా చులకనయిపోతుందనీ భయపడి ఆమె మాట వింటుంది. అత్తగారి మీద  తనకున్న  కోపాన్ని లోలోపల గొణుగుడుతో తీర్చుకుంటుంది. పదేళ్లనుండీ బయటపెట్టుకోలేని ఆ కోపం ఇదిగో ఇప్పుడు పంచుకోడానికి ఒక మనిషి దొరికింది. నెలరోజుల క్రితమే తనకి తోడుగా ఆ ఇంటికి చిన్నకోడలు రూపంలో కమల వచ్చింది. అన్నదమ్ములిద్దరికీ వయసులో నాలుగేళ్లే తేడా అయినా పెళ్ళిళ్ళు మాత్రం పదేళ్ళ తేడాతో జరిగాయి. కమల పల్లెటూరి పిల్ల. వయసులో బాగా చిన్నది కూడా. తోటికోడలు తనకన్నా చాలా పెద్దది కాబట్టి ఆమె చెప్పినట్లు చేయడం అలవాటు చేసుకుంటోంది కమల.   ఎవరితో ఏం మాట్లాడాలన్నా ఏం చెయ్యాలన్నాముందు కాంతం కి చెప్పి ఆమె చెప్పినట్లే చేస్తుంది.  అత్తగారు చెప్పింది కాంతం బలవంతంగా చేస్తుందని అర్థం చేసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు కమలకి. 

 

ఇద్దరూ చప్పుడు చేయకుండా అటక ఎక్కారు. అటకమీద ఒక వారగా అటేపు తిరిగి కింద  కూచుని ఉంది వర్ధనమ్మ. రెండడుగులు ముందుకి వేసి ఎత్తుగా ఉన్న బియ్యం మూటల వెనక నక్కి కూచున్నారు కాంతం కమలా. అక్కడికెందుకొచ్చామో అత్తగారు అక్కడ కూచుని ఏం చేస్తున్నారో, అసలు ఆమెకి తెలీకుండా దొంగచాటుగా ఆమెని ఎందుకు అలా చూడాలో ఏమీ అర్థం కావట్లేదు కమలకి. అయినా కాంతం ఆసక్తిగా చూస్తుండడంతో తానూ ఆశ్చర్యంగా చూస్తోంది. అక్కడ పెద్ద బోషాణం పెట్టె ఉంది దాని ముందే కూచుని ఉంది  వర్ధనమ్మ. ఆమె చేతుల కదలికను బట్టి పెట్టె తాళం తిప్పి, గొళ్ళెం తీసి మూత పైకెత్తి పెట్టి అందులోని సామాన్లు సర్దుతున్నట్లు అనిపించింది.  ఇదంతా చాలా మెల్లిగా జరుగుతోంది. కమలకి బోరు కొట్టింది. కాంతం మాత్రం ఆసక్తిగా చూసింది అంత సేపూ. కాసేపటికి మూత మూసి గొళ్ళెం పెట్టి తాళం తిప్పినట్లు అనిపించి మూటల వెనక్కి మరింతగా నక్కారు. అత్తగారు మెట్లు దిగి కిందికి వెళ్ళగానే నెమ్మదిగా చప్పుడు చేయకుండా దిగిపోయారు. 

“రోట్లోని బియ్యం రోట్లోనే వదిలేసి ఎక్కడికెళ్ళారిద్దరూ”  తడి బియ్యం మీద  వాలిన ఈగల్ని తోలుతూ అంది వర్ధనమ్మ.

“కమలకి తలనెప్పిగా ఉంటేనూ కాస్త అమృతాంజనం రాద్దామని తీసుకెల్లానత్తయ్యా” అంటూ బొంకింది రోకలి చేతిలోకి తీసుకుంటూ కాంతం. 

 

‘అయ్యో ఇదేంటి నాకు  తలనొప్పేంటీ’ అన్నట్లు చూస్తున్న కమలని  ‘నువ్వూరుకో నేనున్నాగా’ అన్నట్టు కన్నుగీటింది కాంతం. ఏమీ అర్థం కాక కింద కూచుని బియ్యం ఎగదోయడం మొదలుపెట్టింది కమల.  

అత్తగారికి వినపడకుండా  మెల్లిగా చెప్పింది విషయం కాంతం. తను కాపురానికొచ్చిన పదేళ్ళ నుండీ కూడా ఎంత ప్రయత్నించినా ఆవిడ అప్పుడప్పుడూ ఆ పెట్టె దగ్గర అరగంట సేపు కూచుని ఏం చేస్తుందో తనకి అర్థం కావడం లేదని. కమల ఆలోచనలో పడింది.

“ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది అక్కా?” అమాయకంగా అడిగింది.

“అది తెలిస్తే పదేళ్లుగా నాకెందుకీ కష్టాలూ?” దీర్ఘం తీసింది కాంతం. ఇంత అమాయకురాలివేంటే బాబూ అన్నట్లు పెట్టింది ముఖం.

“మరి అత్తగార్నే అడిగేయలేకపోయావా అందులో ఏం ఉన్నాయని” 

“సర్లే, మనం అడిగితే మాత్రం ఆవిడ చెప్పేస్తుందా ఏమిటీ”

“ఇంతకీ పోనీ మనింట్లో ఎవరికేనా తెలుసా లేక ఎవ్వరికీ తెలీదా?”

“ఎవ్వరికీ తెలీదు. ఆ తాళం ఎప్పుడూ ఆవిడ బొడ్డు లోనే దోపుకుంటుంది. ఎవరికీ ఇవ్వదు కూడా”

“అయితే ఏవన్నా విలువైనవి ఉన్నాయంటావా అక్కా, అంటే నగలూ డబ్బూ అలాంటివి?”

“ఏమో, ఎవరికి తెలుసు” ఇన్నాళ్ళయినా కనిపెట్టలేకపోయినందుకూ ఆవిడ ఎవరికీ చెప్పకుండా ఏదో చేసేస్తున్నందుకూ కలిగిన కోపం అంతా   రోకలి పోటుతో తీర్చుకుంటోంది కాంతం. బయటికి చిందే బియ్యాన్ని జాగ్రత్తగా ఎగదోస్తోంది కమల. 

మర్నాడు మద్యాన్నం భోంచేసి వర్ధనమ్మ మంచం మీద పడుకుంది. వేసంకాలమేమో అలిసిన శరీరం గట్టిగా నిద్ర పట్టేసింది ఆమెకి. కాసేపటికే గట్టిగా గురక కూడా మొదలయ్యింది. ఆదమరిచి నిద్రపోతున్న అత్తగార్ని చూడగానే కాంతం బుర్రలో మెరుపులా ఒక ఆలోచన పుట్టింది. తోటికోడలు తోడుందనో ఏమో  గొప్ప ధైర్యంతో ఉంది. కమలని పిలిచి తన ఆలోచన చెప్పింది.

“బాగుండదేమో అక్కా, వద్దు..ఆవిడకి తెలిస్తే చండాలంగా ఉంటుంది.”

“ ఏం పర్లేదు..పదేళ్ళ ఆరాటం ఇవాల్టితో తీరిపోవాలి. నువ్వు పక్కన ఉండు చాలు నేను చూసుకుంటాగా” అంది ధైర్యంగా.

తోటికోడలు తనకన్నా పదేళ్ళు పెద్దది పైగా తను వచ్చి ఇంకా నెలరోజులే అయింది ఆమె మాట కాదనే ధైర్యం లేక భయంగా బిడియంగా కాంతం కి నాలుగడుగులు దూరంగా నడిచింది కమల అత్తగారి మంచం వేపుకి.

 

వర్ధనమ్మ వెల్లికిలా పడుకుని ఉంది. గురకతో లయబద్ధంగా పైకీ కిందికీ కదులుతున్న  ఎత్తైన పొట్టకి దిగువగా కాంతం చూపులు వెతికాయి. నడుం మీద చీరకొంగు దోపుకున్న ప్రాంతంలోనే దోపి ఉన్న చిక్కాం (చిన్న గుడ్డ సంచీ ) కనిపించింది. మెల్లిగా దగ్గరగా వెళ్లి చిక్కాం మీద చేయి వేసింది. పట్టుకుని పైనుండే తడిమిచూసి అందులో తాళం ఉందని నిర్ధారించుకుని మెల్లిగా పైకి లాగే ప్రయత్నం చేసింది. అత్తగారు కళ్ళుతెరిస్తే ఏంటి పరిస్థితని కమలకి కంగారుగా ఉంది. గుండె కొట్టుకోవడం కాసేపు ఆగింది భయంతో ఆమెకి. 

నడుం మీద కలిగిన స్పర్శకి వర్ధనమ్మ గురక ఆగింది. గుండాగినంత పనయింది కమలకి. చిక్కం మీంచి వెంటనే చెయ్యి  తీసేసింది కాంతం. వర్ధనమ్మ కళ్ళు తెరవకుండానే చిక్కాం ని మరింత లోపలికి దోపుకుని పక్కకి తిరిగి పడుకుంది. ఇప్పుడు కాంతం చెయ్యగలిందేమీ లేదు   చిక్కాం వర్ధనమ్మ భారీ శరీరం కిందికి వెళ్లి ఇరుక్కుపోయింది.   

కాంతం నిరుత్సాహంగా పెరట్లోకి వచ్చి బావి పక్కన వేపచెట్టు కింది బండరాయిమీద కూచుంది. కమల కూడా పక్కకి చేరింది. మద్యాహ్నం వేళ అక్కడే కూచుని ముచ్చట్లు పెట్టుకుంటారు కాంతం తో కలిసి ఇరుగుపొరుగు ఇద్దరు ముగ్గురు ఆడాళ్ళు కూడా. చెట్టుకింద చల్లగా ఉంటుందనిన్నూ మగాళ్ళకీ పెద్దాల్లకీ తమ మాటలు వినపడకుండా ఉంటాయనిన్నూ. నెల రోజులుగా గమనిస్తున్న కమలకి అంతా కొత్తగా ఉంది. కాస్త ఇబ్బందిగా కూడా ఉంది అందరూ అత్తా ఆడబడుచుల మీద చాడీలు చెప్పుకోవడం. అక్కడందరూ పెద్దవాళ్ళే వాళ్ళ మాటలు నచ్చడం లేదంటే ఏమనుకుంటారో అని      చిన్న నవ్వు నవ్వడం తప్ప నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆరోజు కమల, కాంతం మాత్రమే ఉన్నారు.   వేరే ఆడాళ్లెవరూ రాలేదు మీటింగుకి. 

“ఛ, ముసిల్ది దెబ్బ తినిపించీసింది. ఎప్పట్నించో అనుకుంటున్నాను గానీ ధైర్యం చాలీది కాదు. ఇప్పుడు నువ్వు తోడున్నావు కదాని దైర్యం చేసాను గానీ పని  మాత్రం అయ్యింది కాదు.” నిరుత్సాహంగా అంది  

“పోన్లే అక్కా, సమయం వచ్చినపుడు అత్తగారే మనకి చూపిస్తుంది కదా, అందాకా తొందరెందుకు?”

“నీ మొహం, ఆవిడ మనకి చూపించేదే అయితే ఎప్పుడో చూపించును. తాళం ఎక్కడా వదలకుండా అంత జాగ్రత్తగా బొడ్లో దోపుకుని ఉంచుకుంటుందంటే కచ్చితంగా మనకి తెలీకూడని రహస్యం ఏదో ఉంది ఆ పెట్టెలో” 

“ఏమో మరి”

“అదీ కాక ఆ పెట్టె ముందు కూచుని అంతంత సేపు ఏం చేస్తుందన్నది కూడా ఎవరికీ తెలీదు. ఒకసారి ఆవిడ వెనకాల అటక మెట్లెక్కబోతుంటే ‘వెళ్లి పని చూసుకో’ అని నన్ను పంపించీసింది. అక్కడే నాకు అనుమానంగా ఉంది”

“ఏమో అక్కా, మరి నాకయితే ఏమీ తెలీదు. మీకే తెలియాలి”

“నా అనుమానం ఇంకో తాళం మన చిన్నాడబడుచు దగ్గర ఉండుండొచ్చు.  ఆవిడ వొచ్చినప్పుడల్లా గుసగుసలాడుకుంటారు తల్లీ కూతుళ్లిద్దరూ “ అంది   దీర్ఘంగా ఆలోచిస్తూ.

“సర్లే, మనకెందుకు మన పనేదో మనం చేసుకుందాం ..ఆ పెట్టెలో ఏముందో ఏంటో సమయం వచ్చినపుడు అదే తెలుస్తుంది. ఇంక దాని సంగతి మర్చిపో అక్కా” అంది తోటికోడలు అంతటితో ఆపేస్తే బాగున్నని ఆశగా ఉంది కమలకి.

కాంతం మనసు మాత్రం బాధగా మూల్గుతోంది తన ప్రయత్నం బెడిసికొట్టినందుకూ, తోటికోడలు తనని సరిగా సమర్ధించడం   లేదనిపిస్తున్నందుకూ కూడా. అక్కడ్నించి కదిలి వంటింట్లోకి వెళ్లి టీ పెట్టే పనిలో పడిపోయారు ఇద్దరూ.  

ఉదయాన్నే వాకిట్లో ముగ్గేస్తూ వినాయకుడి విగ్రహం వేపు చూసింది కాంతం. స్వామి చుట్టూ పువ్వుల్లేవు. ఇంటి ముందు రోడ్డు పడ్డాక ముఖద్వారానికి ఎదురుగా రోడ్డు శూల అలా ఉండకూడదని వినాయకుడి విగ్రహం పెట్టుకున్నారు. వర్ధనమ్మ చీకటితోనే లేస్తుంది. ముందు రోజు సాయంత్రమే పువ్వులు కోసి   పెట్టుకుంటుంది. విగ్రహం చుట్టూ శుభ్రం చేసి  స్నానం చేసి నీళ్ళతో విగ్రహం కడిగి పూలతో అలంకరిస్తుంది. ఇవాళ వినాయకుడికి ఆవిడ సేవలు అందలేదంటే ఏమయి ఉంటుంది కాంతం గాభరాగా లోపలికి పరిగెత్తింది. అత్తగారు ఇంకా మంచం మీదే ఉండడంతో అనుమానంగా దగ్గరికెళ్లి కదిపింది వెంటనే   కెవ్వుమంది  .. వర్ధనమ్మ ప్రాణం గాల్లోకి ఎప్పుడు కలిసిపోయిందో గానీ శరీరం బిగుసుకుపోయి ఉంది. 

 

ఇంటిల్లిపాదినీ ఒక తాటిమీద నడిపించి ఇక తన గమ్యాన్ని వెతుక్కుని వెళ్ళిపోయింది ఆవిడ.. కొడుకులు కూతుర్లంతా దుఃఖపడ్డారు. కుమిలి కుమిలి ఏడ్చారు. ఆమె అంతిమ యాత్ర చూసేందుకు ఊరు ఊరంతా వచ్చారు. పెద్ద కొడుకు లక్ష్మణరావు తలకొరివి పెట్టాడు. మూడ్రోజుల పాటు ఊళ్ళో అంతా ఆవిడ గురించే చెప్పుకున్నారు. మూడోరోజు బంధువులంతా   వెళ్ళారు.  ఇల్లు ప్రశాంతంగా ఉంది.  హఠాత్తుగా కాంతానికి అటకమీద పెట్టె గుర్తొచ్చింది. అత్తగారి చిక్కాం ఎవరు తీసుకున్నారు? హడావిడిలో తను గమనించలేదు. ఆడబడుచులు తీసుంటారా? పెద్ద తోటికోడలు తీసిందా? కమల తీసుంటే కచ్చితంగా తనకే ఇస్తుంది. ఇంతకీ ఎవరు తీసారు? వెంటనే గబగబా అటకమీదికెళ్లి చూసింది. పెట్టె అలాగే ఉంది తాళం కప్ప ముఖాన్న వేలాడేసుకుని. అది తనని చూసి నవ్వినట్లనిపించింది. ఏమీ అర్థం కాక కిందికి దిగి వంటింట్లో పనిలో ఉన్న కమల దగ్గరకెళ్ళి చెప్పింది. 

“అటకమీదికి ఎవరేనా వెళ్ళడం చూసావా ఈ రెండ్రోజుల్లో?” 

“ఏమో చూళ్ళేదక్కా”

“సరే, ఇకనుండీ ఓ కంట కనిపెట్టు “ 

“సరే అక్కా” అని పైకి అన్నదే గానీ ‘ఇంత జరిగినా పెట్టె సంగతి మర్చిపోదే అక్క’ అని అనుకుంది లోపల. 

రాత్రి భోజనాలయాక అందరూ నిద్రపోయేందుకు సిద్దమవుతుండగా  వర్ధనమ్మ చిన్నకూతురు మహేశ్వరి నడవింట్లోకి   రండని కేకేసింది అందర్నీ. తన భర్తా, ముగ్గురన్నలూ, వదినలూ, అక్కా, బావా  అందరూ వచ్చి చేరారు. ఏంటి విషయమన్నట్టు అందరి ముఖాల్లో ఉత్సుకత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. వెనక వరండాలో కబుర్లాడుకుంటున్న పిల్లల్ని కూడా రమ్మని పిలిచింది. అందరూ వచ్చారు గానీ అందరి ముఖాల్లోనూ ఏదో అనుమానం, ఆశ్చర్యం..ఏంటా ఈ మీటింగూ అని. కాంతం గుసగుసలాడింది కమల చెవిలో 

"ఈ డ్రామా చూడూ. అత్తగారు పెట్టెలో  దాచినవన్నీ ఈవిడ నొక్కేసి ఉంటుంది. ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఇప్పుడు అందరిలోనూ ఆ తాళం ఇస్తుంది చూడు ..చూస్తూ ఉండు నా మాట నిజమో కాదో" కమల ఆశ్చర్యంగా చూసిందామెవేపు 'పెట్టె తప్ప ఇంకో ధ్యాస లేదే అక్కకి ' అన్నట్టు.   

 

అందరూ సర్దుకుని కూచున్నాక మహేశ్వరి నోరు విప్పింది.

“మనందరి అవసరాలూ తీర్చింది  ఏ లోటూ లేకుండా   మనందర్నీ చూసింది   ఇక తన అవసరం మనకి లేదనుకుందేమో తన దారి తను చూసుకుంది" గొంతు దుఃఖం తో పూడుకుపోగా చీరచెంగు నోటికడ్డం పెట్టుకుంది. అన్నలు ముగ్గురూ వెళ్ళి ఓదార్చారు చిన్నది కదా   బాగా ముద్దుగా పెరిగింది పైగా ఊళ్ళోనే ఉన్నందువలన అమ్మని రోజూ కలిసేది అందుకే అంతగా బాధపడుతుందని అర్థం చేసుకున్నారు.   అన్నలు సముదాయించాక తమాయించుకుని కళ్ళు తుడుచుకుంది. చీర చెంగున ముడేసి ఉంచిన తాళం విప్పదీసి అందరికీ చూపిస్తూ 

“  అమ్మ తన పుట్టింటి నుండి ఈ ఇంటికి కాపరానికొచ్చినపుడు తెచ్చిన బోషాణం   పెట్టెది ఈ తాళం " అంతా ఆశ్చర్యంగా చూసారు.   కమలా కాంతం ముఖాలు చూసుకున్నారు. 

"తను పోయాక మాత్రమే ఆ పెట్టెను తెరవమని నాకొక తాళం ఇచ్చింది ఎప్పుడో. "   

"నేను చెప్పలేదూ..నా లెక్క తప్పవదెప్పుడూ" కమలకు మాత్రమే వినపడేట్లు చెప్పింది కాంతం.

 వెంటనే పెద్దకోడలు లేచెళ్ళి అల్మారాలోంచి  అత్తగారి చిక్కాం తీసుకొచ్చింది. అందులోంచి కూడా తాళం తీసి చూసారు. రెండూ ఒకేలాంటివి.   అందులో ఆ తాళం తప్ప ఇంకేం లేవు.

"ఇప్పుడే అందరూ ఉండగానే పెట్టె తెరుద్దాం" అంది మహేశ్వరి

"అంత అర్జెంటేఁవుందీ తర్వాత చూసుకోండి" అన్నాడు  లక్ష్మణరావు.

"కాదన్నయ్యా, అందరికీ తెలియాలి అందులో ఏముందో" అంది మహేశ్వరి. ఇద్దరు మగ పిల్లలు  అటకమీదికెళ్ళి జాగ్రత్తగా పెట్టెని మోసుకొచ్చి   మధ్యలో పెట్టారు. అందరూ ఆత్రంగా చూస్తున్నారు.   లక్ష్మణరావు తాళం తిప్పాడు. గొళ్ళెం తీసాడు. మూత పైకెత్తుతుంటే గుండె ఉగ్గబట్టుకుని చూస్తోంది కాంతం. పదేళ్ళ తన కల కొద్ది క్షణాల్లో తీరబోతోంది.

కాంతం కళ్ళు విప్పార్చి చూస్తోంది. పెట్టె నిండుగా ఉంది.   తెల్లని పంచె గుడ్డ కప్పి ఉంది. దానిమీద ఒక కాయితం కనపడింది. లక్ష్మణరావు కాయితం చేతిలోకి తీసి చూసాడు. పెన్సిలుతో రాసున్నాయి దానిమీద అక్షరాలు. తల్లి చేతిరాత ఎలా ఉంటుందో తెలీదు తనకి అసలు ఆమెకి రాయడం వచ్చని కూడా తెలీదు. కానీ నొక్కిపెట్టి పొడిపొడిగా చిన్నపిల్లలు రాసినట్లుగా ఉన్న ఆ చేతివ్రాత తల్లిదే అని గ్రహించాడు.   లేచి నిలబడి అందరూ వినాలని పైకి గట్టిగా చదివాడు.

"  పిల్లలందరికీ నా ఆశీస్సులు. కాపరానికొచ్చినప్పటికి నాకు చదువు లేదు. కానీ చదువుకోవాలని నాకు కోరిక. అత్తగారికీ మావగారికీ తెలిస్తే కోప్పడతారని పడుకునేముందు మీ నాన్న దగ్గర అడిగి నేర్చుకున్న అక్షరాలూ గుణింతాలూ కూడపలుక్కుని రాస్తున్నాను ఈ నాలుగు మాటలూ..నా చీకటి చదువు ఇలా నా చివరి మాటల్ని మీకు వినిపించేందుకు పనికొస్తున్నందుకు సంతోషంగా ఉంది..."  చదవడం ఆపి తలెత్తి చూసాడు లక్ష్మణరావు. అందరూ ఆసక్తిగా వింటున్నారు.  

"....ఈ పెట్టెలో నాలుగు మూటలున్నాయి. ప్రతి దాన్లోనూ ఒక  ఉత్తరం పెట్టాను. అది చదవండి. అందులోనివి   ఎవరికి ఇవ్వాలో రాసాను. వారికి అందించండి.     

 

ఉత్తరం మడిచి కింద పెట్టాడు. మూటలను కప్పి ఉంచిన తెల్లపంచ తీసి పక్కన పెట్టాడు. పెద్ద చెల్లి పరమేశ్వరిని పిలిచాడు.  ఆమె వెళ్ళింది. చిన్న చెక్క బల్ల లాగి మధ్యలో పెట్టింది. మొదటి మూట తీసి చెల్లి చేతిలో పెట్టాడు.  తల్లి తన చీరలను చింపి ఈ మూటలు కట్టిందని అర్థమయింది ఆమెకి. ఆమె దానిని బల్ల మీద పెట్టి ముడి విప్పింది అందరూ బల్ల చుట్టూ దగ్గరగా చేరి ఆత్రుతగా చూస్తున్నారు అందులో ఏముందా అని. విప్పగానే కనిపించింది ఒక కాయితం కవరూ దానిమీద మడతపెట్టిన ఉత్తరం. తీసి అన్నయ్య చేతికిచ్చింది.  విప్పి చదువుతున్నాడు. "ఇందులో పాతిక వేలున్నాయి ..   నా అంత్యక్రియలకి వాడండి. ఆమాత్రం మేం చేయలేమా అని కోపం తెచ్చుకోకండి.  మీరు మాత్రం ఇప్పటికిప్పుడు డబ్బులకోసం ఎక్కడికి పరిగెడతారూ? అందుకే ఈ ఏర్పాటు" లక్షణరావు కళ్ళు తడెక్కాయి. చివరి అక్షరాలు కనపళ్ళేదు అంచనాగా చదివాడు. కవరు తీసి చూసాడు. అన్నీ చిన్న నోట్లు. పెద్ద కట్టలు..ఎంత కష్టపడి కూడబెట్టిందో అమ్మ..అతని కళ్ళు మరింత చెమ్మగిల్లాయి . కట్ట తిరిగి కవర్లో పెట్టి తమ్ముడి చేతికందించాడు. అతను తీసుకెళ్ళి బీరువాలో పెట్టాడు.

రెండో మూట తీసి అందించాడు. బల్లమీద పెట్టి విప్పారు. ఉత్తరం తీసాడు.

 "  ఇందులో పదివేలున్నాయి. నేను ఎలాగూ చదువుకోలేదు..నాలాగ చదువుకు నోచుకోని ఒక్కరినైనా నేను స్కూలు ఫైనలు దాకా చదివించాలని అనుకున్నాను గానీ అది ఎలాగో తెలీక డబ్బు మాత్రం కూడబెట్టాను. ఆపని నాకోసం మీరు చెయ్యండి"

చిన్న పిల్లలందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. అంతా మొహామొహాలు చూసుకున్నారు.  ఆ క్షణమే   ఆవిడ మీద ఆరాధన కలిగింది వాళ్ళకి.  

మూడో మూట పెద్దదిగా ఉంది. కాంతం ఆసక్తిగా చూస్తోంది. అన్నీ పాత వెండి సామాన్లు. 

"ఇవి అమ్మితే ఇరవై వేలన్నా వస్తాయి. నాచుట్టూ  మీరంతా ఉన్నారు. నాకు మీ ప్రేమని పంచారు. కానీ 

పిల్లలుండీ అనాధలుగా వృద్దాశ్రమాల్లో కాలం గడుపుతున్నారట ఎందరో. వాళ్ళ దగ్గరికెళ్ళి సాయం చెయ్యాలని ఎన్నోసార్లు అనిపించింది  గానీ ఆ ధైర్యం చేయలేకపోయాను నేను. ఇల్లు, పొలం తప్ప ఊరు  దాటి బయటికి వెళ్ళడం నాకు తెలిస్తే   కదా!  దగ్గర్లో ఉన్న వృద్దాశ్రమానికి ఈ డబ్బు విరాళంగా ఇవ్వండి.   

"ఎవరెవరి కోసమో ఇవన్నీ  అట్టిపెట్టింది చూసావా" కమల చెవిలో గొణిగింది విమల అక్కసుగా.

తోటికోడలివేపు ఈసారి కాస్త కోపంగా చూసి బావగారు నాలుగో మూటలోని ఉత్తరంలో ఏం చదువుతారో అని అటు చూసింది కమల.  ఊహించని ఆ చూపుని తట్టుకోలేక కళ్ళు దించుకుంది విమల.

 

నాలుగో మూట కొంచం చిన్నగానే ఉంది. కాయితాల కట్ట అది.  విప్పి చూస్తే భూమి తాలూకు పత్రాలు అని అర్థమయింది. ఆశ్చర్యంగా చూసాడు లక్ష్మణ రావు. తమ్ముళ్లిదరినీ దగ్గరికి పిలిచి చూపించాడు.

పెద్దతమ్ముడు వాటిని చేతిలోకి తీసుకుని చూస్తూ “ముందు ఉత్తరం చదువన్నయ్యా” అన్నాడు

“ఇది మీ నాన్న  కొన్న   భూమి పత్రం.   ఇవి ఉన్నట్లు అసలు నాకు తెలీదు.  ఆయన  చనిపోయే ముందు చెప్పారు నాకోసం ఏమీ చేయలేదనీ ఇది ఒకటీ నాపేరున పెట్టాననీ.” నాకు ఎందుకని అడిగితే నీకు నచ్చినవాళ్ళకి ఇచ్చుకుంటావని అన్నారు...”

చెవులు రిక్కించి వింటున్నారు కూతుళ్ళూ కోడళ్ళూ.

“ఈ భూమి అమ్మి ఆ సొమ్ము..” చదవడం ఆపి అందరివేపూ చూసాడు లక్ష్మణరావు

పెద్దాళ్ళందరిలో ఆమెకి ఇష్టమయినవారు ఎవరా అనే ఉత్కంఠ రేగింది. వారి  కళ్ళలోని ఆత్రుతని కనిపెట్టిన లక్ష్మణరావు చదవసాగాడు.   

“....నా ముగ్గురు కోడళ్ళకీ సమానంగా పంచండి.”   

 

కూతుళ్ళు కాసేపు నోళ్ళు తెరుచుకుని ఉండిపోయారు. విమల అవాక్కయి ఉండిపోయింది. కమల తోటికోడలి వేపు అదోలా చూసింది.  ఆ చూపులో ‘చూసావా ఎంత పొరబడ్డావో’ అన్న అర్థం కనపడింది విమలకి.   

“ఇంకా ఉంది వినండి” లక్ష్మణరావు అనడంతో అంతా సైలెంటయ్యారు.  

“...నా ఒంటి మీది బంగారం ఎలాగూ కూతుళ్లకే ఇస్తారు. ఎక్కడో పుట్టి నాలాగే ఈ ఇంటికి వచ్చి ఇంటినీ ఇంటివాళ్ళనీ ప్రేమతో చూసుకునే నా కోడళ్ళకు కూడా నేను ఏదోటి ఇవ్వాలి కదా! ...”

విమలకు కన్నీళ్ళాగడం లేదు. 

ఉత్తరంలో ఇంకా ఇలా ఉంది

“....విమల అసలే అమాయకపుది. మాయా మర్మం తెలీనిది..ఆమెను జాగ్రత్తగా చూసుకోండి”

“అత్తయ్యా” అంటూ కుప్పకూలిపోయింది వర్ధనమ్మ ఫోటో ముందు. నిలువునా ముద్దబంతి పూలమాల అలంకరించుకున్న వర్ధనమ్మ అక్కడ్నించే చిరుమందహాసంతో కోడలిని ఆశీర్వదిస్తోంది.  

jyothi kanchi_edited.jpg

మానస

 - జ్యోతి కంచి, 8639002917

నిశ్శబ్దరాగాలు 

మీరెపుడైనా విన్నారా?

గుండెపై మునివేళ్ళతో తాడనచేసినట్లు,

అండదండ ఉన్న దేవుడు చిరునవ్వునవ్వినట్లు,

పొగడపూలదండ నడుముచుట్టూ చుట్టినట్లు,

వెండిమువ్వల పట్టీలు గల్లునమ్రోగినట్లు,

నేనిప్పుడే విన్నా!

 

వాన జోరుగా కురవడం ఇంకా మొదలుకాలేదు.

మట్టిపరిమళం మత్తుగాసోకింది

కిటీకీలోంచి  చూస్తున్న నాకు 

తొలకరిలో ఓ పసిది కన్పించింది

రేగినజుట్టు

చెదరినబొట్టు

పెదాలపై అందమైన నవ్వు

చేతిలో సంచితో 

పాతడబ్బాలో చిత్తుకాగితాలో ఏరుకుంటూ

కిటికి దగ్గర నించున్న నన్ను చూసి 

'అమ్మా అంత అన్నంపెట్టవా' అంది. 

అది దైన్యంకాదు 

ఆకలి కేక కాదు

సమాజపు చేతగానితనం

ఇంట్లోకిపిలిచి కడుపునిండా తిండిపెట్టా. కట్టుకునేందుకు బట్టలిచ్చా.

ఎవరూలేని అనాధే అయినా 

ఆత్మవిశ్వాసం ఆ పాప నవ్వులో నిండుగా కనిపిస్తోంది

ఎక్కడైనా పనిచేసుకోపోయావా నాప్రశ్ననాకే 

అసహజంగా వినిపించింది

నవ్వింది పిచ్చితల్లి......

పనిమాటున నన్ను వాడుకుంటానన్నారమ్మా

అందుకేఇలానే బాగుంది అంది

కళ్ళుచెమర్చాయి.....

రేపు ఇదేవేళకి కనపడు అనిపంపేశాను.

..........

 

సాయంత్రం ఆయనతో ఓమాటచెప్పా

చెప్పొద్దూ రాత్రంతా ఉద్విగ్నత....

ఉదయాన్నే ఆపాపకోసం ఎదురుచూసాననే చెప్పాలి.

అమ్మాయి రావడంతోనే 

శుభ్రంగా స్నానంచేయమని బట్టలిచ్చాను

కుందనపుబొమ్మలా ఉన్న తన కడుపునిండా భోజనం పెట్టాను...నాఇంట్లో ప్రతిరోజూ నాకెలా సహాయంచేయాలోనేర్పించాను....ప్రతిగా "అ"అక్షరందిద్దించాను....అన్నీనేనై అందించాను

కాలం తనపని తానుచేసుకొంటూనే ఉంది

..........

 

8ఏళ్ళుగడిచాయి

మానస(నేను పెట్టినపేరు)వచ్చిన తర్వాత

నాలోకం మారిందనే చెప్పాలి.

ఇంట్లో ఆడపిల్లవుంటే ఆ సందడే వేరు....

21 ఏళ్ళ నామానస ఇపుడు చదువులతల్లి...

.....

 

సాయంత్రం ఆయన ఆఫీసునుంచి వస్తూ అబ్బాయి ఫోటో తెచ్చినపుడు కాని నాకు మానస అనాధగా నా దగ్గరచేరిందని గుర్తురాలేదు..

ఎక్కడా ఏందాచలేదు నిజాలతోనే పెళ్ళికూతురైంది మానస.

 

ఇపుడు నావయసు 50.

అదే కిటికిలో, అదే తొలకరి, అదే మట్టివాసన.

ఆదివారం ఆఫీసు లీవు కదా మానస వస్తుందని ఎదురుచూస్తున్నా.

 

మానస తన 4ఏళ్ళ పిల్లాడితో వస్తూ చెపుతోంది "అమ్మమ్మ కధలు బాగాచెపుతుంది కదా.నువ్వు అల్లరిచేయకుండా బువ్వతినేయాలి......

 

నాకళ్ళలో సన్నని కన్నీటిపొర...పిల్లలు లేరని నలిగిపోతున్ననాకు మానస మట్టిలోదొరికిన మేలిమి పసిడి..

ఇంట్లోకి వస్తూనే

"అమ్మమ్మా" అంటూ నాలుగేళ్ళ 'రియాజ్' నను చుట్టేసినపుడు...అదిగో అపుడు మోగింది నిశ్శబ్దరాగం....ఎందుకంటే మానస భర్త ముస్లీం...

కులమతాలు కావు....కాసింత బంధాలు పెనవేసుకుంటేచాలు....బ్రతుకు మధురమాససరాగమే.....

©2021 © 2021 Bahula International Magazine

bottom of page