top of page

- నాంపల్లి సుజాత 

nampally

ప్రశ్నించడం ఓ కళ !! 

ప్రశ్న రెండక్షరాలే కావొచ్చు కానీ పాతాళాన్నీ,

ఆకాశాన్నీ కదిపి కుదిపి వెంట తీసుకొచ్చే పాతాళగరిగే. సమాధానానిదేముందీ కుక్క పిల్లలా తోకూపుకుంటూ దాని వెంట రావాల్సిందే.! 

      తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే గానీ ప్రశ్న ఉదయించక మానదు. 

 జ్ఞానాన్వేషణకు, జ్ఞానార్జనకు పునాది ప్రశ్నే మరి.

 మూఢనమ్మకాలను తొలగించుకోవాలన్నా, అంధవిశ్వాసాలని విడనాడాలన్నా, హేతుబద్ధంగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మన ముందు నడిచి తోడ్పడేది ప్రశ్ననే, ఇది సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుంది, విషయ పరిజ్ఞానాన్ని పెంచడమే కాదు అన్యాయాలనీ అసమానతలనీ తుంచేందుకు ఇంతకు మించిన శాంతియుత ఆయుధం ఇంకొకటి కానరాదు.

 ప్రశ్నించే తత్వం కరువైతే మనిషి జీవశ్చవం లాంటి వాడే.

              ప్రశ్నించడం అంటే నిగ్గదీసి, నిలదీసి, దిక్కరించమనీ కాదు, దేనికైనా ఓ నేర్పు ఓర్పు కూర్పు ఉండాల్సిందే ! అందుకే  ప్రశ్నించడం కూడా ఓ కళనే..! కళలని ఆస్వాదించడం అభ్యసించడం అనుకరించడం ద్వారా పరిపుష్టి చేసుకోవచ్చు.

                           ప్రశ్నించడం ద్వారానే ప్రపంచ మహిళలు కొన్నాళ్లుగా తమకు వర్తింప చెయ్యని ఓటు హక్కుని సాధించగలిగారు దానివల్లే నేడు రాజ్యాలకి సామ్రాజ్ఞులుగా సేవలందించే ఎత్తుకు ఎదిగారు.

             వేద కాలం నాటి మహాయోగిని గార్గి గురించి తెలిసే ఉంటుంది. పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ ఆత్మ పరమాత్మల గురించి వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేని మహాజ్ఞాని యజ్ఞవల్క్యుడు ఆమె ప్రశ్నలనే దాటవేస్తాడు. ఆమె అపారమైన మేధస్సుకి ఆశ్చర్యచకితుడై ఆనంద భరితుడైనట్లు ఉపనిషత్తులలో గార్గి జ్ఞాన వెలుగుల ప్రస్తావన  కనిపిస్తుంది.కాబట్టి ప్రశ్నించడం అంటే తమ చుట్టూ కమ్ముకున్న చీకట్లను పారదోలడమే 

        అన్నట్టు తొలుస్తున్న మెదడులోంచి ఉదయించే బాణమే ప్రశ్నంటే..

 గిరగిరా తిప్పి విసిరేసే ఒడిసెలరాయే అది. ప్రశ్నించాలంటే నేర్పు నైపుణ్యంతో పాటు దమ్మూ ధైర్యం కావాలి. ఆశించిన సామర్ధ్యాలను రాబట్టాలంటే ప్రశ్నించేతీరు లోనే ఉంటుంది అసలు ప్రతిభ.

 ఒక ప్రశ్న చైతన్యంలోంచి ఉదయించి వెలుగులను వెంట తెచ్చేదాకా విశ్రమించదు, ఒక ప్రశ్న అసమానతల్లోంచి పుట్టి అగ్నిపర్వతమై నిలదీస్తుంది, ఒక ప్రశ్న తెలుసుకోవాలనే కుతూహలం నుంచి తలెత్తి నూతన ఆవిష్కరణలకు తెరలేపుతుంది. ఆనాటి పాశ్చాత్య గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ప్రజలను మేలుకొలిపింది కూడా ప్రశ్నల ద్వారానే కదా..!

   ప్రశ్నించడం అంటే ఎదుటివారి కోసమే కాదు  నిన్ను నువ్వు చక్కదిద్దుకోవడానికి నీలోకి నువ్వు పయనిస్తూ వేసుకునే స్వీయ బాణం కూడా ప్రశ్ననే..!

              ఇంతటి ప్రయోజనాలున్న ప్రశ్నని నొప్పించక తానొవ్వని రీతిలో సంధించినట్టయితేనే  వచ్చే సమాధానాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ప్రశ్నిస్తున్న నీ పదాల తీరును బట్టే దూరమవుతావో,

చేరువవుతావో తేలిపోతుంది.

నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు..!

 

         కొందరి ప్రశ్నించే విధానాన్ని వింటే నవ్వు తెప్పించకు మానదు.

"నువ్వు నిన్న ఎందుకు రాలేదు? జ్వరం వచ్చిందా? అంటారు.

        వారికి జ్వరం వచ్చిందో రాలేదో గానీ, సమాధానం అయితే 'హా అవును.!' అనే వస్తుంది. అలాగే

       "ఈ సమయం లో నువ్వెక్కడున్నావ్..? బండి మీద ఉన్నావా..?" అంటారు. అప్పుడు ఎదుటి వారి జవాబు వారెక్కడున్నప్పటికీ

" హ..అవును " అనే  వస్తుంది. 

    ప్రశ్న వారిదే జవాబు వారిదే, అయినప్పుడు అడగడం ఎందుకో అర్ధం కాదు.

ప్రశ్నిస్తే దూరమవుతామేమో నని భయపడితే బానిసలమవుతాం..! దూరమూ కాకుండా, బానిసలమూ కాకుండా కూపీ లాగడమే ప్రశ్న  స్వభావం..! అన్నట్టు సమాచార హక్కు కూడా

నీ చేతిలో ఉన్న శక్తివంతమైన అస్త్రం ..!

         ఇంకేం నీకు నువ్వు పారదర్శకంగా ఉంటూ సమయస్ఫూర్తితో కళాత్మకంగా ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకొని

ముందుకు నడవడమే సగౌరవంతో

జీవించడానికి దోహదపడేది..!!

©2021 © 2021 Bahula International Magazine

bottom of page